ఒక చిన్న సినిమాకు ముందు రోజు రాత్రి హైదరాబాద్లో షోలు వేస్తే ఫుల్ కావడంలో ఆశ్చర్యం ఏమీ ఉండదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వేసినా అదే సీన్ ఉందంటే మాత్రం జనంలో దాని మీద చాలా ఆసక్తి ఉన్నట్టు స్పష్టం. కలర్ ఫోటో కథకుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్కెఎన్, మారుతీలు సంయుక్తంగా నిర్మించిన బేబీ మీద అంచనాలు ఓ మోస్తరు నుంచి మెల్లగా భారీ స్థాయికి చేరుకున్నాయి. మరి ఇంతగా హైప్ తెచ్చుకున్న ఈ బడ్జెట్ మూవీ వాటిని అందుకుందా
కథ
పదో తరగతిలోనే ప్రేమలో పడతారు వైష్ణవి(వైష్ణవి చైతన్య), ఆనంద్(ఆనంద్ దేవరకొండ). పరీక్ష ఫెయిలైన ఆనంద్ ఆటో డ్రైవర్ గా మారితే ఆ అమ్మాయి ఇంజనీరింగ్ లో చేరుతుంది. అక్కడ పరిచయమైన విరాజ్(విరాజ్ అశ్విన్)తో స్నేహం క్రమంగా ప్రేమ వైపు అడుగులు వేయడం మొదలుపెడుతుంది. గుడ్డిగా ప్రేమలో మునిగి తేలుతున్న ఆనంద్ కు కాలేజీ లోపల ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత ఈ ముక్కోణపు ప్రేమకథ అనూహ్య మలుపులు తిరిగి వీళ్ళ జీవితాలను ఊహించని విధంగా మార్చేస్తుంది.
విశ్లేషణ
ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల ప్రేమను ఆధారంగా చేసుకుని ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క చెప్పడం కష్టం. పోస్టర్లు, ట్రైలర్ చూశాక బేబీ కూడా అదే బాపతని జనాలు ఫిక్స్ చేసుకున్నారు. దర్శకుడు సాయి రాజేష్ కోరుకున్నది ఇదే. అలా మెంటల్ గా ప్రిపేరయ్యి వస్తే తాను చూపించే ట్విస్టులకు, సర్ప్రైజ్ లకు షాక్ అవుతారనేది ఆలోచన. నిజానికిది హీరోయిన్ కోణంలో సాగే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ కాదు. ఒక భగ్న ప్రేమికుడి ఆవేదన, దానికి దారి తీసిన కారణాలను ప్రేక్షకుల గుండెలను మెలిపెట్టేలా చూపించాలనే ఆలోచనతో తీసినది. అందుకే ఓపెనింగ్ సీనే ఆనంద్ తాగుబోతుగా రోడ్డు మీద పడి తిరగడంతో మొదలవుతుంది.
7జి బృందావన్ కాలనీ, ప్రేమిస్తే లాంటి క్లాసిక్స్ ఛాయలు బేబీలో చాలానే కనిపిస్తాయి. అయితే వైష్ణవి, ఆనంద్ ల మధ్య లవ్ ని ఎస్టాబ్లిష్ చేసే క్రమాన్ని చాలాసేపు చూపించడంతో మొదటి గంటలో పెద్దగా మ్యాటర్ కనిపించదు. అయినప్పటికీ తేలికైన సన్నివేశాలతో యూత్ కి టైం పాస్ అయ్యేలా నిక్షేపంగా సాగిపోయింది. ఎప్పుడైతే వైష్ణవి రంగు మార్చుకుని అందగెత్తగా మారుతుందో సరిగ్గా అక్కడో కాంఫ్లిక్ట్ ని సృష్టించారు. కానీ అదంత కన్విన్సింగ్ గా ఉండదు. సాత్వికుడిగా, మంచివాడిగా చూపించిన ఆనంద్ హఠాత్తుగా ప్రియురాలి విషయంలో తన ప్రవర్తనను తీవ్రంగా మార్చుకోవడం సగటు కింది తరగతి మనిషి మనస్తత్వాన్ని ప్రతిబింబించినా కొంచెం ఓవర్ అనిపిస్తుంది.
