Movie Reviews

సమీక్ష – స్కంద

తెరమీద హుషారుతో చెలరేగిపోయే రామ్ కు ఊర మాస్ కి స్క్రీన్ డెఫినిషన్ రాసే బోయపాటి శీను తోడైతే అభిమానుల అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో వేరే చెప్పాలా. స్కంద ప్రకటన స్టేజి నుంచే జనాల్లో ఒకరకమైన ఆసక్తి కలిగించింది. ఇస్మార్ట్ శంకర్ – అఖండలు చేతులు కలిపారని ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే రిలీజ్ కు ముందు ట్రైలర్లతో ఒక రకమైన అనుమానాలు కలిగినప్పటికీ కమర్షియల్ సినిమాలకు ఇలాంటి ప్రీ టాక్స్ మాములే కనక జనం థియేటర్లకు వెళ్లారు. ఇంతకీ స్కంద భయపెట్టేలా ఉన్నాడా మెప్పించేలా సాగాడా

కథ

ఏపీ ముఖ్యమంత్రి రాయుడు(అజయ్ పుర్కర్)కూతురు పెళ్లి జరగబోతుండగా తెలంగాణ సిఎం రంజిత్ రెడ్డి(శరత్ లోహితస్వ) కొడుకు వచ్చి లేపుకెళ్లిపోతాడు. ఇంకోవైపు ఒక పెద్ద కేసులో సాఫ్ట్ వేర్ కంపెనీ అధిపతి రామకృష్ణరాజు(శ్రీకాంత్)కు ఉరిశిక్ష పడుతుంది. రాయుడు కూతురు లీల(శ్రీలీల)చదువుతున్న కాలేజీలోనే పేరు బయటికి వినిపించని స్కంద(రామ్) చదువుతూ ఆమెను ప్రేమలో పడేస్తాడు. పై రెండు కుటుంబాలు పగతో రగిలిపోతున్న టైంలో స్కంద ఊహించని ట్విస్టు ఇచ్చి ఇద్దరు సిఎంలను కాళ్ళ బేరానికి వచ్చేలా చేస్తాడు. ఇంతకీ అతను అలా ఎందుకు చేశాడు. తండ్రి(దగ్గుబాటి రాజా)కోసం ప్రాణమిచ్చే కుర్రాడు ఈ వ్యూహం ఎందుకు పన్నాడనేదే స్టోరీ.

విశ్లేషణ

దర్శకుడు బోయపాటి శీను రాసుకునే పాయింట్లు గొప్పగా ఉండవు. కానీ ఆయనకు మాస్ పల్స్ తెలుసు. స్టార్ హీరో బొమ్మని చూసి టికెట్ కొని థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడితో విజిల్ వేయించాలంటే ఏం చేయాలనే దాని మీదే ఫోకస్ పెడతారు తప్పించి లాజిక్స్ గురించి ఆలోచించడం ఏ కోశానా ఉండదు. తొలి చిత్రం భద్ర నుంచి ఈ మార్కు మొదలై బాలయ్యతో మూడు బ్లాక్ బస్టర్లు సాధించాక తనలో ఈ నమ్మకం మరింత బలపడింది. ప్రతిసారి ఈ సూత్రం వర్తించదని, ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయని జయ జానకి నాయక, వినయ విధేయ రామ లాంటి స్పీడ్ బ్రేకర్స్ అడ్డుపడి హెచ్చరించాయి. అయినా సరే బోయపాటి రూటు మారలేదు.

స్కందలో టేకాఫ్ చక్కగానే మొదలుపెట్టిన బోయపాటి శీను రామ్ శ్రీలీల ఎపిసోడ్ నుంచి గ్రాఫ్ ని ఎగుడుదిగుడుగా గీసుకుంటూ పోయారు. పచ్చి మొరటోడిగా రామ్ ని ఎస్టాబ్లిష్ చేసి ఆ వెంటనే ఖరీదైన కాలేజీలో స్టూడెంట్ గా సైడ్ ట్రాక్ తీసుకునేలా చేయడం అంతగా సింక్ అవ్వలేదు. కేవలం హీరోయిన్ ని లవ్ లో దింపడానికి చేశారు తప్పించి నిజానికి ఇదంత కన్విన్సింగ్ గా ఉండదు. రామ్ ఓవర్ మాస్ కి ఫిట్ అవుతాడని ఇస్మార్ట్ శంకర్ నిరూపించింది నిజమే. అలా అని అదే హీరోయిజం ఓవర్ ది బోర్డు వెళ్తే జనం అంగీకరించరనే విషయం గుర్తుంచుకుంటే బాగుండేది. ఇలా చేయకపోవడం వల్ల ఫైట్లు ఎంత బాగున్నా మరీ అతిశయోక్తిగా మారాయి.

బోయపాటి సినిమాల్లో చట్టం, న్యాయం తమ చిత్తానికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాయి. అంత పెద్ద హిట్టు సరైనోడులోనూ ఈ లోపాలున్నాయి. కానీ స్కందకు వచ్చేటప్పటికీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మెయిన్ విలన్స్ గా చూపించినప్పుడు వాళ్ళ వైపు నుంచి జరిగే పనులు, తప్పులు అన్నీ ఆ పదవికి తగ్గ రేంజ్ లో ఉండాలి. అంతే తప్ప మరీ ముఖేష్ ఋషి కాలం నాటి క్రూరత్వాన్ని చూపించాలనుకోవడం కొంచెం సిల్లీగానే అనిపిస్తుంది. పోరాట దృశ్యాల్లో ఎంత గొప్ప పనితనం ఉన్నా క్యారెక్టరైజేషన్లలోని లోపాల వల్ల ఆడియన్స్ క్రమంగా తర్కం వెతకడం మొదలుపెడతారు. ఇది పదే పదే జరిగి సాగతీత అనిపించి సెకండ్ హాఫ్ బోర్ కొట్టేస్తుంది.

