ఇమేజ్ ఉన్న హీరో పెద్ద సినిమా వస్తే బాక్సాఫీస్ కొచ్చే కళే వేరు. ఆగస్ట్ పదిహేను రెండు భారీ బడ్జెట్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరచడంతో అందరి ఆశలు సరిపోదా శనివారం మీదే ఉన్నాయి. దానికి తగ్గట్టే నాని ప్రమోషన్లలో ఎడతెరిపి లేకుండా పాల్గొని మొత్తం తన భుజాల మీద మోయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కమర్షియల్ మూవీస్ హ్యాండిల్ చేసిన అనుభవం లేని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ ని ఎవరూ ఊహించలేదు. ఇన్నేసి అంచనాలు మోసుకొచ్చిన సరిపోదా శనివారం మెప్పించిందా.
కథ
ఎల్ఐసి ఉద్యోగి సూర్య (నాని) కు చిన్నప్పటి నుంచే విపరీతమైన కోపం. తల్లికిచ్చిన మాట కోసం ఆగ్రహాన్ని ఆరు రోజులు అణుచుకుని కేవలం శనివారం మాత్రమే బయటికి తీస్తాడు. సోకులపాలెం ఎస్ఐ దయానంద్ (ఎస్జె సూర్య) పరమ దుర్మార్గుడు. రాజకీయ నాయకుడైన అన్నయ్య కృపానందం (మురళి శర్మ) తో ఆస్తి గొడవ వల్ల ఆ కోపాన్నంతా అమాయకులైన ఊరి జనం మీద చూపిస్తూ ఉంటాడు. అదే స్టేషన్ లో పని చేసే చారులత (ప్రియాంక మోహన్) తో సూర్య పరిచయం ప్రేమగా మారుతుంది. అనుకోకుండా జరిగిన ఒక గొడవ వల్ల సూర్యకు దయానంద్ మీద కోపం వస్తుంది. దాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక ఇద్దరి మధ్య అసలు యుద్ధం మొదలవుతుంది.
విశ్లేషణ
ఏదో ఒక కొత్తదనం లేనిదే అంత సులభంగా ఆడియన్స్ మెప్పు పొందలేని పరిస్థితుల్లో కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేయడం దర్శకులకు కొత్త సవాళ్ళను తీసుకొస్తోంది. ఇప్పటిదాకా తీసిన వాటిలో కామెడీ, ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ ఈ మూడింటినే నమ్ముకున్న వివేక్ ఆత్రేయ పూర్తిగా యాక్షన్ మోడ్ వైపు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. శనివారం మాత్రమే కోపం తెచ్చుకునే సూర్య క్యారెక్టరైజేషన్ లో బోలెడు క్రియేటివిటీ ఉంది. దాని చుట్టూ ఇతర పాత్రలను అల్లుకుని, శాడిస్ట్ తరహా ఒక పోలీస్ ఆఫీసర్ ని విలన్ గా చేయడం ద్వారా తెలివైన నేపథ్యం రాసుకున్న వివేక్ ఆత్రేయ డైవెర్షన్లు లేకుండా సీరియస్ గా చెప్పాలని దానికే కట్టుబడ్డాడు.
సూర్య బాల్యం, తల్లి సెంటిమెంట్, తండ్రి మనస్తత్వం ఇలా ఫ్యామిలీ సెటప్ కు కాస్త ఎక్కువ టైం తీసుకున్నాక సూర్య ఇంట్రో నుంచే కోపం తాలూకు ఎలిమెంట్ ని బలంగా రిజిస్టర్ చేయాలనే ప్రయత్నం నుంచే వివేక్ ఆకట్టుకోవడం మొదలుపెడతాడు. అజయ్ ఘోష్ గూండాలతో పెట్టిన ఫైట్ రెగ్యులర్ తరహాలోనే అనిపించినా దాన్ని డిజైన్ చేసిన తీరు, నేపధ్య సంగీతం దర్శకుడు చెప్పాలనుకున్న మాస్ ఉద్దేశాన్ని సరైన రీతిలో నాటుతుంది. ఆ తర్వాత కరుడు గట్టిన దయా పరిచయం, చారులత ఎంట్రీ, సోకులపాలెం కష్టాలు ఇలా పెద్దగా ఇబ్బంది లేకుండా సన్నివేశాలు జరిగిపోతాయి. మధ్యలో లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ పాట ఇదంతా సోసోగా నడిపిస్తాడు.
