ఒక హిందీ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకోవడం తక్కువ. ఖాన్లలో ఒకరు హీరో అయితే సహజంగానే ఆసక్తి ఉంటుంది కానీ థియేటర్లకు వెళ్లేంతగా మునుపటి స్థాయిలో లేదు. అయితే కిసీకా భాయ్ కిసీకా జాన్ విషయంలో విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డే లాంటి క్యాస్టింగ్ ఉండటంతో పాటు కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడు కావడంతో రంజాన్ పండగ సందర్భంగా ఏదైనా మాస్ ట్రీట్ ఉండకపోదాని ట్రై చేసిన అభిమానులు లేకపోలేదు. చాలా తక్కువ బజ్ తో వచ్చిన ఈ అన్నయ్య ప్రియుడు ఎలా ఉన్నాడు
కథ
రౌడీల తుక్కు లేపుతూ నలుగురికి మంచి చేసే భాయ్ జాన్(సల్మాన్ ఖాన్)కి ముగ్గురు తమ్ముళ్లు. వాళ్ళ కోసం పెళ్లి చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. హైదరాబాద్ నుంచి పురాతన వస్తువుల ప్రాజెక్ట్ పని మీద వచ్చిన భాగ్యలక్ష్మి(పూజా హెగ్డే)ఇతన్ని చూడగానే ప్రేమిస్తుంది. హింసంటే ఇష్టం లేని ఆమె అన్నయ్య బాలకృష్ణ గుండమనేని(వెంకటేష్)ని ఒప్పించేందుకు భాయ్ జాన్ గ్యాంగ్ ని బ్రతుకమ్మ పేరుతో ఇంటికి తీసుకొస్తుంది. వీళ్ళ కుటుంబ శత్రువైన నాగేశ్వర్ (జగపతిబాబు) వల్ల పలు ప్రమాదాలు ఎదురైతే ఈ ప్రేమ జంట విడిపోవాల్సి వస్తుంది. కత్తి పట్టని బాలకృష్ణ, వయొలెన్స్ అంటే ఊగిపోయే భాయ్ జాన్ లు కలిసి ఎలా ప్రత్యర్థిని మట్టికరిపించారన్నదే స్టోరీ.
విశ్లేషణ
ఒక భాషలో హిట్ అయిన సినిమాని రీమేక్ చేయడం తప్పు కాదు. స్టార్ హీరోల్లో ఎక్కువ శాతం అదే బాట పట్టారు. కానీ ఒరిజినల్ ని ఖునీ చేస్తూ ప్రేక్షకుల హృదయాలతో ఫుట్ బాల్ ఆడుకోవాలనుకోవడం మాత్రం క్షమించరాని నేరం. అజిత్ వీరం తమిళంలో పెద్ద హిట్టు. ఎంత రొటీన్ స్టఫ్ ఉన్నా కమర్షియల్ అంశాలు అభిమానులకు నచ్చడంతో సక్సెస్ చేశారు. దీన్ని పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా చేస్తే ఇక్కడ మాత్రం యావరేజ్ ఫలితం అందుకుంది. ఇదంతా చూసి కూడా దర్శకుడు ఫర్హద్ సమ్జీ ఈ కిచిడి భాయ్ జాన్ ని ఏ ధైర్యంతో రాసుకున్నాడో ప్రతి అయిదు నిమిషాలకోసారి డౌట్ వస్తూనే ఉంటుంది. సల్మాన్ ఎలా గుడ్డిగా ఒప్పుకున్నాడో అనిపిస్తుంది.
