గత నెల చివర్లో కల్కి 2898 ఏడి తర్వాత చెప్పుకోదగ్గ టాలీవుడ్ సినిమా ఏదీ బాక్సాఫీస్ ని పలకరించలేదు. ప్రభాస్ ప్రభంజనాన్ని ముందే ఊహించిన ఇతర నిర్మాతలు దరిదాపుల్లో పోటీ పడకుండా జాగ్రత్త పడ్డారు. జూలై 12 డబ్బింగ్ మూవీ భారతీయుడు 2 రిలీజైనప్పటికీ దాని ఫలితం తీవ్రంగా నిరాశ పరచడంతో థియేటర్లకు గ్యాప్ వచ్చేసింది. ఇవాళ డార్లింగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియదర్శి హీరోగా, ఇస్మార్ట్ శంకర్ నభా నటేష్ హీరోయిన్ గా అశ్విన్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ నవ్వులు పంచిందా
కథ
ట్రావెల్ ఏజెంట్ గా పని చేసే రాఘవ (ప్రియదర్శి) కు పెళ్ళైన తర్వాత భార్యతో కలిసి పారిస్ లో హనీమూన్ జరుపుకోవాలనే లక్ష్యం ఉంటుంది. తండ్రి కుదిర్చిన సంబంధం ఒప్పుకున్నా పెళ్లి రోజే ఆ అమ్మాయి వేరొకరి కోసం వెళ్లిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఊహించని సంఘటన వల్ల ఆనంది (నభా నటేష్) తో పరిచయమై ఏకంగా మూడు ముళ్ళు వేసే దాకా వెళ్ళిపోతాడు. అయితే మొదటి రాత్రే ఆమెకు మల్టిపుల్ పర్సనాలిటి డిజాస్టర్ అనే వింత జబ్బు ఉందని తెలుసుకుని షాక్ తింటాడు. అక్కడి నుంచి అతని జీవితంలో సర్కస్ మొదలవుతుంది. అదేంటనేది తెరమీద చూడాలి.
విశ్లేషణ
కొన్ని పాయింట్లు వినడానికి బాగుంటాయి. వాటి తెరకు అనుగుణంగా మార్చి ప్రేక్షకులను నవ్వించాలనే టార్గెట్ పెట్టుకున్నప్పుడు చాలా కసరత్తు జరగాలి. దర్శకుడు అశ్విన్ రామ్ వేరే సినిమాల్లో సీరియస్ గా హ్యాండిల్ చేసిన స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ ని కామెడీగా వాడుకుని విభిన్న ప్రయత్నం చేయాలనే ఆలోచన చేయడం బాగానే ఉంది. కానీ రెండు గంటల నలభై నిమిషాల పాటు దాన్ని ఎంగేజింగ్ గా తీర్చిదిద్దాలంటే బలమైన పెన్ పవర్ (కలం బలం) కావాలని గుర్తించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో పాత్రలను పరిచయం చేయడం, వేణు స్వయంవరం తరహాలో పెళ్లి మండపం ట్విస్టు ఇదంతా ఓ మోస్తరుగా జరుగుతూ కష్టం మీద ఓకే అనిపిస్తుంది.
అలాని మొదటి సగం భేష్షుగా ఉందని కాదు. ఏదో వెళ్లిపోయిందనే తరహాలో టైం పాస్ చేయిస్తాడు. ఇంటర్వెల్ దగ్గర ఊహించిందే అయినప్పటికీ ఓ కొత్త ట్విస్టు ఇచ్చిన అశ్విన్ రామ్ సెకండ్ హాఫ్ లో బోలెడు వినోదానికి స్కోప్ ఉన్న అవకాశాన్ని ఎంత మాత్రం వాడుకోలేదు. నవ్వుకి ఎమోషన్ కి మధ్య ఒక కొత్త తరహా ప్రయాణాన్ని చేయించాలనే ఉద్దేశంతో తన అసలు గమ్యాన్ని మర్చిపోయాడు. ఆనందిలో అయిదు షేడ్స్ ఉన్నాయని రివీల్ చేశాక వాటి తాలూకు ఫ్లాష్ బ్యాక్స్ ఆడియన్స్ కి కనెక్టయ్యేలా ఉండాలి. క్లైమాక్స్ లో పండించే భావోద్వేగం పండాలంటే ఆ గతాలను బలంగా రిజిస్టర్ చేయాలి. దర్శకుడు ఈ విషయంలో బ్యాలన్స్ తప్పాడు.
రకరకాల స్లాంగులతో నభా నటేష్ లోని అపరిచితురాలిని బయటికి తీయాలని కంకణం కట్టుకున్న అశ్విన్ రామ్ ఈ క్రమంలో ఓవర్ ది బోర్డు వెళ్ళిపోయి అవసరం లేని తతంగాన్ని ఇరికిస్తున్నానని గుర్తించలేకపోయాడు. ఉదాహరణకు చీర కోసం షాపింగ్ కు వెళ్లే ఎపిసోడ్ లాంటివి హిలేరియస్ గా రాసుకోవచ్చు. కానీ ఇది విసుగొచ్చేలా ఉంటుంది. బెడ్ రూమ్ లో దర్శి, నభల మధ్య జోకులు ఏ మాత్రం పేలలేదు సరికదా ఎప్పుడెప్పుడు అయిపోతాయాని ఎదురు చూసేలా ఉంటాయి. పైగా ఆనందిని మార్చుకోవడానికి రాఘవ చేసే పనులు కన్విన్సింగ్ గా ఉండడానికి బదులు చిరాకు పుట్టిస్తాయి. దీంతో ఆమె బాధను చూసి నవ్వలేక, ఏడవలేక మధ్యలో నలిగిపోతాం.
