Movie Reviews

సమీక్ష – పఠాన్

బాలీవుడ్ అతి పెద్ద స్టార్ హీరోల్లో ఒకడైన షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల విరామం తర్వాత తన కొత్త సినిమాతో రావడం చిన్న విషయం కాదు. ఎంత లేదన్నా ఈ గ్యాప్ లో అతనితో కలిసి ఇండస్ట్రీ వదులుకున్న మొత్తం ఏడాదికో సినిమా లెక్కన చూసుకున్నా వెయ్యి కోట్ల పైమాటే. వరస డిజాస్టర్లతో మొహం మొత్తిపోయి ఎక్కడ పొరపాటు జరుగుతోందో తెలుసుకోవాలని కోరుకుని మరీ పఠాన్ కోసం పడిన కష్టం ఇవాళ థియేటర్లలో అడుగుపెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ట్రెండింగ్ షురూ చేసిన బాద్షా మీద నమ్మకంతో నార్త్ ఆడియన్స్ వేలం వెర్రిగా టికెట్లు కొనడం మొదలుపెట్టారు. అందుకే అంచనాలు స్కైహై కి వెళ్లిపోయాయి. ఇంతకీ పఠాన్ జనాల ప్రేమను గెలిచేలా ఉన్నాడా

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత భారతదేశం మీద తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన పాకిస్థాన్ కు చెందిన ఓ ఆర్మీ ఆఫీసర్ మన నగరాలను టార్గెట్ చేయడం కోసం ఒకప్పుడు ఇండియన్ రా ఏజెంట్ గా పని చేసిన జిమ్(జాన్ అబ్రహం)ని సంప్రదిస్తాడు. అతనెందుకు తీవ్రవాదిగా మారడనే దానికో గతం ఉంటుంది. జిమ్ కి అడ్డుకట్ట వేయాలంటే ఒక్క పఠాన్(షారుఖ్ ఖాన్)వల్లే అవుతుందని గుర్తించిన పై అధికారులు ఎక్కడో విదేశాల్లో ఉన్న తనని కలుసుకుంటారు. దేశం కోసం ఏదైనా చేసే ఉక్కు సంకల్పం ఉన్న పఠాన్ జిమ్ ని ఎలా చేరుకున్నాడు. మిషన్ ఎలా భగ్నం చేశాడనేది అసలు కథ. ఇక్కడ కొత్తగా చెప్పిన ట్విస్టులేం లేవు. ట్రైలర్ లో చూసిందే.

రా ఏజెంట్లు, గూఢచారులు, ఎన్ఐఏ, ఐఎస్ఐ, ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ ఈ నేపధ్యాలన్నీ గతంలో ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో చూసిందే. ప్రత్యేకంగా పఠాన్ లో ఎన్నడూ చూడని బ్యాక్ డ్రాప్ ఏమీ ఉండదు. ఒకప్పుడు సెన్సిబుల్ సినిమాలు తీస్తాడని పేరున్న సిద్దార్థ్ ఆనంద్ బ్యాంగ్ బ్యాంగ్ నుంచి పూర్తిగా తన రూటును మార్చేసుకున్నాడు. వార్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తన కథలను ఇంకా అతిశయోక్తి స్థాయికి తీసుకెళ్లడం మొదలయ్యింది. ఏదీ నమ్మశక్యంగా ఉండదు. మనం కొన్ని తెలుగు సినిమాల్లో ఫైట్లు చూసి మరీ ఇంత సిల్లీగా ఎలా రాశారని నవ్వుకుంటాం కానీ అంతకు మించి అనే స్థాయిలో పఠాన్ లో ఫిజిక్స్ ని భయపెట్టే పోరాటాలున్నాయి