ఒక లక్ష్యం కోసమే స్కంద ఇదంతా చేస్తున్నాడని, టైటిల్ కార్డుకు ముందు చూపించిన శ్రీకాంత్ ఎపిసోడ్ కు తనకు కనెక్షన్ ఉంటుందని సగటు జనాలు సులభంగానే ఊహిస్తారు. అలాంటప్పుడు ఫ్లాష్ బ్యాక్ ని వీలైనంత వేగంగా నడిపించేసి హీరోని తక్షణ కర్తవ్యం వైపుకి తీసుకురావాలి. కానీ ఎమోషన్లు బలంగా ఉండాలనే ఉద్దేశంతో అవసరానికి మించి ల్యాగ్ ని రామకృష్ణరాజు గతంకి పెట్టడంతో పాటు పావుగంటకు పైగా రామ్ మాయమైపోవడం స్క్రీన్ ప్లే లోపమే. పాత్రల మీద సానుభూతి కోసం ఇలా చేశామని దర్శకుడు అనుకోవచ్చు కానీ గతంలో ఇలాంటివి ఎన్నో చూసిన జనం మెదళ్ళకు కొత్తగా ఏమీ అనిపించనప్పుడు ఎంత రిజిస్టర్ చేసి లాభం లేదు.

తల్లితండ్రుల పట్ల బాధ్యతను ఒక మంచి సీన్ ద్వారా బాగా ప్రెజెంట్ చేసిన బోయపాటి ఇలాంటివి మరికొంత సీరియస్ గా వర్కౌట్ చేసి ఉండాల్సింది. బాలకృష్ణ స్థాయి విగ్రహం రామ్ కు లేదని గుర్తించి కాస్తయినా వాస్తవిక కోణంలో స్కందను రాసుకుని ఉంటే ఇది ఖచ్చితంగా బెటర్ గా ఉండేది. దర్శకుల బలహీనతలను కాపాడే హీరోలు అన్ని వేళలా దొరకరు. అయినా సరే ఎలివేషన్ల ట్రెండ్ లో మాములు కంటెంట్ కూడా పాస్ అవుతున్న పరిస్థితుల్లో స్కందకు ఒకవేళ ఏదైనా గట్టెక్కే ఛాన్స్ ఉందంటే అది కేవలం మాస్ వల్ల మాత్రమే. వాళ్ళు ఏ స్థాయిలో దీన్ని రిసీవ్ చేసుకుంటారనే దాని మీదే హిట్టా ఫ్లాపానే బాక్సాఫీస్ చివరి ఫలితం ఆధారపడి ఉంటుంది.

నటీనటులు

రామ్ కష్టంలో ఎలాంటి లోపం లేదు. విపరీతమైన ఎఫర్ట్ తో డ్యూయల్ షేడ్స్ ని బాగా పోషించాడు. డాన్సులు, ఫైట్లు రెండూ మెప్పించాడు. శ్రీలీలది కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్. ఎలాంటి మెరుపుల్లేవ్. సయి మంజ్రేకర్ సోసోనే. విలన్లు అజయ్ పుర్కర్, శరత్ లోహితస్వలు సౌండ్ ఎక్కువైనా సరిపోయారు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మళ్ళీ దర్శనమిచ్చిన దగ్గుబాటి రాజాకి మంచి పాత్ర దక్కింది. శ్రీకాంత్ కి అలవాటైన రోలే. ప్రిన్స్, కాలకేయ ప్రభాకర్, గౌతమి, ఇంద్రజ లాంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు ఇతర చిన్నా చితక బ్యాచ్ తెరనిండా నిండుగా ఉంది కానీ ఎవరూ గుర్తుండరు. ముప్పాతిక సినిమా స్క్రీన్ మొత్తం రామ్ ఇద్దరు విలన్లే ఎక్కువ కనిపిస్తారు

సాంకేతిక వర్గం

బోలెడు ఆశలు పెట్టుకున్న తమన్ అంచనాలకు తగ్గ స్కోర్ ఇవ్వకపోవడం నిరాశపరుస్తుంది. డాన్సులు బాగా చేయడం వల్ల నీ చుట్టూ, గండరబాయ్ ఓకే అనిపిస్తాయి కానీ ట్యూన్లు మాత్రం మాములే. నేపధ్య సంగీతం మాత్రం హోరు ఎక్కువ సరుకు తక్కువగా మారిపోయింది. తన ప్రత్యేకతను చూపించలేకపోయాడు. సంతోష్ దేతకే ఛాయాగ్రహణంలో ప్రొడక్షన్ వేల్యూస్ గ్రాండ్ గా కనిపించాయి. పనితనం బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కొంచెం పదునుగా ఉండాల్సింది. కోతకు బోలెడు స్కోప్ ఉంది కానీ వదిలేశారు. యాక్షన్ బ్లాక్స్ సుదీర్ఘంగా ఉన్నా బాగానే డిజైన్ చేశారు. నిర్మాణ పరంగా సిల్వర్ స్క్రీన్ అధినేతలను మెచ్చుకోవాలి. అడిగినంత మేర ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

రామ్ నటన
యాక్షన్ బ్లాక్స్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

ఓవర్ హీరోయిజం
సంగీతం
సాగతీత
రొటీన్ కథా కథనాలు

ఫినిషింగ్ టచ్ : మసాలా ప్రియులకు మాత్రమే

రేటింగ్ : 2.5 / 5

This post was last modified on September 28, 2023 1:05 pm

Share
Show comments

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

13 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago