ఆరెక్స్ 100 సెన్సేషనల్ హిట్ తో యూత్ లో గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయకు మళ్ళీ ఆ స్థాయి హిట్టు దక్కకపోయినా అవకాశాలకు కొదవలేకుండా పోయింది. మధ్యలో బ్రేక్ కోసం అజిత్ వలిమై, నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా చేసి తిరిగి హీరో ట్రాక్ వైపు వచ్చేశాడు. బెదురులంక 2012 భారీగా కాకపోయినా ఓ మాదిరి విజయం అందుకోవడంతో దాన్ని మరింతగా పెంచుకోవాలనే లక్ష్యంతో కొత్త కాన్సెప్ట్ అనిపించే భజే వాయు వేగం చేశాడు. యువి కాన్సెప్ట్స్ నిర్మాణం కావడంతో మంచి రిలీజ్ దక్కింది. ఎలా ఉందో చూసేద్దాం పదండి.
కథ
అనాథ అయిన వెంకట్ (కార్తికేయ) ను చేరదీసి కొడుకు రాజు(రాహుల్ టైసన్)తో కలిపి స్వంత బిడ్డలా పెంచుతాడు లక్ష్మయ్య (తనికెళ్ళ భరణి). క్రికెట్ అంటే పడిచచ్చే వెంకట్ అన్నయ్యను తీసుకుని ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్తాడు. బెట్టింగులతో కాలక్షేపం చేస్తున్న టైంలో తండ్రి అనారోగ్యం ముదిరి ఇరవై లక్షలు అవసరమై డేవిడ్(రవి శంకర్) గ్యాంగ్ దగ్గర పందెం కాస్తాడు. ఊహించని విధంగా రెట్టింపు సొమ్ము గెలుచుకుంటాడు. అయితే డేవిడ్ ముఠా డబ్బు ఇవ్వకుండా రివర్స్ లో బెదిరిస్తుంది. దీంతో డేవిడ్ కారు ఎత్తుకుపోయిన వెంకట్ కు దానితో వేల కోట్లు ముడిపడి ఉన్నాయని తెలియక చిక్కుల్లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత మొదలవుతుంది అసలైన స్టోరీ.
విశ్లేషణ
కోట్ల రూపాయల మాఫియా డబ్బుతో ముడిపడిన క్రైమ్ థ్రిల్లర్లు ప్రేక్షకులకు కొత్త కాదు. అయినా సరే వర్కౌట్ చేసుకోవడానికి బోలెడంత స్కోప్ ఉన్న జానర్ ఇది. వెంకటేష్ క్షణ క్షణం నుంచి నిఖిల్ స్వామి రారా దాకా ఎన్నో వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఇదే తరహాలో ఆలోచించాడు కానీ రెగ్యులర్ గా వెళ్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోరని గుర్తించి తండ్రి సెంటిమెంట్ ని బలంగా దట్టించి బెట్టింగుల ద్వారా యువత ఎంత నాశనం అవుతున్నారనే మెసేజ్ ని జోడించాలనుకున్నాడు. కానీ ఊరికే సందేశం రూపంలో వెళ్తే ఎవరూ ఒప్పుకోరు కనక దానికి కమర్షియల్ పూత పూసి సరిపడా ట్విస్టులు గట్రా రాసుకుని భజే వాయు వేగం సిద్ధం చేశాడు.
తొలిసగంలో పెద్దగా చెప్పుకునే విశేషం ఏముండదు. అవసరానికి మించి వెంకట్, లక్ష్మయ్యల అనుబంధాన్ని రిజిస్టర్ చేయాలని ప్రయత్నించడంతో అక్కర్లేని సాగతీత వచ్చేసింది. వీళ్ళ బంధాన్ని ఎంత ఎక్కువ చూపిస్తే అంత మోతాదులో ఎమోషన్ ని పండించవచ్చన్న ప్రశాంత్ ఆలోచన లెక్క తప్పింది. దానికి తోడు ఏ మాత్రం ఆసక్తి కలిగించని లవ్ స్టోరీ మొక్కుబడిగా లెన్త్ కోసం పెట్టడంతో ముప్పావు గంటకు పైగా అసహనం కలుగుతుంది. భరణి మీద కార్తికేయకు ఎంత ప్రేముందో చెప్పటానికి ఎక్కువ తాపత్రయపడ్డారు. హృదయాన్ని తాకేలా ఒక్క సీన్ పెట్టినా పబ్లిక్ ఒప్పుకుంటారు. దాంతోపాటు అన్నదమ్ముల కష్టాలను ఓవర్ గా ఓవర్ ఎక్స్ ప్లాయిట్ చేశారు.
ఇంత సుదీర్ఘమైన ఎస్టాబ్లిష్ మెంట్ల తర్వాత అసలు ట్విస్టు ఇంటర్వెల్ దగ్గరి నుంచి మొదలవుతుంది. బెట్టింగ్ తో మొదలుపెట్టి మాదక ద్రవ్యాలు, మేయర్ కొడుకు తాలూకు ట్విస్టు, హవాలా నోటు పంచాయితీ వగైరాలు గతంలో చూసినట్టే అనిపించినా తన టేకింగ్ తో కాస్త ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేలా చేయడంలో ప్రశాంత్ సక్సెసయ్యాడు. అయితే అన్ని అంశాలు ఒకేసారి చెప్పాలనే తాపత్రయంలో మలుపులు, మెసేజులు ఎక్కువైపోయాయి. వెంకట్, డేవిడ్ ల మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ మరింత థ్రిల్లింగ్ గా రూపొందించాల్సింది. ధృవలో రామ్ చరణ్ అరవింద్ స్వామి రేంజులో అరెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే భజే వాయు వేగం స్థాయి పెరిగేది. అలాని తీవ్ర నిరాశ లేదు.