ఇక్కడ తేడా ఏంటంటే గ్రాండియర్ నెస్. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది. కొన్ని చోట్ల హాలీవుడ్ రేంజ్ లో కంపోజ్ చేసిన విధానం అబ్బురపరుస్తుంది. ముఖ్యంగా మంచు నేలపై బైక్ ఛేజులు, సల్మాన్ షారుఖ్ లు కలిసి చేసే ట్రైన్ ఫైట్ మాములుగా పేలలేదు. అభిమానులు వీటికే పక్కా పైసా వసూల్ అని సంతోషపడతారు. కింగ్ ఖాన్ ని ఇలా చూసి పుష్కరం అయిన ఫీలింగ్ ఉంది కాబట్టి ఈ విజువల్స్ అన్నీ కంటికి ఇంపుగానే ఉంటాయి. అయితే ఎంత భారీ తనం ఉన్నా ఇలాంటి బ్యాక్ డ్రాప్ కు సరిపడా ఎమోషన్లను సిద్ధార్థ్ ఆనంద్ పెద్దగా పండించలేకపోయాడు. ఎక్కడ భావోద్వేగాలు ఉండవు. కామెడీ మచ్చుకు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు.

సీరియస్ సబ్జెక్టు చెప్పాలనుకున్నప్పుడు ఎంటర్ టైన్మెంట్ వద్దనుకున్నారు కానీ యాక్షన్ ధమాకా మరీ ఎక్కువ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు కంటెంట్ పరంగా ఎలాంటి ప్రత్యేకత అనిపించక కొంచెం బోర్ కొట్టే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పుడంతా ఎలివేషన్ల జమానా కాబట్టి వాటి వల్ల ఇది సూపర్ హిట్టో బ్లాక్ బస్టరో అయినా ఆశ్చర్యం లేదు. కానీ వినోదం సంగీతంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు కోరుకునే వాళ్లకు మాత్రం పఠాన్ అంత సులభంగా కొరుకుడు పడడు. షారుఖ్ కి హిట్ పడాలని కోరుకుంటున్న సగటు మూవీ లవర్స్ లక్షల్లో ఉన్నారు కనక ఆ పాజిటివ్ దృక్పధంతో చూసినప్పుడు లోట్లు కనిపించకపోవచ్చు

ఇదే యష్ సంస్థ నుంచి వచ్చిన ఏక్ తా టైగర్, టైగర్ జిందా హై లాంటి వాటితో పోలిస్తే అంత ఇంటెన్సిటీ కనిపించదు కానీ సిద్దార్థ్ ఆనంద్ ఇందులో షారుఖ్ ఇమేజ్ నే నమ్ముకుని సహజమైన సన్నివేశాల కన్నా ఓవర్ ది బోర్డ్ సీన్స్ తో నింపేశారు. సహజంగా లాజిక్స్ కే చెల్లుచీటి పడేశారు. హృతిక్ రోషన్ లో వార్ లో కూడా ఇవే వర్కౌట్ అయ్యాయి కాబట్టి కథ కంటే కథనం మీద దృష్టి పెట్టడం పని చేసింది. ఈ జానర్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్ళకు నిరాశ కలిగే అవకాశాలు తక్కువే. కానీ కామన్ పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కమర్షియల్ గా చివరి ఫలితాన్ని నిర్దేశించనుంది. షారుఖ్ వన్ మ్యాన్ షో అనడం కంటే స్టంట్ మాస్టర్స్ బెస్ట్ ఎక్స్ పోజర్ అనొచ్చు.

లోటుపాట్లు లేకపోలేదు. అతని వైపు వెర్షన్ న్యాయంగా అనిపించినా అంత విధ్వంసం సృష్టించడానికి కావాల్సిన వెయిటేజ్ లేకపోయింది. నెరేషన్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో నడిపించడం ఫస్ట్ హాఫ్ లో కొంత కన్ఫ్యూజన్ కు దారి తీసింది. దీపికా పాత్రకు ఇచ్చిన మలుపు అధిక శాతం ఊహించేలానే ఉంది. కాకపోతే టేకాఫ్ కాగానే అనవసరమైన డైవెర్షన్లకు పోకుండా చెప్పాలనుకున్న పాయింట్ కే కట్టుబడటం పఠాన్ ని కాపాడుతూ వచ్చింది. గూస్ బంప్స్ ఇచ్చే హై రేంజ్ టర్నింగులు లేకపోవడం కొంత లోటే. భారీతనం ముందు ఇలాంటివి చాలామటుకు కవరైపోయాయి

