చిన్నదైనా పెద్దదైనా దిల్ రాజు బృందం నుంచి సినిమా వస్తోందంటే సహజంగానే అంచనాలు నెలకొంటాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి పేరుబడిన ఈ సంస్థ మొదటిసారి ఒక పూర్తి స్థాయి హారర్ సబ్జెక్టుని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అందులోనూ అదే కుటుంబానికి చెందిన ఆశిష్ హీరో కావడంతో సహజంగానే ఏదో బలమైన కంటెంట్ ఉందని ఆశిస్తాం. ట్రైలర్, ప్రోమోలు గట్రా వెరైటీగా అనిపించాయి. పోటీ లేకుండా సోలోగా వచ్చిన లవ్ మీ ఇఫ్ యు డేర్ భయపెట్టిందా లేక భయం పోయేలా చేసిందో చూసేద్దాం పదండి
కథ
దేవుళ్ళ మీద నమ్మకం లేని అర్జున్(ఆశిష్) యూట్యూబ్ ఛానల్ నడుపుతూ మూఢనమ్మకాల మీద వీడియోలు తీస్తుంటాడు. స్నేహితులు ప్రతాప్(రవి కృష్ణ), ప్రియా(వైష్ణవి చైతన్య) చేదోడు వాదోడుగా ఉంటారు. రామచంద్రపురంలోని ఒక పాడుబడిన అపార్ట్ మెంట్ లో దెయ్యం ఉందని తెలుసుకున్న అర్జున్ వెళ్తే ప్రాణాలతో రామని తెలిసినా కూడా రిస్క్ తీసుకుంటాడు. దివ్యవతి పేరుతో ఉన్న భూతాన్ని చూడకుండానే ఇష్టపడి ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి చావు వెనుక కారణాలను స్నేహితురాలు (సిమ్రాన్ చౌదరి) సహాయంతో వెతికే క్రమంలో ఊహించని వాస్తవాలు తెలుసుకుంటాడు. ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఇతని ప్రేమ ప్రయాణమే అసలు స్టోరీ
విశ్లేషణ
ఒకప్పుడు థియేటర్లో పెద్ద తెరపై భారీ సౌండ్ తో దెయ్యాల సినిమాలు చూడటమంటే అదొక వణుకొచ్చే వ్యవహారంలా ఆ జానర్ ని ఇష్టపడే వాళ్ళు తప్ప సామాన్య ప్రేక్షకులు కాస్త దూరంగానే ఉండేవాళ్ళు. క్రమంగా దీంట్లో కామెడీని తీసుకురావడం, భూతాలు ప్రేతాలంటే తమాషా వ్యవహారంగా మార్చేయడంతో సీరియస్ నెస్ తగ్గిపోయి నవ్వులాటగా అయిపోయింది. నిజంగా డెప్త్ తో తీస్తే జనం ఆదరిస్తారని ఆ మధ్య మా ఊరి పొలిమేర 2 నిరూపించింది. ఆ కోవలో చేసిన ప్రయత్నమే లవ్ మీ. దర్శకుడు అరుణ్ భీమవరపు ఆలోచనలో క్రియేటివిటీ ఉంది. మనుషులు ప్రేమించుకోవడం కామన్, అదే హీరో దెయ్యాన్ని లవ్ చేస్తే అనే వెరైటీ ఆలోచన చేశారు.
అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ క్యారెక్టరైజేషన్లతో మొదలుపెట్టి ట్విస్టులకు సంబంధించిన లింకులను ఎస్టాబ్లిష్ చేయడం వరకు ప్రతి చోటా తడబాటు ఏర్పడటంతో థ్రిల్, హారర్ దక్కాల్సిన చోట అవసరం లేని అయోమయమంతా కథనంలోకి వచ్చేసింది. మొదలుపెట్టడమే దెయ్యంతో ఆమె ఆత్మకథని చెప్పించే ప్రయత్నం చేసిన అరుణ్ దాన్ని భీతి గొలిపే రీతిలో ఎస్టాబ్లిష్ చేయకపోవడం దగ్గరి నుంచే సమస్య మొదలైంది. బంగాళాలో అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయని చూపించినప్పుడు వాటికి సరైన కారణాలు చెప్పాలి. అప్పుడే ఆత్మ తాలూకు సంఘర్షణ కనెక్ట్ అవుతుంది ప్రేమ కథా చిత్రమ్ లాగా.