ప్రీ ఇంటర్వెల్ దాకా ఒకే టోన్ మైంటైన్ చేసిన సాయి రాజేష్ తాను లక్ష్యంగా పెట్టుకున్న లేలేత టీనేజర్స్ ని మెప్పించడంలో ఓ మోస్తరుగా పాస్ అయ్యాడు. ముఖ్యంగా ఆనంద్ వైష్ణవిని నిలదీసే సీన్, దానికి కౌంటర్ గా పబ్బు నుంచి ఆమె ఫోన్ చేసి క్లాసు పీకే సన్నివేశం బాగానే పేలి థియేటర్లో విజిల్స్ వేయిస్తాయి. బేబీ తాలూకు సమస్యని పర్ఫెక్ట్ గా లాంచ్ చేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో దానికి సరితూగే బలమైన కంటెంట్ ని రాసుకోవడంలో తడబడ్డాడు. ఆనంద్ ని గ్రేట్ లవర్ గా చూపించడం కోసం విరాజ్ ని అపరిచితుడు తరహాలో కాసేపు సిన్సియర్ లవర్ గా, కాసేపు కామంతో రగిలిపోయే డబ్బున్నవాడిగా ప్రొజెక్ట్ చేయడం సరిగా లేదు. ఆ పాత్ర చిత్రణ బ్యాలన్స్ తప్పింది.
భావోద్వేగాలను పండించడంలో సాయి రాజేష్ సక్సెస్ అయినా ఒకదశ దాటాక వైష్ణవి చేసిన తప్పులను హద్దులు దాటించడంతో ఆడియన్స్ కి రావాల్సిన సానుభూతి కాస్తా ఆమె మీద ద్వేషంగా మారిపోయింది. దీంతో విధిలేని పరిస్థితిలో రాజీ పడాల్సి వచ్చిందనే పాయింట్ కి బదులు బేబీ ఎందుకిలా చేసిందనే కోపం పెరిగిపోయింది. దీంతో తనవైపు వచ్చిన కన్నీళ్ల కన్నా ఆనంద్ కళ్ళలో కనిపించే బాధే డామినేట్ చేస్తుంది. దర్శకుడి ఉద్దేశం ఇదే అయితే ఓకే కానీ పదే పదే పచ్చి బూతు మాటలతో బేబీ క్యారెక్టర్ ని సెల్ఫ్ అసాసినేషన్(ఔచిత్యాన్ని చంపడం)కి గురి చేయడం ఇబ్బంది పెడుతుంది. ఎంత సహజత్వం కోసమైనా సరే మోతాదు మించింది.
నిజానికి ఇంత నిడివి లేకుండా ఫీల్ తగ్గకుండా బేబీని చెప్పి ఉండొచ్చు. కానీ డిటైలింగ్ కి ప్రాధాన్యత ఇచ్చిన సాయిరాజేష్ ఎమోషన్ ఉంటే మూడు గంటలైనా లెక్క చేయరనే ధీమాతో కత్తెరకు పని చెప్పలేదు. ఇది పెద్ద మైనస్ అయ్యింది. క్లైమాక్స్ ఎలా ఉండబోతోందనే దాని మీద జనాలు ముందస్తుగా సిద్ధమైనట్టు కాకుండా చివర్లో ఇచ్చిన ట్విస్టు అంత సంతృప్తికరంగా లేకపోవడం ఫలితాన్ని శాశించవచ్చు. ఆనంద్, విరాజ్, వైష్ణవిల మధ్య దోబూచులాటకు కొన్ని వెరైటీ మలుపులు పెట్టిన దర్శకుడు చివరికి ఆనంద్ విషాదాన్నే ఎక్కువ ఫోకస్ చేయడంతో చివరి అరగంట బేబి నిస్సహాయంగా ఏడవడం తప్ప చేయడానికి పెద్దగా పనేం లేకుండా పోయింది.