మొత్తంగా చెప్పాలంటే పఠాన్ సంతృప్తికి అసంతృప్తికి మధ్య సన్నని గీత దగ్గర ఊగిసలాడుతూ ఎట్టకేలకు ఎడమవైపు వచ్చేసి దాదాపుగా నెగ్గేసింది. షారుఖ్ ని ఒకప్పటి దిల్వాలేగానూ బాజీగర్ లానో కుచ్ కుచ్ హోతా లానో రాసి చూపించే రైటర్లు దర్శకులు లేరు కాబట్టి ట్రెండ్ కు తగ్గట్టు పఠాన్ లాంటి యాక్షన్ డ్రామాను ఎంచుకుని తెలివైన పనే చేశాడు. రిచ్ క్యాస్టింగ్, అబ్బుర పరిచే లొకేషన్లు, గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో నిర్మాతలు తీసుకున్న శ్రద్ధ, బడ్జెట్ లో రాజీ పడకపోవడం మొత్తంగా డీసెంట్ వాచ్ గా నిలబెట్టేసింది.

షారుఖ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ కోరుకున్నట్టే సంపూర్ణంగా ఉంది. ఈ వయసులోనూ సిక్స్ ప్యాక్ బాడీ, ఫైట్ల కోసం చేసిన రిస్క్ ని మెచ్చుకోవచ్చు. నటన గురించి చెప్పదేముంది. పఠాన్ లో విలనే అయినా సెకండ్ హీరో రేంజ్ లో అదరగొట్టాడు జాన్ అబ్రహం. దీపికా పదుకునే కేవలం స్కిన్ షోకే పరిమితం కాలేదు. తగినంత స్కోప్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువ కనిపిస్తున్న సీనియర్ నటి డింపుల్ కపాడియా పాత్ర హుందాగా ఉంది. సల్మాన్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్యామియో చేశాడంటే అందులో అబద్ధమేమీ లేదు. అశుతోష్ రానా, సిద్ధాంత్, గౌతమ్ రోడే, గవి చాహల్, షాజీ చౌదరి ఇలా క్యారెక్టర్లకు తగ్గ తరగణాన్ని బాగానే సెట్ చేసుకున్నారు

సంగీతం రెండు పాటలకే పరిమితమయ్యింది. విశాల్ శేఖర్ ఇచ్చిన పాటల్లో బేషరం ఆల్రెడీ హిట్ ట్రాక్. మరొకటి ఎండ్ టైటిల్స్ లో పెట్టారు. నేపధ్య సంగీతం అందించిన సంచిత్ బల్హార – అంకిత్ బల్హార పఠాన్ కు తగిన న్యాయం చేయలేకపోయారు. పదే పదే ఒకే సిగ్నేచర్ ట్యూన్ ని రిపీట్ చేసి డెప్త్ ని తగ్గించారు. ముఖ్యంగా హీరో ఎలివేషన్ కు వాడిన ట్రాక్ వకీల్ సాబ్ లో మగువా మగువాలా అనిపిస్తే అది మన తప్పు కాదు. మంచి స్కోర్ పడి ఉంటె నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. యష్ నిర్మాణ విలువలు ఎప్పటిలాగే ఖర్చుకు వెనుకాడలేదు. దేశవిదేశాల్లో పెట్టిన కోట్ల రూపాయల ఖర్చు మొదటి నుంచి చివరిదాకా కనిపిస్తూనే ఉంటుంది.

ప్లస్ పాయింట్స్

షారుఖ్ ఖాన్
జాన్ అబ్రహం నటన
సల్మాన్ ఖాన్ ఫైట్ ఎపిసోడ్
యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్

కథ మరీ కొత్తది కాదు
పండని ఎమోషన్స్
ఫ్యామిలీ ఎలిమెంట్స్ తగ్గడం

ఫినిషింగ్ టచ్ – షారుఖ్ యాక్షన్ షో

రేటింగ్: 3 / 5

This post was last modified on January 25, 2023 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

7 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

9 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

11 hours ago