సమీక్ష: చావు కబురు చల్లగా

2.25/5

  |   Family   |   19-03-2021


Cast - Kartikeya Gummakonda, Lavanya Tripathi, Murali Sharma, Aamani, Rajitha

Director - Koushik Pegallapati

Producer - Bunny Vasu, Allu Aravind

Banner - GA2 Pictures

Music - Jakes Bejoy

కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్ లు తెస్తున్నారు. వైవిధ్యమైన పాయింట్ తో చెబితే తప్ప సినిమాకు జనం రారు అని నమ్ముతున్నారు. అందుకే కొత్త తరహా కథలు తెరకెక్కుతున్నాయి. ఇలా కొత్తగా ఆలోచించడంలో ఒక్కోసారి గీత కూడా దాటేస్తున్నారు. అలా గీత దాటి మరీ ఆలోచించి తయారుచేసిన కథతో విడుదలయిన సినిమానే చావు కబురు చల్లగా.. చావు పుట్టుకల నడుమ సాగే మాయా ప్రపంచమే జీవితం. ఈ ఫిలాసఫీ ని ఓ అడ్డగోలు ప్రేమ కథకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తూ కొత్త దర్శకుడు కౌశిక్ ఈ సినిమాను అందించాడు.

ఇంతకీ ఈ సినిమా కథేంటీ అంటే…శవాలు తీసుకెళ్లే వాహనం డ్రయివర్ బాలరాజు (కార్తికేయ). భర్త పోయి శోకిస్తున్న మల్లిక (లావణ్య త్రిపాఠి) ని ఓ శవయాత్రలో చూసి ప్రేమించేస్తాడు. అక్కడికక్కడే ప్రేమిస్తున్నా అంటూ చెప్పేస్తాడు. ఆపై ఆమె వెంట పని నానా యాగీ చేస్తుంటాడు. ఈ ఇంగితం లేని లవ్ స్టోరీ ఇలా వుండగానే హీరో తల్లి గంగమ్మ (ఆమని) తన భర్త మంచి పట్టి వుండడంతో, ఇంటి, వంటి అవసరాల కోసం అన్నట్లుగా మోహన (శ్రీకాంత్ అయ్యంగార్) తో రిలేషన్ మెయింటెయిన్ చేస్తుంటుంది. ఇది తెలిసి ముందు తల్లిని అపార్థం చేసుకున్నా, ఆ తరువాత తండ్రి బతికి వుండగానే ఆ రెండో వాడికి ఇచ్చి పెళ్లి ఫిక్స్ చేసేస్తాడు బాలరాజు. ఇలాంటి కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన సినిమా.

సినిమా కథకు కొన్ని పరిమితులు వుంటాయి. అవుటాఫ్ ది బాక్స్ ఐఢియా అని అనడం వరకు ఒకె కానీ అక్కడ కూడా కనిపించని గీతలు వుంటాయి. హీరోయిన్ వెంటపడి ప్రేమించేలా చేసుకోవడం అన్నిది మనకు పూరి జగన్నాధ్ నేర్పిన హీరోయిజం అయితే కావచ్చు కానీ, మరీ శవం ముందు భర్త పోయి ఏడుస్తున్న హీరోయిన్ కు ఐ లవ్ యూ చెప్పడం అన్నది పూర్తిగా ఇంగితం వదిలేసిన వ్యవహారం. కొడుకుతో కలిసి తల్లి మందు కొట్టడం వరకు సరిపెట్టుకోవచ్చు కానీ, ‘నీకు నాన్న తీర్చే అవసరాలు అన్నీ నేను తీర్చలేను కదా..ఇంకో పెళ్లి చేసుకో’ అని కొడుకు అనడం మాత్రం గీత పూర్తి దాటేయడమే. ఇలాంటి ‘బరి’ దాటిన వ్యవహారాలు సినిమాలో చాలా వున్నాయి.

