Movie Reviews

సమీక్ష – ఈగల్

మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ప్రత్యేక అంచనాలు నెలకొంటాయి. అందులోనూ ఎనర్జీతో మేజిక్ చేస్తూ మాస్ క్లాస్ తేడా లేకుండా ఆకట్టుకునే తన మ్యానరిజంకి అందరూ ఫ్యాన్సే. గత ఏడాది ఫలితాలు పక్కనపెడితే ప్రయాగాలకు సిద్ధపడి చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావులు రవితేజలోని కొత్త కోణాన్ని బయటికి తీశాయి. వాటికీ భిన్నంగా ఈగల్ లో అన్ని కమర్షియల్ అంశాలు పొందుపరిచామని టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతూ వచ్చింది. మరి వాళ్ళ మాటలకు తగ్గట్టు ఈగల్ మెప్పించేలా ఉందా

కథ

తలకోన ప్రాంతంలో ఎత్తయిన కొండమీద ఫార్మ్ హౌస్ లో పత్తి ఫ్యాక్టరీ నడుపుతూ ఉంటాడు సహదేవ్(రవితేజ). అడవి తెగల వాళ్ళు అతన్ని దేవుడిగా కొలుస్తూ ఉంటారు . ఢిల్లీలో ఉండే ఒక లేడీ జర్నలిస్టు(అనుపమ పరమేశ్వరన్)కి దీని వెనుక ఏదో రహస్యం ఉందని అర్థమై దాన్ని తెలుసుకునేందుకు అక్కడికి వస్తుంది. విచారణ చేసే కొద్దీ మూలాలు ఎక్కడో యూరోప్ లో తేలుతాయి. ఒక్కొక్కరుగా శత్రువులు బయట పడతారు. ప్రమాదకర ఆయుధాల మధ్య కట్టుదిట్టమైన జీవనం కొనసాగిస్తూ కోట లాంటి చోటుకి చోటికి ఎవ్వరిని రానివ్వని సహదవ్ గతమేంటి, తనకు రచన(కావ్య థాపర్)కు సంబంధం ఎలాంటిది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి.

విశ్లేషణ

యాక్షన్ ని నమ్ముకున్న సినిమాలకు ఒక గ్రామర్ ఉంటుంది. అలా అని కేవలం ఫైట్లతో రెండున్నర గంటలు ప్రేక్షకులను మెప్పించడం అసాధ్యం. కెజిఎఫ్, విక్రమ్ లాంటివి అంత గొప్ప విజయం సాధించాయంటే కేవలం ఎలివేషన్లతో జరగలేదు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ ప్రాధమిక సూత్రాన్ని సీరియస్ గా పాటించకపోవడం ఈగల్ కొచ్చిన ప్రధాన సమస్య. ఎవరూ టచ్ చేయని పాయింట్ అంటూ అరుదైన పత్తి రకం పండించే ఒక గిరిజన ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ దానికి సగమైనా కట్టుబడకుండా అక్కర్లేని డైవర్షన్లకు దారి తీయడం ఈగల్ రైలు బండిని ఎక్కడిక్కడ దారి మీద వెళ్లకుండా పట్టాలు చెప్పేలా చేసింది.

అనుపమ పరమేశ్వరన్ తో లీడ్ తీసుకున్న కార్తీక్ మెల్లగా సహదవ్ ని ఓ రేంజ్ లో ప్రేక్షకుల మెదడులోకి రిజిస్టర్ చేయాలని అవసరం ఉన్నా లేకపోయినా దాదాపు అన్ని పాత్రలతో విపరీతంగా పొగిడించడం, సూపర్ హీరో రేంజ్ లో బిల్డప్ ఇప్పించడం ఒకదశగా దాటాక రిపీట్ అనిపించడం చెక్ చేసుకోవాల్సింది. అంత హైప్ ఇచ్చినప్పుడు మనం సహదేవ్ చేసే పనులు ఓ రేంజ్ లో ఊహించుకుంటాం. కానీ అదేమీ జరగదు. కోట గేటు దాటి ఎవరూ రాకుండా నవదీప్ సహాయంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం తప్ప సహదేవ్ ప్రత్యేకంగా తాను గొప్పవాడిననే తరహాలో చేసే పనులేమీ ఉండవు. ఎవరైనా అక్రమంగా వస్తే బెదరగొట్టి పరిగెత్తించడం తప్ప.