కానీ అరుణ్ భీమవరపు ఈ ప్రాధమిక సూత్రాన్ని విస్మరించి సన్నివేశాలను పేర్చుకుంటూ పోవడంతో ఫస్ట్ హాఫ్ ఏ మాత్రం ఆసక్తికరంగా సాగక ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అర్జున్ వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో ప్రెజెంట్ చేయకపోవడం వల్ల అతను దెయ్యాన్ని లవ్ చేయడమనే తతంగం కన్విన్సింగ్ గా అనిపించదు. కేవలం చూసి వస్తానని వెళ్లినోడు ఏదో లైలా మజ్ను, దేవదాస్ లా అంతగా పరితపించిపోవడానికి న్యాయం జరిగేలా ఏమైనా సీన్లు పెట్టి ఉంటే బాగుండేది. పైగా ఇంటికి ఎవరొచ్చినా ముందు చంపేసే దెయ్యం అర్జున్ కి మాత్రం సకల మర్యాదలు చేసి స్మశానంలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడినట్టు చూపించడం ఎంత మాత్రం అతకలేదు.
ఏదోలా ఇంటర్వెల్ ట్విస్టు దాకా అలా నెట్టుకుంటూ వచ్చినా రెండో సగంలో అసలు కంటెంట్ ఉంటుందని ఆశిస్తాం. దానికి భిన్నంగా అర్జున్ తో గుళ్లో వేదాంతం చెప్పించడం, ప్రియాలో ఊహించని మార్పు వచ్చి హఠాత్తుగా లవ్ డ్యూయెట్ వేసుకోవడం ఇదంతా అసలు స్క్రీన్ మీద ఏం జరుగుతుందో అర్థం కాని స్థితికి తీసుకెళ్తుంది. ప్రేక్షకులను డైవర్ట్ చేయడానికి దెయ్యం ఎవరనే సస్పెన్స్ సృష్టించి, దానికి నలుగురు అమ్మాయిలను ముడిపెట్టి కనుక్కోమనే పజిల్ ఇవ్వడం వరకు బాగానే ఉంది ఇది పండేందుకు కావాల్సిన ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే పూర్తిగా మిస్ అయ్యింది. దీని వల్ల ఇంకో గంట ఉండగానే అసలు దెయ్యం ఎవరో గెస్ చేసే ఛాన్స్ ఇచ్చాడు.
సరే ఇదంతా పక్కనపెడితే సినిమా మొత్తానికి గుండెకాయలా నిలబడే దెయ్యం తాలూకు ఫ్లాష్ బ్యాక్, దాని తాలూకు ఎమోషన్ ఓ రేంజ్ లో ఊహించుకోవడం సహజం. అక్కడా అక్కర్లేని సాగతీతతో తన ప్రేమను, మానసికంగా ఇలా అయిపోవడానికి గల నేపధ్యాన్ని వివరించే విధానం ఉన్న కాస్త థ్రిల్ ని పూర్తిగా తగ్గించేసింది. పైగా అర్జున్ కిచ్చిన ఎండింగ్ ని హఠాత్తుగా తిరిగి మలుపు తిప్పడం కృత్రిమ నాటకీయతను తెచ్చి పెట్టింది. గంటన్నరకు పైగా దెయ్యం ఎవరని చెప్పకుండా షాక్ ఇవ్వబోతున్నానని భావించిన దర్శకుడు మిగిలిన విషయాలను తేలికగా తీసుకోవడం వల్ల క్లైమాక్స్ చప్పగా ముగుస్తుంది. కిల్ మీ ఇఫ్ యు లవ్ అంతో సీక్వెల్ కార్డు వేయడం కొసమెరుపు.
