వైవిధ్యమైన పాయింట్ చుట్టూ కథ అల్లుకోవడం, పాత్రలు మాత్రమే కనిపించే విధంగా నటులను ఎన్నుకుని, వాళ్లను మౌల్డ్ చేసి కథకు అనుగుణంగా వారి నుంచి నటనను రప్పించడం ఇలాంటి మంచి విషయాలు ఈ వారం విడుదలైన నాంది సినిమా పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ ను కలుగచేస్తాయి. కానీ ఈ పాయింట్లు తప్పిస్తే మిగిలిన పాయింట్లు నాంది సినిమా పట్ల పెదవి విరిచేలా చేస్తాయి.
నాంది..అల్లరి నరేష్ ఏరి కోరి వైవిధ్యమైన పాత్రను ఎంచుకుని చేసిన సినిమా. విజయ్ కనకమేడల దర్శకుడు. భారత న్యాయవ్యవస్థలో వున్న ఓ వెసులుబాటు. మనకు అన్యాయం జరిగింది అనిపిస్తే కోర్టు తలుపు తట్టడానికి చేతిలో వున్న ఆయుధం సెక్షన్ 211 అన్నది దర్శకుడి నిశ్చితాభిప్రాయం. ఈ సెక్షన్ గురించి జనాలకు కాస్త అవగాహన కల్పించాలన్నది ఆశయం. అందులోంచి పుట్టుకువచ్చింది..అందుకోసం రాసుకున్నది నాంది కథ.
నిర్దోషులను పోలీసులు దోషులను చేసేయడం అనే కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. గుణశేఖర్ మనోహరం, హరీష్ శంకర్ షాక్, వంశీ చెట్టుకింద ప్లీడరు ఇలా. అయితే నాంది సినిమాలో మరో ఎక్సెటెన్షన్ పాయింట్ వుంది. అదే సెక్షన్ 211.
ఇంతకీ విషయం ఏమిటంటే..సూర్యప్రకాష్ ఓ మధ్యతరగతి కుర్రాడు..అమ్మ..నాన్న..అనురాగం..ఓ ప్రేమికురాలు..అంతలోనే అనుకోని పిడుగులా సామాజిక ఉద్యమకారుడు రాజగోపాల్ హత్య కేసు అతగాడి మీద పడుతుంది. పడడం కాదు, ఓ పోలీస్ అధికారి బనాయిస్తాడు. అన్యాయంగా అయిదేళ్ల పాటు జైల్లోనే అకారణంగా మగ్గిపోతాడు. అలాంటి టైమ్ లో లాయర్ ఆద్య (వరలక్ష్మి శరత్ కుమార్) రంగంలోకి దిగుతుంది. మొదటి నుంచీ ప్రేక్షకులకు తెలిసిన డిఫెన్స్ పాయింట్లతోనే సూర్య ప్రకాష్ నిర్దోషి అని నిరూపించి, విడుదల చేయిస్తుంది.
కానీ అది కాదు నాంది సినిమా పాయింట్..ఓ పోలీస్ అధికారి కారణంగా తన జీవితం అన్ని విధాలా నాశనం అయిపోయిందన్న కారణంతో, చట్టబద్దంగా పగ తీర్చుకోవడానికి సెక్షన్ 211 కింద కేసు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా.
ముందే చెప్పుకున్నట్లు దర్శకుడి అసలు థీమ్ 211 సెక్షన్ ను ఎలివేట్ చేయడం. కానీ అసలు అక్కడే ఫెయిలయ్యాడు. సినిమా ఎత్తుగడ అంతా హీరో మీద కేసు ఎస్టాబ్లిష్ చేయడం. అందుకోసం చాలా ఎక్కువ శ్రద్ద పెట్టాడు. పోలీసుల క్రూరత్వాన్ని గట్టిగా పట్టి చూపించాడు. అంతవరకు బాగానే వుంది. కోర్టు కూడా పెద్దగా లోపలకు వెళ్లకుండా పైపైన చూసి హీరోను జైలుకు పంపిస్తుంది. న్యాయవాదులు కూడా పెద్దగా మినిమమ్ ఆలోచన చేయకుండా అతని తరపున వాదించమని పక్కకు తప్పుకుంటారు. ఇలాంటి లాజిక్ లకు దూరమైన ప్లాట్ తో హీరోను జైలుకు పంపిస్తాడు.