నిస్సందేహంగా బేబి మంచి ప్రయత్నమే. తెలిసో తెలియక మనం చేసే తప్పులు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో, ఎన్ని జీవితాలను పతనానికి తీసుకెళ్తాయో చెప్పే అంతర్గత సందేశంతో సాయి రాజేష్ ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అయితే బోల్డ్ గా ఉంటేనే బాగా రీచ్ అవుతుందనే ఉద్దేశంతో రియల్ లైఫ్ లో అభ్యంతరకర పదాలను ఎక్కువ సేపు వాడటం కుటుంబ వీక్షకులను ఇబ్బంది పెడుతుంది. మ్యూట్లు ఎన్ని పెట్టినా అక్కడ మాట్లాడుతున్నదేంటో సులభంగా అర్థమైపోతుంది. లక్ష్యంగా పెట్టుకున్నది కేవలం పాతికేళ్ల వయసు లోపల వాళ్లనే అనుకుంటే బేబి వాళ్ళ అండతోనే బాక్సాఫీస్ గట్టెక్కొచ్చు కానీ అదెంత మేరకు సఫలమవుతుందో చెప్పలేం.
నటీనటులు
ఆన్ లైన్ జనాలకు మాత్రమే ఎక్కువ పరిచయమున్న వైష్ణవి చైతన్య తనకు దొరికిన లైఫ్ టైం ఆఫర్ ని సంపూర్ణంగా వాడేసుకుంది. బేబీ పాత్రను ఇంతకన్నా బెటర్ గా మరొకరు చేసుండగలరు అనే ఊహే రాకుండా ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆనంద్ దేవరకొండ పెర్ఫార్మన్స్ పరంగా చాలా మెరుగయ్యాడు. ఇంత పరిణితి ఎలా వచ్చిందబ్బా అనిపించేలా చాలా సహజంగా ఒదిగిపోయాడు. వీళ్ళతో పోలిస్తే విరాజ్ అశ్విన్ కు అంత స్కోప్ దక్కకపోయినా పర్వాలేదు. ఆనంద్ తండ్రి, స్నేహితుడిగా నాగబాబు, హర్ష చెముడులకు రేంజ్ తగ్గ పాత్ర పడలేదు. ఇంకొంచెం సరిగా డిజైన్ చేసుంటే బాగుండేది. ముగ్గురి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఇతరులకు అంతగా స్కోప్ దక్కలేదు.
సాంకేతిక వర్గం
బేబీకి విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం ఆయువుపట్టుగా నిలిచింది. సోల్ ని పక్కకు తీసుకెళ్లకుండా ఒకే మూడ్ ని టైటిల్ నుంచి చివరి క్రెడిట్స్ దాకా తీసుకురావడంలో తన పనితనం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది . ఆల్రెడీ హిట్టయిన పాటలను సందర్భోచితంగా వాడటం విజువల్ గా మంచి ఫీల్ ఇచ్చాయి . ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చిన పొగడ్తలకు కెమెరా మెన్ బాల్ రెడ్డి సంపూర్ణంగా అర్హులే. ప్రొడక్షన్ వేల్యూస్ లోని పరిమితులకు కవర్ చేసుకుంటూ ఆయన అనుభవాన్ని వాడుకున్న తీరు సింప్లీ సూపర్బ్. విప్లవ్ ఎడిటింగ్ లెన్త్ ని సీరియస్ గా తీసుకుని ఉండాల్సింది. సంభాషణలు కొన్ని చోట్ల గొప్పగా పేలాయి. ఎస్కెఎన్ – మారుతీల నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
వైష్ణవి, ఆనంద్ నటన
ఇంటర్వెల్ బ్లాక్
సంగీతం
మైనస్ పాయింట్స్
నిడివి
సెకండ్ హాఫ్ క్యారెక్టరైజేషన్స్
స్లో నెరేషన్
ఫినిషింగ్ టచ్ : బోల్డ్ బేబీ
రేటింగ్ : 2.5 / 5
This post was last modified on July 14, 2023 2:14 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…