అసలు మాస్ సినిమా అంటే ఏంటి. ఈ ప్రశ్న కనక ఓ ముప్పై నలభై ఏళ్ళ క్రితం ప్రేక్షకులను అడిగితే నాలుగు ఫైట్లు ఆరు పాటలు మూడు జోకులు రెండు ఎమోషన్లని చెప్పేసేవాళ్ళు. ఇది 2022. దానికర్థం మారిపోయింది. ఎందుకంటే ఆడియన్స్ చాలా అడ్వాన్స్ అయ్యారు. ఏదో బీసీ సెంటరని ఒక వర్గం జనాన్ని తక్కువ అంచనా వేస్తాం కానీ వాళ్ళూ ట్విట్టర్ లు సోషల్ మీడియాలూ వాడేంత రేంజ్ కి చేరుకున్నారు. కానీ ఎటొచ్చి వాళ్లకు తగ్గట్టు మన రచయితలు దర్శకులు మారకపోవడమే అసలు ట్రాజెడీ. రవితేజ లాంటి స్టార్ హీరో నుంచి సినిమా వస్తున్నప్పుడు అంచనాలు పెట్టుకోవడం సగటు అభిమానులు చేసేదే. అవి నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిది?
ధమాకా ఇవాళ రిలీజయింది. ఒకటే కథను రెండుసార్లు తిప్పి తీసి (సినిమా చూపిస్త మావా – నేను లోకల్) హిట్టు కొట్టిన దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ స్క్రిప్ట్ మీద రెండేళ్లు ఖర్చు పెట్టారు. సహజంగానే ఏదో గట్టి విషయం ఉందని ఆశిస్తాం. పైగా త్వరలో నాగార్జునతో డైరెక్టర్ గా డెబ్యూ చేయబోతున్న ప్రసన్నకుమార్ బెజవాడ కలం అనగానే మంచి ఎంటర్ టైమెంట్ ఉంటుందనే నమ్మకం తప్పేమీ కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీలీల లాంటి లేలేత హీరోయిన్ ని రవితేజ పక్కన జోడిగా సెట్ చేయడంతో ఆటోమేటిక్ గా హైప్ మీటర్ పెరిగింది. పైగా పాటలు ముందే హిట్టు. ఒక కమర్షియల్ మూవీకి ప్రీ రిలీజ్ కి ఇంతకన్నా సెటప్ అక్కర్లేదు.
ముందు కథేంటో చూద్దాం. అనగనగా ఒక స్వామి(రవితేజ). వీధిలో రౌడీలను కొడితే వీడియో కాల్ లో ప్రోత్సహించే అమ్మానాన్న చెల్లి ఉంటారు. ఆ ఫైట్ చూసిన ప్రణతి(శ్రీలీల)ఇతన్ని చూసి మనసు పారేసుకుంటుంది. దీనికేనా అనకండి. మాస్ బొమ్మ కాబట్టి ఇలాంటి లాజిక్స్ పక్కనపెడదాం. ఈ అమ్మాయి నాన్న అచ్చం స్వామిలాగే ఉండే ఆనంద్ చక్రవర్తి(ఇంకో రవితేజ)తో సంబంధం కుదురుస్తాడు. మరి విలన్ లేకపోతే ఎలా. భూకబ్జాలు చేసినంత తేలిగ్గా వేలకోట్ల వ్యాపారం చేసే యజమానులను సింపుల్ గా చంపేసి వాటిని స్వాధీనం చేసుకునే జెపి(జయరాం). ఇతను ఆనంద్ బిజినెస్ జోలికి వస్తాడు. ఆపై జరిగేది మీ ఊహలకు అనుగుణంగానే సాగుతుంది
రవితేజకు ఈ కథను చెప్పి ఒప్పించిన దర్శక రచయితల కన్నా ఇంత బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధపడిన ప్రొడ్యూసర్లను అభినందించాలి. ఇప్పటితరం ప్రేక్షకులను తక్కువ అంచనా వేయడమంత తెలివితక్కువ పని మరొకటి ఉండదు. ఏదో ఆషామాషీ జోకులు, అల్లరి నరేష్ టైపు స్పూఫ్ లకు థియేటర్ కు రమ్మంటే మొహమాటం లేకుండా నో అనేస్తారు. అసలు ధమాకాని ఇంత రొటీన్ ఫార్ములాతో ఎందుకు తెరకెక్కించారన్న ఆలోచన ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. సరే హీరో అంటే రెమ్యునరేషన్ కోసమో లేదా గుడ్డిగా సబ్జెక్టును నమ్మడమో అనుకుందాం. కానీ జాగ్రత్తగా ఉండాల్సింది దర్శకుడు కదా. నష్టపోయేది ఆయనే కదా.
