Movie Reviews

సమీక్ష – ఆదిపురుష్

ఒక సినిమాకు ఎన్ని థియేటర్లు వేసినా అడ్వాన్స్ గా హౌస్ ఫుల్ కావడం చూసి ఎన్నో నెలలయ్యింది. అందులోనూ బాలీవుడ్ లో పఠాన్ తర్వాత ఆ స్థాయి ర్యాంపేజ్ ఒక్క ఆదిపురుష్ విషయంలోనే కనిపించింది. ప్రమోషన్ల హడావిడి లేకపోయినా, హీరో విదేశాలకు వెళ్లాల్సి వచ్చినా ఇంత హైప్ చూస్తే ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టామినా ఏ రేంజ్ కు చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి రాముడి సెంటిమెంట్ తోడవ్వడంతో బెనెఫిట్ షోల నుంచే కిక్కిరిసిపోతున్న హాళ్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆదిపురుషుడి గాథ మెప్పించిందా లేదా

కథ

అరణ్యకాండ నుంచి రావణ సంహారం దాకా ఇందులో చూపించారు. పద్నాలుగేళ్ళు వనవాసం చేయమనే తండ్రి కోరిక మేరకు సతీసమేతంగా అడవికి వస్తాడు రాముడు(ప్రభాస్). చెల్లి శూర్పణఖ ముక్కుని లక్ష్మణుడు కోశాడన్న ఆగ్రహంతో రావణాసురుడు (సైఫ్ అలీఖాన్) పన్నాగం చేసి సీతను ఎత్తుకుపోతాడు. దీంతో వానర జాతికి చెందిన సుగ్రీవసేన సహాయంతో హనుమంతుడిని తీసుకుని రాముడు లంకపై దండయాత్రకు బయలుదేరతాడు. ఆపై జరిగే యుద్ధంలో గెలుపు, లోక కళ్యాణం ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే

విశ్లేషణ

పురాణాలు, ఇతిహాసాలు ఇప్పటి తరానికి కొత్త టెక్నాలజీ సహాయంతో చెప్పడం అవసరమే. మూడు గంటల లవకుశలు, గ్రాఫిక్స్ జాడలేని సంపూర్ణ రామాయణాలు వాళ్లకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. దర్శకుడు ఓం రౌత్ ఈ ఆలోచనతోనే ఆదిపురుష్ ని రాసుకున్నాడు. అయితే మూలాలు మర్చిపోకుండా, ఆత్మ చెడిపోకుండా చెప్పడానికి చాలా నైపుణ్యం కావాలి. కేవలం హంగులతోనే ఆడియన్స్ ని ఆకట్టుకోలేం. ఇది ప్రాథమిక సూత్రం. ఎందుకంటే రామాయణం ఇప్పటికే కొన్ని వేల సార్లు వివిధ రూపాల్లో జనం మధ్యలోకి వచ్చింది. పుస్తకాలు, నవలలు, చందమామ బొమ్మలు, సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ లు ఇలా ఎన్నెన్నో

అందుకే కథ విషయంలో ఎలాంటి ఉత్సుకత ఉండదు కాబట్టి ఆ మేజిక్ అంతా కథనంలో చూపించాలి. నెరేషన్ ని ఓం రౌత్ స్ట్రెయిట్ గానే మొదలుపెట్టారు. అవసరం లేని సీన్లు పెద్దగా ఉండవు. అయితే ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాముడిని సూపర్ హీరో రేంజ్ లో చూపించాలన్న తాపత్రయం ఇంట్రో దగ్గరి నుంచి మొదలవుతుంది. వేలాది విషపక్షుల గుంపు సీత మీద దాడి చేయడానికి వస్తే వాటిని తరమడానికి రాముడు ఉపయోగించే అస్త్ర నైపుణ్యం వినడానికి బాగానే ఉంది కానీ స్క్రీన్ మీద మాత్రం ఓవర్ ది బోర్డ్ వెళ్లిపోయింది. పిల్లలకు నచ్చే అవకాశాలను కొట్టిపారేయలేకపోయినా మరీ ఇంత బిల్డప్ అయితే అవసరం లేదు అనిపిస్తుంది.