ఇంత చేసిన ప్రశాంత్ రెడ్డి ఆధునికంగా ఆలోచించాను అనుకుంటూనే రొటీన్ దారిలో వెళ్లడం నిరాశ పరుస్తుంది. ప్రేమకథని తేలికగా ఏదో మొక్కుబడిగా నడిపించడం మొదటి సగంలో బాగా డ్యామేజ్ చేసింది. అసలు కథను తర్వాత చెప్పాలని డిసైడ్ అయినా ప్రేక్షకులను విశ్రాంతి ముందు వరకు ఎలా ఎంటర్ టైన్ చేస్తే బాగుంటుందనే దాని మీద కసరత్తు చేయాల్సింది. పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అయితే కొన్ని కవరైపోతాయి. కానీ కార్తికేయకు ఆ అవకాశం లేదు. కంటెంట్ బాగుంటే తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ తోడవుతాయి. కానీ భజే వాయు వేగంలో ఎక్స్ ట్రాడినరీ మ్యాటర్ లేదు. అయినా మరీ బ్యాడ్ కాకపోవడం నయమనే చెప్పాలి.
లాజిక్స్ సంగతి పక్కనపెడితే వెంకట్ తన చుట్టూ పన్నిన వలయాన్ని ఛేదించుకునే తీరు ఊహించినట్టే సాగడం కొంత మైనస్. క్లైమాక్స్ వచ్చేసరికి దర్శకుడు పాత మూసలోకి వెళ్ళిపోయి హడావిడిగా ముగించడం ఆకలి తీర్చిన భోజనాన్ని తోడుకోని పెరుగుతో ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రశాంత్ రెడ్డిలో టెక్నీషియన్ ప్రూవ్ అయ్యాడు కానీ తనలో రైటర్ ని ఇంకా సానబెట్టాలి. వెబ్ సిరీస్ ల రూపంలో నెలకో రెండు మూడు ఇలాంటి క్రైమ్ ఛేజింగ్ డ్రామాలు ఓటిటిల్లో ధారాళంగా వస్తున్నాయి. అలాంటప్పుడు ఇలాంటి పాయింట్ తో థియేటర్ కు జనాన్ని రప్పించాలంటే మరికాస్త శ్రద్ధ అవసరం. కమర్షియల్ స్థాయిని పెద్దగా ఆశించలేం కానీ డీసెంట్ బాక్సాఫీస్ రన్ దక్కొచ్చు
నటీనటులు
కార్తికేయ ఎలాంటి వంక పెట్టే ఛాన్స్ ఇవ్వకుండా వెంకట్ గా బాగున్నాడు. అవసరమైన మేరకే సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. బెస్టని చెప్పలేం. హీరోయిన్ ఐశ్యర్య మీనన్ మొక్కుబడిగా ఉండిపోయింది. సెకండ్ హాఫ్ లో కొంత ఎడ్జ్ ఇచ్చారు కానీ ఓవరాల్ గా ఈ సినిమా తనకు ఉపయోగపడటం అనుమానమే. చాలా గ్యాప్ తర్వాత కనిపించిన రాహుల్ టైసన్ కొన్ని చోట్ల తేలిపోతే మరికొన్ని సీన్లలో అంతగా అతకలేదు. ఒకదశ తర్వాత సైడయ్యేలా చేశారు. తనికెళ్ళ భరణికి ఇది కొట్టిన పిండి లాంటి వ్యవహారం. స్పెషల్ ఏమి లేదు. రవిశంకర్ మంచి ఛాయస్. శరత్ లోహితస్వ, పృథ్విరాజ్ తదితరులు ఏదో అలా లాగించారు. గుర్తుండే మెయిన్ క్యాస్టింగ్ ఇదే.
సాంకేతిక వర్గం
పాటలు ఎక్కువగా లేకపోయినా ఉన్నది కూడా రధన్ సోసోగా ఇవ్వడంతో సాంగ్స్ పరంగా భజే వాయు వేగంకు వీక్ ఆల్బమ్ పడింది. ఆశ్చర్యకరంగా కపిల్ కుమార్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. కొత్తగా అనిపించే సౌండ్స్ తో మంచి ఫీల్ ఇచ్చాడు. ఆర్డి రాజశేఖర్ ఛాయాగ్రహణంలో విజువల్స్ బాగున్నాయి. యువి బడ్జెట్ కు తగ్గట్టు క్వాలిటీని తెరమీద చూపించారు. సత్య జి ఎడిటింగ్ వీలైనంత లెన్త్ ని కంట్రోల్ లో ఉంచింది కానీ కాస్త అక్కర్లేని సీన్లను కుదించి ఉంటే బాగుండేది. మధు శ్రీనివాస్ సంభాషణలు పర్వాలేదు. యాక్షన్ ఎపిసోడ్లు బాగానే డిజైన్ చేశారు. బడ్జెట్ చేయి దాటిపోకుండా యువి కాన్సెప్ట్స్ నిర్మాణ విలువలు తెలివిగా సాగాయి.
ప్లస్ పాయింట్స్
సెకండాఫ్ ట్విస్టులు
నేపథ్యం
కార్తికేయ పాత్ర
మైనస్ పాయింట్స్
తొలి సగం
హీరో హీరోయిన్ లవ్ ట్రాక్
అంతగా పండని ఎమోషన్
సింపుల్ క్లైమాక్స్
ఫినిషింగ్ టచ్ : ఓ మోస్తరు వేగం
రేటింగ్ : 2.5 / 5
This post was last modified on May 31, 2024 10:29 pm
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…