హీరో స్నేహితుడు అయిదేళ్ల పాటు ఆద్య వచ్చేవరకు వేచి వుంటాడు తప్ప, ఏడాది దాటిన తరువాత ఎలాంటి కేసులో అయినా బెయిల్ రావడానికి ఎక్కువ అవకాశం వుందన్న విషయమే పట్టించుకోడు. ఆద్య వాదించిన పాయింట్లతో గవర్నమెంట్ లాయర్ ఎందుకు వాదించలేదో అసలు మనకు తెలియదు. సరే ఇవన్నీ అలా వుంచితే, కథ ద్వితీయార్థంలో అసలు పాయింట్ అయిన 211 సెక్షన్ పై ఫోకస్ చేయాలనుకున్నాడు. కానీ తీరా చేసి ఆ కేసు అంతా సినిమా స్వేచ్ఛతో చకచకా మబ్బులా విడిపోతుంది. అన్నీఅర్థం అయిపోయినట్లు హీరో క్షణాల్లో డాక్యుమెంట్లు అన్ని రకాలుగా సంపాదించేస్తాడు.
ఇక్కడ ప్రేక్షకుడికి ఓ అనుమానం వస్తుంది. హీరో నిర్దోషి అని ప్రూవ్ కావాలన్నా ఇలాంటి ప్రూఫ్ లే కావాలి..211 సెక్షన్ కింద కేసు పెట్టాలన్నా ఇలాంటి డాక్యూమెంటల్ ప్రూఫ్ లే కావాలి. అప్పుడు రెండింటికీ ఏమిటి తేడా అన్నది క్లారిటీ ఇవ్వాలి. కోర్టు ఓ వ్యక్తికి అన్యాయం జరిగింది అని గ్రహించి, సారీ చెప్పిన తరువాత దానికి కారణమైన వారిని శిక్షించాల్సిన అవసరం వుంది కదా. దాని కోసం మళ్లీ ప్రత్యేకంగా శిక్షించాలని కోరుకోవడం, దానికి మళ్లీ ఎవిడెన్స్ లు ఇవ్వడం ఇదంతా కామన్ ప్రేక్షకుడి బుర్రకి అంతగా రీచ్ కాదు. పైగా కొత్తపాయింట్ చెబుతూ కొత్తగా డీల్ చేసారా అంటే అదీ లేదు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే సీన్లు రాసుకున్నారు.
నిజానికి పోలీసు వ్యవస్ధ తప్పుదారిలో వెళ్తున్నపుడు కోర్టులో న్యాయమూర్తుల ద్వారా బలమైన డైలాగులు పలికించవచ్చు. కానీ దర్శకుడు ఆ పని చేయలేదు. అసలు సినిమాలో, అరె..సూపర్ అనే సీన్ ఒక్కటీ లేదు. సినిమా ఆరంభణలో పోలీస్ అట్రాసిటీని రియలిస్టిక్ తీసానన్న సంతృప్తి ని మిగుల్చుకున్నాడు తప్ప, తాను అనుకున్న పాయింట్ ను బలంగా చెప్పగలిగాను, సరైన కథగా మలచగలిగాను అన్న సంతృప్తిని మాత్రం పొందలేకపోయాడు.
సినిమా తొలిసగం కొంత వరకు కూర్చోపెడుతుంది కానీ ద్వితీయార్థం చకచకా సినిమాటిక్ గా పరుగులు పెట్టేసి, రొటీన్ ఫీలింగ్ ను కలుగచేయడంతో ప్రేక్షకుడు పెదవి విరిచేయడం తప్ప శభాష్ అనడానికి అవకాశం కలుగలేదు.
ఇలాంటి సినిమాలో అల్లరి నరేష్ సిన్సియర్ గా సహజమైన మంచి నటన కనబర్చేందుకు ప్రయత్నించాడు. బాగా చేసాడు అని కూడా అనిపించుకున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ కు రాను రాను తెలుగులో కూడా ఫ్యాన్ పాలోయింగ్ పెరుగతోంది. దానికి ఈ సినిమా మరి కాస్త దోహదం చేస్తుంది. ప్రవీణ్, అయ్యంగార్, వర్మ ఇలా అందరూ మంచి నటనే కనబర్చారు. టెక్నికల్ గా సినిమా ఓకె. దర్శకుడు అందించిన సంభాషణల్లో ఒక్కటి కూడా విజిల్ వేయించేలా లేదా కనీసం శభాష్ అనిపించేలా లేకపోవడం కాస్త లోటే..
మొత్తం మీద నాంది ఓ ప్రయత్నం తప్ప..విజయవంతమైన ప్రయత్నం అయితే కాదు.
ఫినిషింగ్ టచ్…నాన్…ది
సూర్య
This post was last modified on %s = human-readable time difference 8:30 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…