నటీనటులు
ఆశిష్ ఇంకా పరిణితి చెందాలి. ఆర్టిస్టుగా ఎదిగేందుకు ఇలాంటివి సూటవ్వవు. పైగా అన్ని వర్గాలకు దగ్గరవ్వాలంటే ఇవి ఛాయస్ కాదు. ఉన్నంతలో లాగించాడు కానీ ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. వైష్ణవి చైతన్య మొదటి సగంలో డమ్మీగా అనిపించినా విశ్రాంతి తర్వాత తనవరకు పూర్తి డ్యూటీ చేసింది. బేబీ ప్రభావం వల్ల పోలిక వస్తుందేమో కానీ నటన పరంగా వంక పెట్టేందుకు లేదు. ఫ్రెండ్ గా నటించిన రవి కృష్ణ పర్వాలేదు. బాగున్నాడు. సిమ్రాన్ చౌదరి కనిపించేది కాసేపే అయినా కొంత ప్రాధాన్యం ఉండటం వల్ల ఓకే అనిపిస్తుంది. రాజీవ్ కనకాల లాంటి సీనియర్ ఆర్టిస్టు ఒక్క సీన్ కే పరిమితమయ్యాడు. ఇక చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు ఎవరూ లేరు.
సాంకేతిక వర్గం
ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి నేపధ్య సంగీతం మొదలైన కాసేపటి వరకు థీమ్ కు తగ్గట్టు సాగింది కానీ ముందకెళ్లే కొద్దీ ఎలాంటి ప్రత్యేకత అనిపించలేదు. రావాలిరా తప్ప మిగిలిన పాటలు మైనస్ గా నిలిచాయి. పాథోస్ సాంగ్స్ ఎక్కువైపోవడం పంటి కింద రాళ్ళలా అడ్డుపడ్డాయి. సుప్రసిద్ధ ఛాయాగ్రాయకులు పిసి శ్రీరామ్ అనుభవం ప్రతి ఫ్రేమ్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తెరమీద జరిగేది ఎంత వీక్ గా ఉన్నా వీలైనంత దాన్ని కనులకు ఆనేలా చూపించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ వరకు కొంత ల్యాగ్ ని నియంత్రించాల్సింది. హర్షిత్, హర్షిత, నాగ మల్లిడి నిర్మాణ విలువలు అనవసర ఖర్చుని పెట్టలేదు.
ప్లస్ పాయింట్స్
వెరైటీ ఐడియా
టెక్నికల్ వర్క్
మైనస్ పాయింట్స్
అయోమయం స్క్రీన్ ప్లే
సాగదీసిన ఎమోషన్
అతకని పాత్రల సంబంధాలు
పాటలు
ఫినిషింగ్ టచ్ : దెయ్యం లేదు ప్రేమా లేదు
రేటింగ్ : 2 / 5
This post was last modified on May 25, 2024 4:22 pm
ఇండియన్ వెబ్ సిరీస్ల్లో అత్యంత ఆదరణ పొందింది ఏది అంటే మరో మాట లేకుండా ‘ఫ్యామిలీ మ్యాన్’ అని చెప్పేయొచ్చు.…
మాళవిక మోహనన్.. చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు ఒక సెన్సేషన్. బాలీవుడ్లో దిశా పటాని తరహాలో…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి సరికొత్త ప్రాజెక్టును ప్రకటించారు. దీనికి 'తెలుగు తల్లికి జల హారతి' అనే పేరును…
పుష్ప-2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కొద్దిరోజుల క్రితం బేబీ జాన్ ప్రమోషన్లలో నిర్మాత అట్లీ మాట్లాడుతూ రన్బీర్ కపూర్ కి యానిమల్ ఎలా అయితే సూపర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా ఆయన అభిమానులు సినిమాల గురించి నినాదాలు చేయడం…