ప్రేమ కథలు ఎప్పుడూ కాలానికి నిలుస్తాయి. అందులో సందేహం లేదు. కానీ అలా అని కాలం చెల్లిన కథలను లవ్ స్టోరీలుగా మార్చకూడదు. అలా చేయాలి అనుకున్నపుడు రంగస్థలం, శ్రీదేవి సోడా సెంటర్ ఇలా చాలా సినిమాల మాదిరిగా పీరియాడిక్ సినిమాలుగా మార్చాలి. అప్పుడు జనం కనెక్ట్ అవుతారు. ఇలా వుండేదా సమాజం అప్పట్లో అని కాస్త ఆలోచిస్తారు.
కానీ సమాజం చాలా వరకు మారిన తరువాత, కొన్ని వర్గాలకు ప్రభుత్వం న్యాయపరంగా, చట్టపరంగా రక్షణ కల్పించిన తరువాత ఎన్నో పెళ్లిళ్లు కులాలకు అతీతంగా జరుగుతున్న కాలంలో ఇంకా అప్పటి పరిస్థితులనే పట్టుకుని, సినిమా తీయడం అంటే కాస్త ఆలోచించాల్సిందే. కులాల అంతరం పూర్తిగ సమసిపోకపోవచ్చు. కానీ అలా అని జడలు విప్పి విశృంఖలంగా డ్యాన్స్ అయితే చేయడం లేదు. ఈ విషయాలను పక్కన పెట్టే లవ్ స్టోరీ సినిమాను చూడాలి.
ఆర్మూరుకు చెందిన కాలనీ కుర్రాడు రేవంత్ (చైతన్య), పటేల్ కూతురు మౌనిక (సాయిపల్లవి) బతుకులో పైకి ఎదగాలని తనకు ఇష్టమైన డ్యాన్స్ ను నమ్ముకుని పట్టణానికి వచ్చి జుంబ డ్యాన్స్ నేర్పిస్తుంటాడు రేవంత్. తను చదివిన ఇంజనీరింగ్ కు తగిన ఉద్యోగం కోసం వస్తుంది మౌనిక. ఇద్దరూ అనుకోకుండా కలుస్తారు. దగ్గరవుతారు. ప్రేమించుకుంటారు. కానీ కులాల, పేదరికం..పెద్దరికం వంటి వ్యవహారాలు అడ్డం పడతాయి. అది కాక మౌనికకు బాబాయ్ నరసింహం (రాజీవ్ కనకాల)తో మరో సమస్య. ఈ రెండు సమస్యలను అధిగమించి ఈ జంట ఎలా ఒక్కటయ్యారన్నది సినిమా.
కథ పరంగా పద్దగా కొత్తదనం లేదు. ప్రేమకు అడ్డంకి అయిన ప్రధాన సమస్య కూడా కొత్తది కాదు. దర్శకుడు టచ్ చేసిన రెండో సమస్య కాస్త కొత్తది. ఇబ్బందికరమైనది. లాజికల్ సంగతులు చివర్లో చర్చించుకుందాం అనుకుంటే, సినిమాకు దర్శకుడి సిన్సియర్ అటెంప్ట్ మెచ్చుకోదగ్గది. పెద్దగా కథలేని ఓ లవ్ స్టోరీని స్మూత్ గా నెరేట్ చేసుకుంటూ వెళ్లడం అంటే ధైర్యం వుండాలి. సినిమా తొలిసగం మొత్తం కలిపి పేజీ కథ వుండదు. ప్రధాన పాత్రల స్ట్రగుల్స్ మాత్రమే వుంటాయి. నిజానికి కమర్షియల్ పార్మాట్ లో ఆలోచిస్తే తొలిసగం అంతా వేరే స్ట్రిప్ట్ గా మారిస్తే నలభై నిమషాల్లో ముగించేయ వచ్చు. కానీ దర్శకుడు కాస్త డిటయిల్డ్ గా వెళ్లాడంతే. తొలిసగం చూసిన తరువాత ఇప్పటి వరకు ఏ జరిగింది అని ఆలోచిస్తే అనుకునేందుకు పెద్దగా ఏమీ వుండదు. పైగా సినిమాటిక్ ఇంట్రవెల్ బ్రేక్ కూడా కాదు. ఎందుకో ఈ బ్రేక్ ఎక్కడ ఇవ్వాలో అన్న విషయంలో దర్శకుడు ముందు వెనుక ఆడాడు అనిపిస్తుంది.