ఇద్దరి మధ్య క్లాష్ చుట్టే డ్రామాని నడిపించాలని నిర్ణయించుకోవడంతో సూర్య, దయాల మధ్య అనూహ్యమైన సంఘటనలు ఆశిస్తాం. ఊహాతీతంగా ఏదీ జరగకపోయినా కొన్ని సర్ప్రైజులు ఆశ్చర్యపరుస్తాయి. ఉదాహరణకు పబ్బు ఎపిసోడ్ లో చేతికి దొరికిన దయాని సూర్య వదిలేసే కారణానికి పెట్టిన ట్విస్ట్ భలే అనిపిస్తుంది. దయా, కృపానందం మధ్య సయోధ్య కుదిరేందుకు చూపించిన ట్రాక్ అంత సహేతుకంగా అనిపించకపోయినా నిడివి దృష్ట్యా దాన్ని కొంచెం హడావిడిగా ముగించడం లాంటి లోపాలు లేకపోలేదు. మతి పోయిందే అనిపించేలా హీరో విలన్ మధ్య మైండ్ గేమ్ జరగాలి. అయితే సెకండాఫ్ లో అంత స్కోప్ ఉన్నా సరే పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది.
ఒక బస్తీ జనం కష్టాల్లో ఉంటే హీరో వాళ్ళలో స్ఫూర్తి నింపి ఆపద్బాంధవుడు కావడమనేది రామ్ చరణ్ ఎవడు లాంటి వాటిలో చూశాం. విలనైన పోలీస్ ముఖానికి హీరో వికారంగా అనిపించే గాయం చేయడం ఉదయ్ కిరణ్ శ్రీరామ్ లోనూ చూడొచ్చు. ఇలాంటి రిఫెరెన్సులు కొన్ని ఇందులో లేకపోలేదు. అయితే వివేక్ ఆత్రేయ ట్రీట్ మెంట్ సరిపోదా శనివారంని కొంత డిఫరెంట్ గా మార్చింది. అక్క సెంటిమెంట్ పెట్టినా దాన్ని ఎంత మోతాదులో ఉండాలో అంతే వాడుకోవడం, సాయికుమార్ పోషించిన తండ్రి పాత్రని అతి లేకుండా మితంగా డిజైన్ చేసుకోవడం ఇవన్నీ ఇంటెలిజెంట్ థింకింగ్ కి నిదర్శనం. ఇదే పదును మూడు గంటలు ఉంటే ఇంకా గొప్పగా ఉండేది.
కొన్ని లాజిక్స్ మిస్ చేసినా కూడా సోకులపాలెంని అంత బిల్డప్ తో చూపించిన వివేక్ ఆత్రేయ అక్కడ నివసించే మనుషుల ద్వారా తీవ్ర స్థాయిలో భావోద్వేగాలను రేకెత్తించే ప్రయత్నం అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. దయా బాధితులుగా ఒకే కుటుంబాన్ని పదే పదే చూపించడం దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. అణిచివేత ఎంత తీవ్రంగా ఉంటే తిరుగుబాటు అంత బలంగా పండి హీరో ఎలివేషన్ కు ఉపయోగపడుతుంది. ఇది కొంచెం తగ్గడం వల్ల క్లైమాక్స్ లో పేలాల్సిన ఎమోషన్ పరిమితంగా మిగిలిపోయింది. కొన్ని పాత్రలకు సరైన ఎండింగ్ ఇవ్వలేదు. తండ్రిని చంపింది ఎవరో తెలిశాక కూడా సుప్రీత్ ఏం చేయకుండా ఉండటం కన్విన్సింగ్ గా లేదు.