చాలా సన్నివేశాల్లో దర్శకుడు పడిన అయోమయం తెరమీద కనిపిస్తుంది. ఎంతసేపూ నభాను ఆధారంగా చేసుకునే నవ్వించాలని చూశాడు తప్పించి రాఘవ పడుతున్న ఇబ్బందులను మరింత లోతుగా ఇతర క్యారెక్టర్లతో ముడిపెట్టి ఉంటే డ్రామా ఇంకా బాగా పండేది. ఎంత లాజిక్స్ అవసరం లేకపోయినా ఒకదశలో అతను చేసే పనులు సినిమాటిక్ లిబర్టీని ఎక్కువ వాడుకున్న ఫీలింగ్ కలగడంతో సహజత్వం తగ్గిపోయి కృత్రిమత్వం వచ్చేసింది. పైగా ఆనంది అలా ఎందుకయిందనే పాయింట్ కూడా సరిగ్గా రిజిస్టర్ చేయలేకపోయారు. క్లైమాక్స్ లోనూ ఇదే తంతు కొనసాగింది. ఎక్స్ ట్రాడినరిగా ఏదీ ఉండదనే ఊహకు తగ్గట్టే శుభం కార్డు పడుతుంది.
డార్లింగ్ లో లీడ్ ఆర్టిస్ట్ ఎంపికతో మొదలుపెట్టి స్క్రీన్ ప్లే వరకు చాలా తప్పులే జరిగాయి. అసలు నభా నటేష్ ని అశ్విన్ రామ్ ఏ రేంజ్ లో ఊహించుకున్నాడో కానీ పేపర్ మీదే అయ్య బాబోయ్ అనిపించే రేంజ్ లో డైలాగులు, ఎక్స్ ప్రెషన్లు రాసుకుని దేనికి న్యాయం చేయలేకపోయాడు. పైగా రెండు గంటల నలభై నిమిషాల నిడివి ఎందుకో అర్థం కాదు. తండ్రి కొడుకుల మధ్య ఫన్, స్నేహితులతో సరదా ఇలాంటి చిన్న విషయాలు పర్వాలేదనిపిస్తాయి కానీ అసలైన భార్యా భర్తల కామెడీ డ్రామాని కిచిడి చేయడంతో టైటిల్ కు తగ్గ న్యాయం చేయలేక అశ్విన్ రామ్ చేతులు ఎత్తేశాడు. వినోదాన్ని భారంగా ఫీలవ్వడం ఎలాగో చెప్పేందుకు డార్లింగ్ ఒక చక్కని కేస్ స్టడీ.
నటీనటులు
ప్రియదర్శి అమాయక భర్త పాత్రలో ఒదిగిపోయాడు. ఎలాంటి ఇమేజ్ అడ్డంకులు లేని నటుడు అవసరమయ్యే క్యారెక్టర్ కావడంతో తన టైమింగ్ తో వీలైనంత వరకు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. నభ నటేష్ నటన మొదట్లో బాగానే అనిపించినా క్రమంగా పాత్రలో ఉన్న ఓవర్ డోస్ కు తగ్గట్టే ఓవరాక్షన్ చేయడంతో ఒకదశ దాటాక సహనం కోల్పోతాం. ఇక్కడ ఆ అమ్మాయి తప్పా దర్శకుడు అలా చేయించాడా అంటే చెప్పడం కష్టం. మురళీధర్ గౌడ్, కృష్ణచైతన్య, విష్ణు కొన్ని నవ్వులకు పనికొచ్చారు. బ్రహ్మానందంని లాంటి లెజెండ్ ని మరోసారి వృథా చేశారు. సుహాస్, నీహారిక అలా వచ్చి వెళ్తారు. రఘుబాబు ఓకే. క్యాస్టింగ్ పరంగా లీడ్ రోల్ ఒకటే లోపం.
సాంకేతిక వర్గం
వివేక్ సాగర్ సంగీతంలో ఓ రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. మరీ గుర్తుండిపోయేలా కాదు కానీ విజువల్ గా ఇబ్బంది లేకుండా జరిగిపోతాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది కానీ అక్కడక్కడా సౌండ్ ఎక్కువైపోయి ఎటేటో వెళ్లిన భావన కలుగుతుంది. నరేష్ రామదురై చాయాగ్రహణం నీట్ గా సాగింది. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ మాత్రం లెన్త్ పరంగా ఫిర్యాదు అందుకుంటుంది. ఇలాంటి సబ్జెక్టు డిమాండ్ చేసే నిడివి కాదిది. సాయి హేమంత్ సంభాషణల్లో అక్కడక్కడ మాత్రమే మెరుపులున్నాయి. హనుమాన్ అందించిన ప్రైమ్ ఫోకస్ సంస్థ నిర్మాతలు ఇలాంటి కాన్సెప్ట్ ని చిన్న తారలతో ఎంచుకోవడం, దానికి తగ్గట్టు ఖర్చు పెట్టడం బాగుంది.
ప్లస్ పాయింట్స్
దర్శి పాత్ర
వెరైటీ కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్
విసిగించే సెకండాఫ్
పండని కామెడీ
సుదీర్ఘమైన నిడివి
పండని ఎమోషన్స్
ఫినిషింగ్ టచ్ : బోరింగ్
రేటింగ్ : 2 / 5
This post was last modified on July 19, 2024 1:24 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…