మలిసగంలో టోటల్ స్ట్రగుల్ అంతా ఫిక్స్ చేసాడు దర్శకుడు. నిజానికి సినిమాలో స్ట్రగుల్ పాయింట్ ఒక్కటే. కేవలం హీరోయిన్ బాబాయ్. పట్టణంలో ఆ అమ్మాయి స్ట్రగులేం పడదు. కుర్రాడు కూడా అంతే. చకచకా జుంబా సెంటర్ ఎదిగిపోతుంది. డబ్బులకు ఇబ్బంది వుండదు. సమస్య ఏమీ కాదు. కేవలం ప్రేమ నుంచి పెళ్లికి అప్ గ్రేడ్ కావడానికే ఇబ్బంది. ఆ అప్ గ్రేడ్ కోసం జరిగిన స్ట్రగుల్ అంతా సెకండాఫ్ లో సెట్ చేయడంతో రిలీఫ్ అన్నది లేకపోయింది. అదృష్టం కొద్దీ సారంగదరియా పాట ఒక్కటే రిలీఫ్. మరో మంచి పాట ‘ఎంత చిత్రం ప్రేమ’ అన్నదాని కోసమే దుబాయ్ ఎపిసోడ్ క్రియేట్ చేసినట్లుంది. అది కథలోకి అంతగా ఇమడలేదు.
మలిసగంలో సమస్య ఏమిటంటే చట్టం, అది కల్పించిన రక్షణ అన్నీ తెలిసిన ఎస్ఐ కూడా భయపడేంత విలన్ గా నరసింహాన్ని చిత్రీకరించారు. అలాంటి నరసింహం ముగింపు, క్లయిమాక్స్ చటుక్కున ఊడిపడతాయి. ఈ మాత్రం దానికి ఇంత హంగామా..హడావుడినా? హీరో ఇన్ బిల్డ్ ఎదిరించే మనస్తత్వంతోనే వుంటాడు. అందువల్ల అదేదో ముందే ఎదురెళ్లి వుంటే వేరుగా వుండేది. అంతా సాగదీసి, చటుక్కున మార్చేయడం అంటే కాస్త వెల్తీగా వుందన్నది వాస్తవం. అలాగే విలన్ వరస ను బాబాయ్ గా కాకుండా మామయ్యగా మార్చి వుంటే ఫ్యామిలీలు ఇబ్బంది పడే అవకాశం తప్పేది. ఎందరో బాబాయ్ లు అన్న పిల్లలను ప్రేమగా చూసుకుంటారు. ఇఫ్పుడు వాళ్లంతా సీట్లలో కాస్త ఇబ్బందిగా కదలాలి. మామయ్య అనే రిలేషన్ మార్చినంత మాత్రాన కథకు ఔచిత్య భంగం ఏమీ కలుగదు.
ఇంజనీరింగ్ చదివింది అంటే ప్రపంచానికి ఎక్స్ పోజ్ అయినట్లే కదా. అర్ధరాత్రి నడిరోడ్ మీద డేట్ వచ్చింది, రూమ్ కెళ్లి శానిటరీ నాప్ కిన్ మార్చుకుంటా అని హీరోకి చెప్పగలిగిన అమ్మాయి ధైర్యంగా అమ్మకు సమస్యను చెప్పలేకపోవడం అన్నది కాస్త లాజిక్ కు దూరంగా వుంది.
ఇవన్నీ ఇలా వుంచితే శేఖర్ కమ్ములకు తనదైన స్టయిల్ టేకింగ్ వుంది. చాలా సింపుల్ టేకింగ్. హడావుడి వుండదు. సహజమైన లోకేషన్లే వుంటాయి. పాత్రలు అన్నీ సహజంగా బిహేవ్ చేస్తాయి. విలన్ పట్టణానికి వచ్చినపుడు గల్లీలో పిల్లలతో క్రికెట్ ఆడడం లాంటి సీన్లు అలాంటివే. అయితే ఈ టేకింగ్ బాగానే వుంది కానీ తొలిసగంలో మరీ లెంగ్తీ అయింది.
సినిమాకు చైతన్య, సాయిపల్లవి ఇద్దరూ పెద్ద అసెట్. ఇద్దరికద్దరూ పోటీ పడి నటించారు. చైతన్య నటన చాలా మెచ్యూర్డ్ గా వుంది. మిగిలిన వారంతా ఓకె. సినిమాకు నేపథ్యసంగీతం ప్రాణం పోసింది. సారంగదరియా ట్యూన్ ను రకరకాల ఇనుస్ట్రుమెంటేషన్లతో రిపీట్ చేయడం అన్నది తప్పిస్తే, మిగిలినదంతా బాగుంది.
టోటల్ గా సినిమాను కాకుండా స్ట్రిప్ట్ లెవెల్ లోనే సరైన రిపేర్లు చేసి వుంటే మరింత మంచి సినిమా అయి వుండేది. ఇప్పుడు పాటలు, నటీనటులు, డైరక్షన్ కలిపి స్క్రిప్ట్ అంత బాగా లేకున్నా, సినిమాను పాస్ చేయించాయనే చెప్పాలి.
ప్లస్ పాయింట్లు
చైతన్య, సాయిపల్లవి
పాటలు
నేపథ్యసంగీతం
కొన్ని సన్నివేశాలు
మైనస్ పాయింట్లు
బలమైన కథ లేకపోవడం
లెంగ్తీ నెరేషన్
ఫినిషింగ్ టచ్: ఏజ్ ఓల్డ్ లవ్ స్టోరీ
Rating: 2.75/5
This post was last modified on September 24, 2021 1:40 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…