చావు కబురు తొలిసగం పెద్దగా ఆకట్టుకోదు. హీరో వ్యవహారాల్లో కానీ, అతని మిత్ర బృందం సీన్లు కానీ పెద్దగా ఫన్ కు నోచుకోలేదు. హీరోయిన్ ట్రాక్ ఎలాగూ కొసనించి కొస వరకు శాడ్ మూడ్ తొనే వుంటుది కాబట్టి అక్కడా ఆసక్తి కలుగదు. హీరో హీరోయిన్ వెంట పడుతుంటే మనకు ఇరిటేషన్ గా వుంటుంది తప్ప,సరదాగా వుండదు.

సినిమా ద్వితీయార్థం మొత్తం ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. దర్శకుడు ఎమోషనల్ సీన్లు బాగానే తీసాడు. వాటికి సరిపడా మంచి డైలాగులు రాసుకున్నాడు కానీ బేసిక్ గా కథే సరిగ్గా లేక, క్యారెక్టర్లు సరిగ్గా లేక, ఈ సీన్లు, డైలాగులు కూడా వృధా అయిపోయాయి. ఆమని క్యారెక్టర్ సెకండ్ లవర్ ను సీరియస్ లవర్ గా చూపించాలా? కామెడీ చేయాలా? అన్న దాంట్లో డైరక్టర్ కు ఓ స్థిరమైన ఐడియా లేకపోయింది. చావు పుట్టుకలను, జీవితం వెలుగు నీడలను డీల్ చేసానని దర్శకుడు అనుకోవడం వరకు బాగానే వుంది. ద్వితీయార్థంలో కొంత వరకు బాగానే డీల్ చేసాడు కూడా. కానీ సినిమాలో క్యారెక్టర్లు, వాటిని రాసుకున్న తీరు ప్రేక్షకులను ఒప్పించేదిగా, మెప్పించేది గా లేదు.

ఇలాంటి సినిమాలో జనాలను కాస్తయినా కూర్చో పెట్టిన ఎలిమెంట్ ఏదైనా వుందీ అంటే అది హీరో కార్తికేయ నటన. బస్తీ బాలరాజు అనే క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసాడు. ఆ ఆటిట్యూడ్, నడక, మాట, కదలికలు అన్నీ పూర్తిగా జనాల చేత ‘బాగా చేసాడు’ అనిపిస్తాయి. లావణ్య త్రిపాఠికి శాడ్ మూడ్ మినహా మరో ఎమోషన్, మరో ఎక్స్ ప్రెషన్ లేవు. మిగిలిన వారు ఒకె.

సినిమాకు దర్శకుడు కౌశిక్ రాసుకున్న సంభాషణలు బాగున్నాయి. సంభాషణల్లో, పాటల్లో తొంగి చూసిన ఫిలాసఫీ బాగుంది. జేక్స్ బిజోయ్ అందించిన పాటల్లో మూడు బాగున్నాయి. ఐటమ్ సాంగ్ లో కూడా వేదాంతం మిక్స్ చేయడం అంటే దర్శకుడు మరీ ఈ సబ్జెక్ట్ లో ఎంతలా లీనం అయిపోయాడో అర్థం అవుతుంది.

ఎన్ని చేస్తే ఏముంది? జనాలను కూర్చో పెట్టే సత్తా సినిమాలో లేకపోయినపుడు. ఈ కాన్సెప్ట్ ను అనుకున్నపుడే ఆలోచించాలి. ఎందుకంటే చావుతో పరిహాసం చేయడం అన్నది కత్తి మీద సాము కదా..

ప్లస్ పాయింట్లు

కొన్ని సంభాషణలు

కార్తికేయ నటన

మైనస్ పాయింట్లు

కాన్సెప్ట్

క్యారెక్టరైజేషన్

పంచ్ లైన్: చావు కబురు చల్లారింది

Rating: 2.25/5

-సూర్య

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)