ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా 132 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వీటిలో చైర్మన్లను కూడా నియమించేసింది. ఈచైర్మన్లలో ఎక్కువగా పాత ముఖాలే ఉండగా.. కొందరు కొత్తవారికి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఏ పార్టీ అయినా.. ఏపనినీ ఊరికేనే చేయదు. తమకు ఏమాత్రం లాభం లేకుండా.. అడుగులు వేయదు. ఇప్పుడు వైసీపీ చేసిన ప్రయోగం కూడా ఆకోవలోకే వస్తుంది. ఎటు పోయి ఎటొచ్చినా.. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి గెలిపించుకునేందుకు సామాజిక వర్గాలను కూడా మచ్చిక చేసుకోవాలనే ప్రధాన క్రతువులో ఈ కార్పొరేషన్ల కూర్పును తెరమీదికి తెచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. దీనిని సంచలనమని ప్రచారం చేసుకున్నా.. తప్పులేదు.
అయితే, ఈ కార్పొరేషన్లు ఏవిధంగా వైసీపీకి అండగా ఉంటాయనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ల ఏర్పాటుతోనే ప్రభుత్వం లేదా.. వైసీపీ పని అయిపోదు. వీటికి నిధులు కేటాయించాలి. ఆ నిధులు సక్రమంగా అమలవుతున్నాయా? లేదా అనే మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇక, కార్పొరేషన్ల చైర్మన్లు కర్రపెత్తనం చేయకుండా కూడా చూసుకోవాలి. ఎక్కడ అసంతృప్తి రేగినా.. మొత్తానికే మోసం వస్తుంది. గతంలో చంద్రబాబు కూడా ఇంత భారీ స్థాయిలో కాకున్నా.. ఆయన కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. చైర్మన్లను నియమించారు. కానీ, జరిగింది ఏమిటి? ఎన్నికల సమయంలో ఊతంగా ఉంటాయనుకున్న కార్పొరేషన్లు చేతులు ఎత్తేశాయి.
పైగా నిధుల దుర్వినియోగం, ఆధిపత్యం, పార్టీలో పదవుల వ్యవహారంలో చీలికలు.. ఇలా ఒకటి కాదు.. సహస్ర సమస్యలతో కార్పొరేషన్ల వ్యవస్థ కుళ్లిపోయింది. ఇది అంతిమంగా పార్టీ ఓటమికి సైతం దారితీసిందనే భావన ఉంది. ఇలాంటి పరిణామమే.. తాజా కార్పొరేషన్లలో చోటు చేసుకునే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. పైగా 50 శాతం మంది మహిళలకు చోటు ఇవ్వడం బాగానే ఉన్నా.. వారిలో ఎందరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు? అనేది కూడా పెద్ద ప్రశ్నే. కుటుంబసభ్యుల జోక్యాన్ని తోసిపుచ్చే పరిస్థితిలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లేదా వైసీపీ వ్యూహం ఖచ్చితంగా అనుకున్న విధంగానే అమలవుతుందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
కార్పొరేషన్ల ద్వారా అంతో ఇంతో లాభాన్ని(ఓటు బ్యాంకు) కోరుకుంటున్న నేపథ్యంలో చైర్మన్లను సర్వస్వతంత్రులను చేయడం కన్నా.. వారిపైనా మానిటరింగ్ వ్యవస్థను సీఎం స్థాయిలో ఏర్పాటు చేయడం ద్వారా లేదా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే పారదర్శక ఫలితాన్ని రాబట్టుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రయోగం మంచిదే అయినా.. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్! అన్నట్టుగా ఉంటే.. కార్పొరేషన్లు కాపాడే పరిస్థితి ఉండదనేది టీడీపీ హయాంలోనే తేలిపోయిన దరిమిలా.. వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on October 20, 2020 5:06 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…