మాస్ పేరుతో ఏది బడితే అది గతంలో చూసిందే మళ్ళీ చూపిస్తామంటే టికెట్లు ఎలా తెగుతాయి. ఈజీగా మర్డర్లు చేసి కబ్జాలకు పాల్పడే విలన్ హీరో చేతిలో గొర్రెగా మారిపోవడం ఎన్నిసార్లు వచ్చిందో లెక్క బెట్టడం కష్టం. డ్యూయల్ రోల్ ని సెట్ చేసి దాని వెనుకో ట్విస్టు పెట్టడం ఇదే రవితేజ ఎన్నిసార్లు చేశాడో అడిగితే ఫ్యాన్స్ ఠక్కున సమాధానం చెబుతారు. ఎప్పుడో ఢీ రెడీ కాలం నాటి కన్ఫ్యూజింగ్ డ్రామాలకు కాలం చెల్లిపోతే మళ్ళీ దాన్నే బూజు దులిపి సెకండ్ హాఫ్ మొత్తం నింపేస్తే ఏమవుతుంది. ధమాకా లాగా కామెడీ కిచిడి అవుతుంది. అలా అని నవ్వులు లేవని కాదు, చిరంజీవి ఇంద్ర స్పూఫ్ , ఆఫీస్ లో అజ్ఞాతవాసి టైపు డాన్సుకి జనం స్పందించారు
ప్రపంచం మొత్తం ఏడే కథలు ఉన్నాయి కాబట్టి వాటినే మార్చి మార్చి తీయాలని కొందరంటారు. నిజమే అలా అని ఒకే కథను ఏడు వందల సార్లు తీస్తే దాన్నేమంటారు. ధమాకాలో ఆఫీస్ వ్యవహారాలు అల వైకుంఠపురములోని గుర్తుకు తెస్తాయి. ఇంట్లో భరణి తులసి చేసే యాక్షన్లు నేను లోకల్ లో పోసాని ఈశ్వరిని తలపిస్తాయి. రావు రమేష్ రవితేజల మధ్య మామ అల్లుళ్ళ టీజింగ్ లు మళ్ళీ ఇదే త్రినాథరావు గత సినిమాలు గుర్తుకు తెస్తాయి. రౌడీ అల్లుడులాగా ఉంటుందని చెప్పిన ప్రసన్న కుమార్ అందులో సీన్ నే యధాతథంగా ఫాలో కావడం కామెడీ క్రియేటివిటీ అని సరిపెట్టుకోవాలా. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు రెండున్నర గంటల పాటు తలెత్తుతూనే ఉంటాయి
మాస్ హీరోలకు ఒకప్పుడు పాటలు ఫైట్ల విషయంలో కొలతలు ఉండేవి కానీ ఇప్పుడు కాదు. ఇది విస్మరిస్తున్న దర్శకులు అవే గాల్లో ఫైట్లు, వ్యక్తిత్వ వికాసం పుస్తకాల మాటలు తీసుకుని రాసిన ఎలివేషన్ డైలాగులు, ఉన్నట్టుండి ఊడిపడే పాటలతో పని కానిచేద్దామనుకుంటున్నారు తప్ప కొంచెమైనా కొత్తగా ఆలోచిస్తున్నామా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవడం లేదు. విక్రమ్ లు కెజిఎఫ్ లు కేవలం బడ్జెట్ పెద్దగా ఉండటం వల్ల హిట్టయ్యాయా. లేదే. ఆచార్యను తిరస్కరించిన అదే మాస్ అఖండను ఆదరించింది. గబ్బర్ సింగ్ కు సాహు అన్నవాళ్ళే సర్దార్ గబ్బర్ సింగ్ కు దండం పెట్టారు. ఫలితాల్లో వ్యత్యాసాలను గుర్తించకపోతే ఎలా
ధమాకాలో భీమ్స్ స్వరపరిచిన పాటల ప్లేస్ మెంట్ ని పక్కనపెడితే అంతోఇంతో టికెట్ డబ్బులకు న్యాయం చేసింది అవే. ఇక్కడ శ్రీలీల మేజిక్ బాగా పని చేసింది. ఎంతకాదన్నా సామాన్య ప్రేక్షకుడి దృష్టి ఈ వయసులోనూ అంత ఎనర్జీతో డాన్స్ చేస్తున్న రవితేజ మీద కాకుండా చాలా ఈజ్ తో జింకపిల్లలా గెంతుతున్న శ్రీలీల మీదే వెళ్తుంది. భీమ్స్ రెండు పాటల విషయంలో వంద మార్కులు తెచ్చుకున్నాడు కానీ ధమాకా ఫలితం పెద్ద స్కేల్ లో ఉండబోవడం లేదు కాబట్టి అతనికేమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. బీజీఎమ్ పర్వాలేదు. కార్తీక్ ఘట్టమనేని కెమెరా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వాటి పని సక్రమంగానే నిర్వర్తించాయి. ఖర్చుకి నిర్మాతలను అభినందించాలి
ప్లస్ పాయింట్లు
శ్రీలీల గ్లామర్
జింతాక, దండకడియాల్ పాటలు
అక్కడక్కడా జోకులు
మైనస్ పాయింట్లు
అరిగిపోయిన ఫార్ములా
రొటీన్ ట్రీట్మెంట్
ఈజీగా ఊహించే కథాకథనాలు
ఫినిషింగ్ టచ్ : పేలని పటాసు
రేటింగ్ – 2.5/5
This post was last modified on December 23, 2022 5:01 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…