మాస్ లో మంచి ఫాలోయింగ్ తో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు కొట్టిన మాచో స్టార్ గోపీచంద్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే కానీ సరైన కంటెంట్ పడితే జనం ఆదరిస్తాని తెలుసు. కాబట్టే నిర్మాతలు తనతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్లది ఇదే పరిస్థితి. ఇలాంటి కలయికలో ఒక పెద్ద బడ్జెట్ సినిమా రావడం ఆశ్చర్యమే. అంచనాల సంగతి ఎలా ఉన్నా ప్రమోషన్ల రూపంలో విశ్వం చేసిన సౌండ్ వల్ల ప్రేక్షకుల్లో దీని మీద ఆసక్తి కలిగింది. పండగ సీజన్ లో వినోదం అందిస్తే ఆదరిస్తారనే నమ్మకంతో పోటీ మధ్య తీసుకొచ్చారు. మరి మెప్పించేలా ఉన్నాడా
కథ
పాకిస్థాన్ టెర్రరిస్ట్ ఖురేషి (జిస్సు సేన్ గుప్తా) ఇండియాని నాశనం చేసే లక్ష్యంతో ఇక్కడి రాజకీయ నాయకుడు బాచిరాజు (సునీల్) సహాయం తీసుకుంటాడు. ఇద్దరు కలిసి పన్నిన కుట్రను ఒక చిన్న పాప కళ్లారా చూస్తుంది. ఆమె ప్రాణాలు తీసే క్రమంలో ఉండగా పాపను కాపాడేందుకు వాళ్ళ కుటుంబంలోకి విశ్వం (గోపిచంద్) ప్రవేశిస్తాడు. అదే ఇంట్లో ఉండే సమైరా (కావ్య థాపర్) ని గతంలోనే ప్రేమించి ఉంటాడు. అక్కడి నుంచి నాటకీయ మలుపులు చోటు చేసుకుంటాయి. తీవ్రవాదుల నుంచి పొంచి ఉన్న ముప్పుని తప్పించేందుకు విశ్వం పలు సాహసాలు, ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవేంటి ఎక్కడికి దారి తీశాయయనేది తెరమీద చూడాలి
విశ్లేషణ
ట్రెండ్ ఎంత మారినా ఎంటర్ టైన్మెంట్ ని మెప్పించే రీతిలో అందిస్తే ప్రేక్షకులు స్వాగతిస్తారని హీరో, బడ్జెట్ తో సంబంధం లేకుండా చాలా సినిమాలు ఋజువు చేశాయి. శ్రీను వైట్ల అంటే గ్యారెంటీ నవ్వులనే పేరుంది. ఎప్పుడో వచ్చిన దూకుడు, వెంకీ కామెడీని ఇప్పటి సోషల్ మీడియా మీమ్స్ లో వాడుతున్నారంటే వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదంతా గతం. బస్సు నడపడంలో ఎంత గొప్ప అనుభవమున్నా ట్రైన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ జీరో నుంచి ట్రైనింగ్ మొదలుపెట్టాలి. సీనియర్ డైరెక్టర్లు ఇది అలవరచుకోకపోవడం వల్లే డిజాస్టర్లు చూసి త్వరగా రిటైర్ అవుతున్నారు. శీను వైట్ల గత మూడు చిత్రాల్లో అలాంటి పొరపాట్లే జరిగాయి.
అందుకే విశ్వం మీద బాధ్యత పేరుతో బరువు ఎక్కువగా ఉంది. అయినా సరే శీను వైట్ల రిస్క్ చేయకుండా రెగ్యులర్ టెంప్లేట్ లోనే వెళ్లడం ఆశ్చర్యపరుస్తుంది. స్టోరీపరంగా ఎలాంటి కొత్తదనం లేకపోయినా టైం పాస్ చేయించే లక్ష్యంతో అధిక శాతం సీన్లు, ఎపిసోడ్లు రాసుకున్న వైనం స్పష్టమవుతుంది. హీరో హీరోయిన్ మధ్య ఇటలీలో జరిగే లవ్ ట్రాక్ తో కథనాన్ని మాములుగా నడిపించిన వైట్ల ఎక్కువ బరువుని పృథ్వి లాంటి ఆర్టిస్టుల మీద పెట్టేశారు. దాన్ని వాళ్ళు సక్రమంగానే నిర్వర్తించినా కంటెంట్ మరీ రొటీన్ గా ఉండటం చప్పగా అనిపిస్తుంది. ఒకదశ దాటాక ప్రతిదీ ఊహించినట్టే జరుగుతుండటంతో విశ్వం ఎలాంటి ప్రత్యేకత లేకుండా కనిపిస్తాడు.
పాప సెంటిమెంట్ ని సెంట్రల్ పాయింట్ గా పెట్టుకున్నప్పుడు దాని చుట్టూ అల్లుకునే డ్రామాలో ఆడియన్స్ ని కట్టిపడేసే ఎమోషన్ ఉండాలి. అలాని సాగదీయకూడదు. శ్యామ్ ఫ్యామిలీ, అతని భార్యకు పెట్టిన ట్రాజెడీ ఇవన్నీ తాతల కాలం నాటివి. చాలాసార్లు చూసేసినవి. మళ్ళీ రిపీట్ చేయడంతో పాటు అవసరం లేకపోయినా సుదీర్ఘమైన సెంటిమెంట్ సాంగ్ ని పెట్టడం లెన్త్ పెరగడానికి తప్ప ఎందుకు ఉపయోగపడలేదు. పైగా టెర్రరిస్టు విలనిజంకి కాలం చెల్లిపోయింది. దాన్నే తిరిగి వాడుకున్నారు. సరే క్షమిద్దాం. పోనీ ఒక కరుడు గట్టిన తీవ్రవాది చేసే పనులు ఎలా ఉండాలి. తుపాకీలో విద్యుత్ జమాల్ రేంజ్ లో పేలాలి. కానీ విశ్వంలో రివర్స్ లో ఉంటాడు.
ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వెంకీలో ముప్పావుగంట ట్రైన్ ఎపిసోడ్ ని పబ్లిక్ ఎంజాయ్ చేశారని తిరిగి విశ్వంలో ఇంకో రూపంలో బలవంతంగా ఇరికించే ప్రయత్నం సింక్ అవ్వలేదు. కొన్ని జోకులకు నవ్వొచ్చినా మిగిలినదంతా విసిగించే ప్రహసనంగా మారిపోయింది. చమ్మక్ చంద్ర, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి బ్యాచ్ ని ఇలాంటి వాటిలో చూసి చూసి ఎప్పుడో అవుట్ డేట్ అయిపోయాం. ఉన్నంతలో వెన్నెల కిషోర్ నెట్టుకొచ్చి కాస్త నవ్వించాడు కానీ ఈ ట్రాక్ మొత్తం ఫోర్స్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గరో పెద్ద ట్విస్టు పెట్టి దాని నీరుగార్చేలా విశ్రాంతి తర్వాత రాసుకున్న కథనం శ్రీను వైట్ల ఆలోచనల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తుంది.
ఇక ట్రైన్ తతంగం ముగిసాక క్లైమాక్స్ కు దారి తీసే సంఘటనలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడమే కాక లాజిక్స్ కి దూరంగా సిల్లీగా ఉండటం విశ్వంకిచ్చిన బిల్డప్ ని తేల్చి పారేసింది. విశ్వం ఫ్లాష్ బ్యాక్ హ్యాండిల్ చేసిన తీరు గతంలో చూసినట్టే అనిపించడం ఇంకో మైనస్. ఏదైనా అనూహ్యమైంది జరుగుతోందేమోని ఎదురు చూసేకొద్దీ నిరాశ మిగులుతుంది తప్ప ఎలాంటి ఊరట దక్కదు. వీలైనంత త్వరగా ఓల్డ్ స్కూల్స్ నుంచి శ్రీను వైట్ల లాంటి దర్శకులు బయటికి వస్తే తమలోని గొప్ప టెక్నీషియన్స్ సహాయంతో మెరుగైన సినిమాలు తీయొచ్చు. మాస్ ని పదే పదే తేలికగా తీసుకుంటే బాక్సాఫీస్ ఫలితాలు ప్రతిసారి అనుకూలంగా రావు.
నటీనటులు
గోపీచంద్ తన డ్యూటీని ఎప్పటిలాగే సిన్సియర్ గా చేశారు. ఫైట్లు డాన్సులు ఎమోషన్లు వగైరాలన్నీ కొత్తగా లేకపోయినా తన నుంచి దర్శకుడు, ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో దాన్ని ఇచ్చేశాడు. కావ్య థాపర్ గ్లామర్ షో ఎక్కువ, నటన తక్కువ తరహాలో లాగించేసింది. హిందీ మాటలకు తెలుగు డబ్బింగ్ కి చాలా చోట్ల సింక్ అవ్వలేదు. జిస్సు సేన్ గుప్తా రొటీన్. సునీల్, రాహుల్ రామకృష్ణలు పర్వాలేదు. కామెడీ పరంగా పృథ్వి, వెన్నెల కిషోర్ కొంత రిలీఫ్ ఇవ్వగా తమిళ కమెడియన్ విటీవీ గణేష్ పర్వాలేదనిపించాడు. నరేష్, ప్రగతి, అజయ్ ఘోష్ తదితరులు కొత్తగా చేసిందేమి లేదు. చాలా గ్యాప్ తర్వాత భరత్ కనిపించాడు. క్యాస్టింగ్ అయితే చాలా పెద్దదే ఉంది
సాంకేతిక వర్గం
చైతన్ భరద్వాజ్ సంగీతంలో హోరు ఎక్కువయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు కానీ మరీ స్పెషల్ గా అనిపించలేదు. పాటలు ఏదో లాగించారు కానీ మళ్ళీ వినే ఆడియో అయితే కాదు. కెవి గుహన్ ఛాయాగ్రహణంలో అనుభవం తొంగి చేసింది. ఆయన వరకు వంక పెట్టేందుకు ఛాన్స్ లేకుండా వర్క్ చేశారు. గోపి మోహన్, భాను నందు తదితర రచయితలు పని చేసినా ప్రాసలు ఎక్కువ మెరుపులు తక్కువ తరహాలో కొన్ని చోట్ల మాత్రమే పేలాయి. అమర్ రెడ్డి ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ ఉండాల్సింది. పోరాట సన్నివేశాలు కొన్ని బాగా వచ్చాయి. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. ఇటలీ నుంచి హైదరాబాద్ దాకా అడిగినంత ఖర్చు పెట్టేశారు.
ప్లస్ పాయింట్స్
కొన్ని జోకులు
భారీ నిర్మాణం
మైనస్ పాయింట్స్
రొటీన్ కథా కథనాలు
జీరో ఎమోషన్
పాటలు
పేలని కామెడీ
ఫినిషింగ్ టచ్ : విషయం శూన్యం
రేటింగ్ : 2 / 5
This post was last modified on October 12, 2024 12:30 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…