సమీక్ష – నూటొక్క జిల్లాల అందగాడు

2.75/5

  |   Comedy   |   03-09-2021


Cast - Avasarala Srinivas, Ruhani Sharma and others

Director - Rachakonda Vidyasagar

Producer - Shirish, Rajeev Reddy, Sai Jagarlamudi

Banner - Sri Venkateswara Creations

Music - Shakthikanth Karthick

బాడీ షేమింగ్ అన్నదే ఫన్ గా మారిపోయిన రోజులివి. అందం అన్నది వందల కోట్ల వ్యాపారంగా మారిపోయిన కాలమిది. పెళ్లి తరువాత ఎవరు ఎలా మారిపోయినా ఓకె కానీ పెళ్లికి ముందు మాత్రం అందమైన అబ్బాయే కావాలి. అమ్మాయే కావాలి. ఇలాంటి సొసైటీలో నిండయిన జుత్తుకు బదలు వెల్లకుండ లాంటి తెల్లటి బట్టతల వుంటే ఎలా బతకాలి? ఎవర్ని వరించాలి? ఈ సమస్యను ఎలా భరించాలి. ఇలాంటి కానెప్ట్ తో వచ్చిన సినిమా నూటొక్క జిల్లాల అందగాడు.

జిఎస్ఎన్ అలియాస్ గొర్తి సూర్యనారాయణ (అవసరాల) ది తరతరాల సమస్య. తండ్రి ఇచ్చిన వారసత్వం బట్టతల. బయట విగ్ పెట్టుకుని, ఇంట్లో టోపీ పెట్టకుని పని కానిచ్చేస్తుంటాడు. బోడిగుంటు కుర్రాడిని ఏ అమ్మాయి మాత్రం ఇష్టపడుతుంది. అందుకే తనలో తానే బాధపడుతూ వుంటాడు. ఇలాంటి నేపథ్యంలో అతగాడు పని చేసే ఆఫీసులో చేరుతుంది అంజలి (రుహానీశర్మ). చాలా త్వరగానే ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ వన్ ఫైన్ మార్నింగ్ జిఎస్ఎన్ కేశరహస్యం అంజలికి తెలిసిపోతుంది. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా.

జిఎస్ఎన్ మాదిరిగా పూర్తిగా బట్టతల అన్నది కాకపోయనా, వాతావరణ కాలుష్య రీత్యా కావచ్చు, ఇంకా అనేకానేక కారణాల వల్ల కావచ్చు జుట్టు సమస్య అన్నది ఇప్పుడు కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. అందువల్ల సినిమా తొలిసగాన్ని చాలా మంది మగ ప్రేక్షకులు తమకు తాము రిలేట్ చేసుకుంటారు. లేదా తమకు తెలుసున్నవాళ్లకను గుర్తు తెచ్చుకుంటారు.

మరీ హై లేకుండా లో కాకుండా, అలా పైపైన టచ్ చేసుకుంటూ కధను రన్ చేయడంలో రైటర్ అవసరాల. దర్శకుడు విద్యాసాగర్ బాగానే సక్సెస్ అయ్యారు. మరీ క్లిష్టమైన, ప్రేక్షకులను టెన్షన్ పెట్టే పనికి ఈ జోడీ వెళ్లలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ నే దానికి పెద్ద ఉదాహరణ. హీరోయిన్ కు విషయం ఎలా తెలుస్తుందా? బ్యాంగ్..బ్యాంగ్ మని బ్యాక్ గ్రవుండ్ స్కోర్ మోగుతుందా? అని అనుకోవాల్సిన పని లేదు. చాలా స్మూత్ గా పని కానిచ్చేసారు.

అక్కడక్కడ అవసరాల టైపు క్లాసిక్ కామెడీ వుంటుంది. మిగిలినదంతా భళ్లున నవ్వడానికి పనికి వస్తుంది. ఇలా తొలిసగాన్ని పాస్ చేయించేసారు. ప్రేక్షకుడు కూడా తొలిసగంలో పెద్దగా ఏమీ లేదే అనుకోకుండా, చల్తా..బాగానే వుంది అనేసుకుంటాడు. ఇలాంటి ఒపీనియన్ తో మలిసగం ప్రారంభం అవుతుంది.

సాధారణంగా తొలిసగాని విషయం ఎస్టాబ్లిష్ చేయడానికే కేటాయించి, పైగా హిల్లేరియస్ గా మలిచిన తరువాత మలిసగం కాస్త కత్తిమీద సామే. అందుకే రచయిత, దర్శకుడు మలిసగాన్ని మరీ భారంగా తీయాలని అనుకోలేదు. అక్కడ కూడా వీలయినంత పైపైన టచ్ చేసుకుంటూ వెళ్లిపోవాలనుకున్నారు. పైగా మగాడు ఏడిస్తే అసహ్యంగా వుంటుంది. బట్టతలతో ఏడిస్తే మరీనూ. అందుకే అలాంటి సీన్ల జోలికి ఎక్కువగా పోలేదు. కానీ దీనివల్ల సినిమాలో ఎమోషన్ కంటెంట్ తక్కువ అనే కామెంట్ వస్తే రావొచ్చు.

అయితే కేవలం ఎమోషన్ మీద సెకండాఫ్ అంతా రన్ చేస్తే అంత బాగోదు అని హోటల్ సీన్ ను ఒకటి జోడించారు. రిసెప్షన్ డెస్క్ దగ్గరకు వచ్చిన తరువాత అది వర్కవుట్ అయింది. వారసత్వంగా బట్టతల ఇచ్చారు అనే కొడుకు కామెంట్ కు, తమకు వున్న ధైర్యాన్ని ఇవ్వలేకపోయాం అనే తల్లి కౌంటర్ పాయింట్ బాగుంది. అదే సినిమాకు ఆయువుపట్టు కూడా. విజయం ఇచ్చే కిక్, దాంతో వచ్చే అందానికి మరేదీ సాటి కాదనే పాయింట్ తో సినిమాను ముగించాడు దర్శకుడు.

ఇలాంటి సినిమాలో అవసరాల తన స్టయిల్ లో చేయడమే కాదు, రాయడం కూడా బాగుంది. అవసరాల తప్ప మరెవరు ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ముందుకు రాకపోచవ్చు. రుహానీ శర్మ తన మేకప్ మీద శ్రద్ద పెట్టాలి. మిగిలిన వారు ఓకె.

మొత్తం మీద కాస్త చూడగలిగే, చూడదగ్గ సినిమానే ఇది. ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, కంటిన్యూటీ మిస్ అయిపోతామనే టెన్షన్ లేకుండా, ఎవ్వరూ లేకుండా దొంగతనంగా మొబైల్ చూసేయాలనే జడపు లేకుండా, ఇంటిల్లి పాదీ ఓసారి చూసేయచ్చు. అయితే మనకు సినిమా అంటే భారీ తనం, లేదా మాంచి సాంగ్స్, ఒక్కటన్నా ఫైట్ ఇలాంటి లెక్కలు వేసుకుంటే మాత్రం ఈ సినిమా అంతగా ఆనదు.

ప్లస్ పాయింట్లు

తొలిసగం
టెన్షన్ పెట్టని స్క్రిప్ట్
నిడివి

మైనస్ పాయింట్లు

సరైన సాంగ్స్ లేకపోవడం

ఫినిషింగ్ టచ్: ‘బోల్డ్’ ఫన్

Rating : 2.75/5