బలాలు బలహీనతలు సమానంగా మోసిన సరిపోదా శనివారం ఏ మాస్ కోసమైతే ఉద్దేశించబడిందో వాళ్ళను సంతృప్తిపరిచేలానే సాగింది. ఫ్యామిలీ జనాలు దీన్ని ఏ స్థాయిలో ఆమోదిస్తారనేది చెప్పలేం కానీ విసుగు రాకుండా ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ అండతో పాటు తన స్క్రీన్ ప్లే చాకచక్యాన్ని వాడుకుంటూ వివేక్ ఆత్రేయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నాడు. అంటే సుందరానికి తరహాలో ఇక్కడ కూడా నిడివి సమస్యగా మారింది. ప్రతిదీ డీటెయిల్ గా చెప్పాలనే దర్శకుడి ఆలోచనా ధోరణి మారడం అవసరమే. ఎంగేజింగ్ గా ఉంటే ఎన్ని గంటలు ఉన్నా చూస్తారు కానీ నిజంగా ఆ కంటెంట్ అంత డిమాండ్ చేస్తుందా లేదానేది చూసుకోవాలి. మొత్తానికి సూర్య పాసయ్యాడు.
నటీనటులు
నాని ఎప్పటిలాగే అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దసరా అంత హెవీ మాస్ లేదు కానీ ఎంటర్ టైన్మెంట్ తక్కువగా ఉండే ఇలాంటి కథలో తన నుంచి కోరుకున్న ఫైర్ ని తెరమీద ఆవిష్కరించాడు. ఎస్జె సూర్య ఒక్క మాటలో చెప్పాలంటే చితక్కొట్టాడు. దయాగా దయలేని క్యారెక్టర్ లో జీవించాడు. ప్రియాంక మోహన్ క్యూట్ గా ఉంది. కీలక మలుపులకు దోహదపడింది కానీ నటన పరంగా పెద్ద స్కోప్ లేదు. సాయికుమార్ హోమ్లీ ఫాదర్ గా బాగున్నారు. మురళీశర్మకు అలవాటైన పాత్రే. బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంది. హర్షవర్ధన్ కు ప్రాధాన్యం దక్కింది. అజయ్ ఘోష్ పర్వాలేదు. సుప్రీత్, అజయ్, వంశీ చాగంటిలు సోసో. అక్కగా అదితి బాలన్ నప్పింది.
సాంకేతిక వర్గం
సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ బీజీఎమ్ సరిపోదా శనివారంకు పిల్లర్ లా నిలబడింది. కొన్ని చోట్ల సౌండ్ ఎక్కువైనట్టు అనిపించినా ఓవరాల్ గా ఒక కొత్త సౌండ్ తో కంపోజ్ చేసిన తీరు ఆకట్టుకుంది. పాటలు మాత్రం అంతంతమాత్రమే. గుర్తుండవు. మురళి ఛాయాగ్రహణం నిండుగా ఉంది. సినిమాలో అధిక శాతం పరిమిత లొకేషన్లలో ఉన్నా సెట్లకు పెట్టిన భారీతనంతో పాటు దర్శకుడి యాక్షన్ ఆలోచనలను బాగా ఆవిష్కరించింది. కార్తీక శ్రీనివాస ఎడిటింగ్ కొంత నిడివిని అదుపులో ఉంచాల్సింది. రామ్ లక్ష్మణ్ – సతీష్ ఫైట్లు బాగున్నాయి. జిఎం శేఖర్ ఆర్ట్ పనితనం మెచ్చుకోవచ్చు. నిర్మాత డివివి దానయ్య ఖర్చు విషయంలో రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
నాని
ఎస్జె సూర్య పెర్ఫార్మన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కొత్తగా అనిపించే కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్
నిడివి
పరిమితంగా ట్విస్టులు
కుదరని ఎమోషన్స్
పాటలు
ఫినిషింగ్ టచ్ : కోపం సరిపోయింది
రేటింగ్ : 2.75 / 5
This post was last modified on August 29, 2024 2:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి సరికొత్త ప్రాజెక్టును ప్రకటించారు. దీనికి 'తెలుగు తల్లికి జల హారతి' అనే పేరును…
పుష్ప-2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కొద్దిరోజుల క్రితం బేబీ జాన్ ప్రమోషన్లలో నిర్మాత అట్లీ మాట్లాడుతూ రన్బీర్ కపూర్ కి యానిమల్ ఎలా అయితే సూపర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా ఆయన అభిమానులు సినిమాల గురించి నినాదాలు చేయడం…
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్…
సహజంగా అధికారంలో ఉన్నవారికి ఫోన్లు రాకతప్పదు.. వారు ఆన్సర్ చేయకా తప్పదు. కానీ, తనకు ప్రతి శుక్రవారం ఫోన్లు వస్తున్నాయని..…