రామ లక్ష్మణుల ప్రయాణం, సుగ్రీవుడిని కలిశాక అతని సాయం కోసం మోసగాడైన వాలిని చంపడం, రామసేతు కోసం సముద్రుడితో సంభాషణ లాంటి ఎపిసోడ్స్ బాగానే వచ్చాయి. త్రీడిలో మంచి అనుభూతి కలిగించాయి. అయితే కొన్ని కీలకమైన ఘట్టాలను హఠాత్తుగా ముగించడం చేతులారా గూస్ బంప్స్ ఇచ్చే అవకాశాన్ని తగ్గించేశాయి. ఉదాహరణకు హనుమంతుడి తోకతో లంకను తగలబెట్టే క్రమం మాస్ తో విజిల్స్ కొట్టించాలి. కానీ కొన్ని నిమిషాలకే పరిమితం చేశారు. లక్ష్మణుడిని బ్రతికించడం కోసం హనుమంతుడు సంజీవిని పర్వతం మోసుకురావడం సింపుల్ గా జరిగిపోయింది. కిడ్స్ ని టార్గెట్ చేసినప్పుడు ఇవన్నీ చప్పట్లు కొట్టించేలా డిజైన్ చేసుకోవాలి

పాత్రలను సింపుల్ గా పరిచయం చేసిన ఓం రౌత్ అసలైన రావణాసురుడిని మాత్రం చాలా బ్యాడ్ గా ప్రెజెంట్ చేశాడు. ఆ క్యారెక్టర్ డిజైనింగే తేడా కొట్టింది. బ్రాహ్మణుడైన రావణుడు రాకాసి గద్దకు పెద్ద పెద్ద మాంసం ముద్దలు పెట్టడం, అనకొండ పాములతో ఒళ్ళంతా పాకించుకోవడం ఇవన్నీ సహజత్వానికి చాలా దూరంలో నిలిచిపోయాయి. ఆయన ఒంటి మీద జంధ్యం పెట్టాలన్నంత రీసెర్చ్ చేసినప్పుడు ఇలాంటివి కూడా సీరియస్ గా పట్టించుకోవాలి. పైగా జావేద్ హబీబ్ డిజైన్ చేసినట్టుగా ఉన్న హెయిర్ స్టైల్ ఎంత మాత్రం నప్పలేదు. ఇలా అసలు ప్రతినాయకుడి చుట్టే ఇన్ని బలహీనతలు పేర్చినప్పుడు అసలైన రాముడు ఎలా ఎలివేట్ అవుతాడు

రామాయణంలో సరిగా వాడుకోవాలే కానీ బోలెడంత డ్రామా ఉంది. కానీ ఆదిపురుష్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చూపించాలన్న లక్ష్యంలో నేటివిటీ మిస్ అయిపోయింది. అందుకే క్లైమాక్స్ ఫైట్ చూస్తే థోర్, స్టార్ వార్స్ లాంటివి గుర్తొస్తాయి. రావణుడి గూఢచారి ఏదో కరేబియన్ సినిమాలో దొంగలా కనిపిస్తాడు. అసలు రావణుడి కోటే అరేబియన్ ప్యాలెస్ సెటప్ లో ఉన్నప్పుడు న్యాచురాలిటికి చోటెక్కడిది. మాడరన్ రామాయణ ట్యాగ్ తో ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. కానీ భవిష్యత్తు జనరేషన్ రామాయణ కథలు ఇలాగే జరిగాయనే ఇంప్రెషన్ ని శాశ్వతంగా ముద్రించుకుంటే బాపు, రామానందసాగర్ లు చూపించిందే తప్పనుకునే ప్రమాదం ఉంది