అసలు హీరో ఎంట్రీకే మతి పోతుంది. రెండస్థుల పైనుంచి జర్కిన్ ని విసిరేసి అది గాల్లో తేలుతుండగా సల్లు భాయ్ దూకుతూ దాన్ని తొడుక్కుని నేలమీదకు దిగుతాడు. ఇంత వెరైటీ ఇంట్రో ఈ మధ్య కాలంలో చూడలేదు. ఇంటర్వెల్ బ్లాక్ కి ముందు సుదీర్ఘమైన మెట్రో ఫైట్ లో అలా రౌడీలతో కొట్టుకుంటూనే భాగ్యనగరానికి వచ్చేస్తారు. ఇలాంటి రైల్ ఫెసిలిటీ ఉందా అని స్టేషన్ లో అడక్కండి వింతగా చూస్తారు. పోకిరిని కాపీ చేయడానికి పడిన తిప్పలివి. ఈ మధ్య చనిపోయిన సతీష్ కౌశిక్ ఇందులో భాయ్ తమ్ముళ్లకు ఫ్లాష్ బ్యాక్ వివరించే క్రమం వినయ విధేయ రామాలో చలపతిరావును గుర్తుకు తెస్తే టికెట్ కొన్న పాపానికి ఏ మాత్రం ఫీలవ్వకూడదు.
ఆడియన్స్ ని మరీ ఇంత చులకనగా జమ కట్టే దర్శకులు ఒక వార్నింగ్ బెల్ లాంటి వాళ్ళు. పెద్ద స్టార్ చేతిలో ఉన్నాడు కదాని ఇష్టం వచ్చినట్టు మాస్ మసాలా పేరుతో రోతని చూపిస్తామంటే జనాలు థియేటర్ల దరిదాపుల్లోకి కూడా రామని ట్రైలర్ చూసే డిసైడ్ అవుతున్నారు. అందుకే బ్యాడ్ ఓపెనింగ్స్ తో మొదలయ్యింది. బజ్ సంగతి ఎలా ఉన్నా కంటెంట్ కనీసం ఓ మాదిరిగా అయినా ఉంటే బయటికి వచ్చినవాళ్లు సరేలే ఓసారి చూడొచ్చని చెప్పేవాళ్ళు. కానీ అదీ జరిగే ఛాన్స్ ఇవ్వలేదు ఫర్హద్ సమ్జీ. మంచి క్యాస్టింగ్ చేతిలో ఉన్నా అత్తెసరు సన్నివేశాలతో ముప్పై ఏళ్ళ వెనుకటి అరిగిపోయిన చవకబారు టేకింగ్ తో సహనానికి ఎడతెగని పరీక్ష పెట్టాడు.
మారుతున్న అభిరుచులను పసిగట్టకుండా ఉంటే ఇలాంటి అవుట్ పుట్టే వస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పసలేని ప్రేమకథతో టైం పాస్ చేసిన ఫర్హద్ కనీసం రెండో సగం మీదైనా సీరియస్ గా దృష్టి పెట్టాల్సింది. వెంకటేష్ పోషించిన బాలకృష్ణ పాత్ర ద్వారా ఎమోషన్లు రాబట్టే ప్రయత్నం కృత్రిమంగా వచ్చింది. అంత మంచి యాక్టర్ ని ఇంత బేలగా వాడుకోవడం దగ్గుబాటి హీరో కెరీర్ లో ఇదే మొదటిసారని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో లక్ష్మి రేంజ్ లో కత్తి పట్టించి నరకడాలు చేయించారు కానీ అసలా ఎపిసోడ్ డిజైనే బాలేదు.కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకొన్ని లక్షలు వెచ్చించి మంచి రైటర్లను పెట్టుకుని ఉంటె ఈ డ్యామేజ్ ఇంకాస్త తగ్గేదేమో