పత్తి రైతుల సమస్యని బ్యాక్ గ్రౌండ్ లో తీసుకున్నప్పుడు కనీసం ఆ థ్రెడ్ ని బ్యాక్ లేయర్ లో నడిపించాలి. కానీ కార్తీక్ ఘట్టమనేని దాన్ని పూర్తిగా విస్మరించి పదే పదే సహదేవ్ ని స్తుతించడంలో మునిగి తేలడంతో అసలు ఉద్దేశం పూర్తిగా పక్కదారి పట్టేసింది. యాక్షన్ బ్లాక్స్ ఎంత బాగా వచ్చినా వాటికి కనెక్ట్ అయ్యేలా ముందు వెనుక వచ్చే సీన్లు ఆసక్తికరంగా లేకపోవడంతో ఫ్యాన్స్ ఏమో కానీ సాధారణ ప్రేక్షకులు వాటిని ఆస్వాదించడానికి లేకుండా పోయింది. పైగా తనను నమ్ముకుని గూడెం జనం కోసం సహదేవ్ ఏదో చేస్తాడని ఆశతో ఎదురు చూసే కొద్దీ ఇంటర్వెల్ దాటి పోతుంది కానీ అది మాత్రం జరగదు. ఇవన్నీ స్క్రీన్ ప్లేలో జరిగిన భారీ తప్పులే.

పోనీ ఈగల్ ఫ్లాష్ బ్యాక్ ని గ్రిప్పింగ్ గా, కొత్తగా మలచి ఉంటే టెంపో మారేది. కానీ అది కూడా రొటీన్ ఫ్లేవర్ లో సాగడం, కావ్య థాపర్ కి తలకోన పత్తి కాన్సెప్ట్ కి ముడిపెట్టాలని చూసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు. ఇద్దరి మధ్య ప్రేమని ఎక్కువ భావోద్వేగంతో చెప్పాలని చూసిన తీరు పండలేదు. సహదేవ్ ఉండే ఇంటి మీదకు టెర్రరిస్టులు, ఆర్మీ, నక్సలైట్లు ఒకేసారి దాడి చేయడమనే పాయింట్ వినడానికి వెరైటీగా ఉన్నా ఎగ్జిక్యూషన్ లోకి వచ్చేటప్పటికి పూర్తి అతిశయోక్తిగా మారిపోయింది. పైగా ఏదో పబ్ జి గేమ్ తరహాలో చిన్న పిల్లాడితో ఈ పోరాటాల గురించి చెప్పించడం కుదరలేదు సరికదా తెరమీద ఆ గేమ్ స్క్రీన్ ని చూపించడం సిల్లీగా అనిపిస్తుంది.

టెక్నికల్ గా కార్తీక్ ఘట్టమనేని చెప్పుకోదగ్గ పనితనాన్ని చూపించాడు. కానీ కథలో ఆత్మని వెనక్కు నెట్టేసి కేవలం మెషీన్ గన్లతో పని జరిపించాలనుకుంటే కష్టం. స్క్రీన్ నిండా బుల్లెట్ల వర్షం, కాళ్లు చేతులు విరిగిపడే రక్తపాతం ఇవన్నీ మాస్ కోసమే అనుకున్నా వాళ్ళతో విజిల్స్ వేయించాలంటే కేవలం ఈ డోస్ సరిపోదు. పైగా మొదటి నుంచి చివరి దాకా పాత్రలతో అవసరానికి మించి గ్రాంథికం సంభాషణలు, గరుడ పురాణం రిఫరెన్సులు సింక్ లేకుండా నడిచాయి. ఇవన్నీ మాస్ బ్యాచ్ కి కొరుకుడు పడని వ్యవహారాలే. ట్రెండ్ మారిందనే పేరుతో కమర్షియల్ సినిమా బేసిక్స్ మర్చిపోయి కేవలం ఎలివేషన్లు, యాక్షన్లు నమ్ముకుంటే ఈగల్ రెక్కలు పరుచుకోవు