కీలకమైన కుంభకర్ణుడి ట్రాక్ ని సరిగా వాడుకోలేకపోయారు. ఇంత ఖర్చుతో విజువల్ ఎఫెక్ట్స్ వాడి ఓం రౌత్ చేసిన సాహసాలు మరిన్ని జరగాలి. మహాభారతాలు, భాగవతాలు, శివలీలలు ఎన్నో రావాలి. కానీ సోల్ మిస్ కాకూడదు. గుళ్లో దేవుడి దర్శనానికి ఎంత సాంకేతిక వాడినా మూల విరాట్ కి జీన్సులు, గాగుల్స్ వాడరు. అదంతే. ఇంకో యాభై ఏళ్లయినా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. సరే వీటి సంగతి ఎలా ఉన్నా ఆదిపురుష్ బాక్సాఫీస్ ఫలితం పాజిటివ్ గా ఉన్నా లేకపోయినా ఇకపై తీయబోయే రామాయణ భారతాలకు సంబంధించి ఇంకా ఎలాంటి హోమ్ వర్క్ జరగాలో ఆదిపురుష్ నాట్ టు డూ రిఫరెన్స్ గా వాడొచ్చు

నటీనటులు

రాముడిగా ప్రభాస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒదిగిపోయాడు. సంభాషణల్లో గంభీరత అతని గొంతుకి పర్ఫెక్ట్ గా సూటయ్యింది. కమర్షియల్ జానర్ కాదు కాబట్టి లుక్స్ పరంగా ఇంతకంటే ప్రయోగాలు చేయకూడదు. కృతి సనన్ చక్కగా సరిపోయింది. లెన్త్ పరంగా స్కోప్ తక్కువే ఉన్నా గుర్తుండిపోతుంది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ రాంగ్ ఛాయిస్. అస్సలు సూటవ్వలేదు. శరీరానికి గూని తరహా నడక ఎందుకు పెట్టారో అర్థం కాదు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ హుందాగా ఉన్నాడు. హనుమంతుడిగా దేవదత్త నాగే ఎలాంటి కామెంట్స్ కు అవకాశం ఇవ్వలేదు. మండోదరిగా సోనాలి చౌహన్ రెండు మూడు సీన్లకే పరిమితం. వీళ్ళు కాకుండా గుర్తుండే క్యాస్టింగ్ ఎవరూ లేరు

సాంకేతిక వర్గం

సంగీత దర్శకులు అజయ్ అతుల్ – సచేత్ పరంపర పాటల పరంగా నిరాశపరచలేదు. మంచి ఆడియో విజువల్ గానూ బాగుంది. సంచిత్ – అంకిత్ ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెన్నెముకగా నిలిచింది. బీజీఎంతో నిలబెట్టారు. కార్తిక్ పళని ఛాయాగ్రహణం లేని లోకాన్ని ఊహించుకుని గ్రీన్ మ్యాట్ లో రామాయణ ప్రపంచాన్ని చూపించిన తీరు అతని పనితనాన్ని చాటుతుంది. పోరాట దృశ్యాల్లో కెమెరా నైపుణ్యం చాలా బాగుంది. ఎడిటర్లు అపూర్వ-ఆశిష్ సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ని తగ్గించి ఉంటే ఇంపాక్ట్ మరింత పాజిటివ్ గా ఉండేది. టి సిరీస్ – రెట్రో ఫైల్స్ జంట నిర్మాణ విలువలు గ్రాఫిక్స్ కోసం విపరీతంగా ఖర్చు పెట్టాయి. దీంట్లో రాజీ పడలేదు

ప్లస్ పాయింట్స్

ప్రభాస్-కృతి జంట
ఫస్ట్ హాఫ్
సంగీతం
కొన్ని ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్

రెండో సగం ల్యాగ్
విఎఫ్ఎక్స్ క్వాలిటీ
క్లైమాక్స్

ఫినిషింగ్ టచ్ : యావరేజ్ పురుష్

రేటింగ్ : 2.75 / 5

This post was last modified on June 16, 2023 12:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

48 minutes ago

రిలీజ్ డేట్స్ తో కొత్త సినిమాల తంటాలు !

ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…

1 hour ago

రాజకీయాన్ని మార్చబోయే ‘గేమ్ ఛేంజర్’ ఆట!

https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…

2 hours ago

భారీ కుంభకోణంలో చిక్కుకున్న భారత యువ క్రికెటర్లు!

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…

2 hours ago

నాగచైతన్యకు అల్లు అరవింద్ హామీ

తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…

3 hours ago