గత కొన్నేళ్ళుగా వరస డిజాస్టర్లతో కుదేలవుతున్న బాలీవుడ్ కు పఠాన్ ఊపిరి పోస్తే తిరిగి ఈ భాయ్ జాన్ ఆక్సీజెన్ మాస్క్ తీసేసి ఐసియులో చేర్పించేలా ఉన్నాడు. ఒకపక్క కెజిఎఫ్, కాంతార, ఆర్ఆర్ఆర్ లాంటి క్వాలిటీ మూవీస్ తో ప్రపంచం మొత్తాన్ని సౌత్ సినిమా ఊపేస్తుంటే ఈ ఫర్హద్ సమ్జీ లాంటి వాళ్ళు మాత్రం అబ్బే మాకొచ్చే రెమ్యునరేషన్లు చాలు నాణ్యత కాకరకాయ మాకెందుకంటూ ఇలాంటి చైనా మాల్ ని దింపుతూ సల్మాన్ స్టార్ డంకి తీరని నష్టం చేస్తున్నారు. ఆ మధ్య రాధే ఫలితం చూశాకైనా సల్లు భాయ్ లో ఏదైనా మార్పు వచ్చిందేమో అనుకుంటే ఆ అవకాశమే లేదంటూ ఈ కిసీకా భాయ్ కిసీకా జాన్ ద్వారా సల్మాన్ మరోసారి స్పష్టం చేశాడు
నటీనటులు
సల్మాన్ ఖాన్ తనకు ఏ మాత్రం నప్పని విగ్గుతో విశ్రాంతి దాకా చూసేందుకు కూడా ఇబ్బంది పెట్టాడు. యాక్టింగ్ సంగతి తర్వాత. హావభావాల కన్నా లిప్ మూమెంట్ తో ఎక్కువ మేనేజ్ చేసే సల్లు సాబ్ ఇందులో కొత్తగా చేసిందేమి లేదు. వెంకటేష్ వృథా అయ్యారు. ఉన్నంతలో ఈయన కనిపించే సీన్లే పర్లేదనిపిస్తాయి. పూజా హెగ్డే ఓకే. చలాకీగా చేసింది కానీ లాభం లేదు. భూమిక, అభిమన్యు సింగ్, జగపతిబాబు, రోహిణి హట్టంగడి, జెస్సీ, సిద్దార్థ్ నిగమ్, రాఘవ్, షెహనాజ్ గిల్ ఇలా చెప్పుకుంటూ పోతే శరణార్థ శిబిరాల్లో అంత లిస్టు ఉంది కానీ ఏ ఒక్కరికీ ఇది డిఫరెంట్ అనిపించే పాత్ర దక్కకుండా ఫర్హద్ సమ్జీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
సాంకేతిక వర్గం
మన దేవిశ్రీ ప్రసాద్ తో కలిపి మొత్తం ఏడుగురు పాటలు కంపోజ్ చేశారు. ఒక్కటంటే ఒక్కటి మళ్ళీ వినాలనిపిస్తే కాదు ఎప్పుడైనా యూట్యూబ్లో కనిపించినా ఆపేయాలనిపిస్తుంది. కెజిఎఫ్ రవి బస్రూర్ ఇచ్చిన నేపధ్య సంగీతం నేనేం తక్కువాని ఆయనా చెడుగుడు ఆడేశారు. వి మణికందన్ ఛాయాగ్రహణం సౌత్ స్టైల్ లోనే సాగింది. ఎలాగూ సగం సినిమా దక్షిణాదిలో జరుగుతుంది కాబట్టి అలా తీసుకున్నారేమో. మయూరేష్ సావంత్ ఎడిటింగ్ కి బి బోలెడు పనున్నా ఏది కత్తిరించాలో అర్థం కాక మొత్తానికి అలా వదిలేశాడు. అయినా సరే రెండున్నర గంటలు మూడు గంటల ఫీలింగ్ ఇస్తుంది. సల్మాన్ స్వంత నిర్మాణంలో ఖర్చు ఓ మాదిరిగానే అయ్యింది
పాజిటివ్ పాయింట్స్
వెంకటేష్
నెగటివ్ పాయింట్స్
తాతలనాటి స్క్రీన్ ప్లే
కామెడీ
నటీనటుల ఓవరాక్షన్
బిల్డప్ హీరోయిజం
ఫినిషింగ్ టచ్ : టోటల్ పరేషాన్
రేటింగ్ : 1.75 / 5
This post was last modified on April 22, 2023 9:29 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…