నటీనటులు

రవితేజ తనవంతుగా దర్శకుడు అడిగింది పూర్తిగా నెరవేర్చాడు. సీరియస్ టోన్ కాబట్టి కామెడీ ఎనర్జీని వాడుకోలేదు. నటన పరంగా కొత్తగా చెప్పేందుకు ఏం లేదు. అనుపమ పరమేశ్వరన్ ఎంక్వయిరీలు చేసుకుంటూ ఆశ్చర్యపోవడం తప్ప పెర్ఫార్మన్స్ పరంగా మరీ ఛాలెంజ్ అయితే దక్కలేదు. కావ్య థాపర్ కాసేపే కనిపిస్తుంది. జస్ట్ ఓకే. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, శ్రీనివాసరెడ్డి తదితరులవి ఎన్నోసార్లు చూసిన రొటీన్ పాత్రలే. అజయ్ ఘోష్ తో నవ్వించే ప్రయత్నం చేశారు కానీ ఒకదశ దాటాక అవీ తేలిపోయాయి. వినయ్ రాయ్, శివ నారాయణ, నితిన్ మెహతా తదితరులు కాసేపు కనిపించి అలా వెళ్లిపోయే వాళ్లే.

సాంకేతిక వర్గం

కొత్తగా పరిచయమవుతున్న సంగీత దర్శకుడు దేవ్ జాండ్ ఆశించిన అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయాడు. కొన్ని చోట్ల బీజీఎమ్ ఓకే కానీ చాలాసార్లు రిపీట్ అనిపిస్తుంది. పాటలు తక్కువే అయినా ఉన్నవి కూడా మెప్పించలేకపోయాయి. కార్తీక్ తో పాటు ఛాయాగ్రహణం బాధ్యతలు పంచుకున్న కమిల్ – కర్మ్ చావ్లా స్టాండర్డ్ విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంటీరియర్లు, లొకేషన్లు బాగా చూపించారు. మణిబాబు డైలాగులు మరీ పాత చింతకాయ పచ్చడి టైపు. పెద్దగా మెరుపుల్లేవ్. ఎడిటింగ్ బాధ్యతలు కూడా చూసుకున్న కార్తీక్ అవుట్ ఫుట్ ని ఎక్కువ ప్రేమించేసి నిడివిని పెంచాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రాజీ ప్రసక్తే కనిపించలేదు

ప్లస్ పాయింట్స్

కొన్ని యాక్షన్ బ్లాక్స్
సహదేవ్ పాత్ర డిజైన్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

ఫైట్స్ మీదే ఆధారపడటం
ఎక్కువైన ఎలివేషన్లు
ట్రీట్ మెంట్ రొటీనే
సంగీతం

ఫినిషింగ్ టచ్ : గురితప్పిన మెషీన్ గన్

రేటింగ్ : 2.25 / 5

This post was last modified on February 9, 2024 2:34 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సందీప్ కిషన్ సినిమాలో ఫాదర్ ట్విస్టు

రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…

1 hour ago

మహాసేన రాజేష్.. మళ్లీ యుటర్న్

మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…

2 hours ago

నా దగ్గర డబ్బు లేదు-జగన్

దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…

2 hours ago

నారా లోకేష్ కోసం.. రోడ్డెక్కిన‌ నంద‌మూరి కుటుంబం !

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త…

2 hours ago

అంబటికి మళ్లీ అల్లుడి కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…

2 hours ago

ఆర్ఆర్ఆర్ ఇప్పుడు అవసరమంటారా

ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…

5 hours ago