3/5
2 Hr 28 Mins | Action, Love | 12-02-2021
Cast - Panja Vaisshnav Tej, Krithi Shetty, Vijay Sethupathi
Director - Buchi Babu Sana
Producer - Naveen Yerenini, Ravi Shankar
Banner - Mythri Movie Makers
Music - Devi Sri Prasad
ప్రేమ అనే కాన్వాస్ అనంతమైనది. ఎవరి లెవెల్ కు వాళ్లు అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించవచ్చు. అది వారి వారి స్టామినాను ప్రదర్శిస్తుంది. సినిమాకు కూడా అంతే ప్రేమ అనే సబ్జెక్ట్ ను కొన్ని వేన వేల సార్లు వెండితెర మీద ఆవిష్కరించారు. మల్లీశ్వరి నుంచి మరోచరిత్ర, గీతాంజలి మీదుగా ఇప్పటి వరకు….ఈ లైన్ లో వచ్చిందే ఈవారం విడుదలైన ఉప్పెన.
ఉప్పాడ సముద్రతీరం లో జరిగిన ఓ ప్రేమ కథ. యువత ప్రేమను పెద్దలు తిరస్కరించాలంటే ఏదో ఒక అంతరం వుండాలి..ఈ సినిమాలో పెద్దంటి అమ్మాయి (కృతి షెట్టి) …పేదింటి అబ్బాయి (వైష్ణవ్ తేజ్)..షరా మామూలే. అమ్మాయి తండ్రి (విజయ్ సేతుపతి)కి పరువు వేరు ప్రాణం వేరు కాదు. రెండూ ఒక్కటే. దాంతో ఈ జంట కాస్తా ఊరి నుంచి జంప్..తిరిగి తిరిగి మళ్లీ ఇంటికి చేరిన అమ్మాయికి షాకింగ్ న్యూస్ చెబుతాడు తండ్రి. దాంతో ఆ అమ్మాయి ఏం చేసింది అన్నది మిగిలిన సినిమా.
ఉప్పెన సినిమాలో కొత్తదనం ఏదన్నా వుందీ అంటే మారుతున్న సాంకేతికత సాయంతో చేసిన ప్రయత్నం తప్ప మరోటి కాదు. అదే పేదరికం..అదే పెద్దరికం..అదే ప్రేమ..కావచ్చు. అంతకన్నా ఇంకేం వుంటుంది అని ఎవరైనా అడగొచ్చు. ప్రతి ప్రేమ సినిమాలో కొత్తగా చూపిస్తేనే అందం. జనాలకు అలవాటైన ప్రేమను మరోసారి గుండె పట్టేలా చూపిస్తేనే అందం. అదే మిస్ అయింది ఉప్పెనలో.
ఉప్పెనలో విలనిజంపై పెట్టిన దృష్టి ప్రేమ మీద పెట్టినట్లు కనిపించదు. డ్రయివర్ కు లంచం అలవాటు చేసి క్లాసులకు డుమ్మా కొట్టి, బీచ్ లో తిరిగే ప్రేమ కుర్రకారుకు సరదాగా వుంటుందేమో కానీ సీరియస్ ప్రేమ అనిపించుకోదు. ఇద్దరి మధ్య సరైన భావోద్వేగాలు చూపించ కుండానే సముద్రం మధ్యలోకి తీసుకుపోయి, ఓ రాత్రి గడిపేసేలా చేయడం అంటే దర్శకుడు ప్రేమను ఎక్కడో లైట్ తీసుకున్నాడు అనిపిస్తుంది.
విలన్ ను, అతని వ్యవహారాలను వీలయినంత కొత్తగా చెక్కాలని ప్రయత్నించిన దర్శకుడు ఈ ప్రేమ వ్యవహారాలను మాత్రం అలా చెక్కలేకపోయాడు. నేపథ్య సంగీతం, పాటలు, కెమేరా పనితనం లేకపోతే ఆ పాటి ప్రేమ కూడా ప్రేక్షకులకు కనిపించకపోయేది. పైగా ప్రేమికులను ఊరు దాటించి ఒరిస్సా, బెంగాల్ తదితర రాష్ట్రాలు తిప్పడం మొదలుపెట్టిన తరువాత సినిమా మరింత జారిపోయింది. అలా జారిపోయిన సినిమాను క్లయిమాక్స్ కాస్త నిలబెట్టింది.
సినిమాలో కీలకమైన పాయింట్ ముందే లీక్ అయిపోవడం వల్ల కూడా సినిమా ద్వితీయార్థం రక్తి కట్టలేదనుకోవాలి. సినిమాలో రాయనం పాత్రను మరింత ఎలివేట్ చేయడం కోసం ఇటు ప్రేమికుల పాత్రను తగ్గించేసాడో, తగ్గిపోయిందో అనిపిస్తుంది. అందువల్ల ఈ ప్రేమ మీద ప్రేక్షకులకు అంతగా సానుభూతి కలుగదు.
ఇలాంటి సినిమాకు సాంకేతిక సహకారం బలంగా అందింది. బుచ్చిబాబు డైలాగులు కానీ, సినిమాటోగ్రఫీ కానీ, దేవీ ప్రాణం పోసిన నేపథ్యసంగీతం కానీ, పాటలు కానీ అన్నీ కలిసి సినిమాను ఓకె అనే రేంజ్ కు తీసుకువచ్చాయి.
వైష్ణవ్ తేజ, కృతి శెట్టి తొలి సినిమా అయినా బాగా చేసారు. విజయ్ సేతుపతి గురించి కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. సినిమాలో కీలకమైన పాయింట్ ను కొత్తగా ఆలోచించిన దర్శకుడు హీరోయిన్ తల్లి, హీరో తండ్రి, వాళ్ల వాళ్ల నేపథ్యాలు, ప్రేమానంతర బతుకు సీన్లు ఇలాంటి వాటిలో కొత్తగా ఆలోచించకపోవడం ఉప్పెన సినిమా అనుకున్న రేంజ్ కు చేరుకోలేకపోయింది.
ఫినిషింగ్ టచ్….ప్రేమ తక్కువ..విలనిజం ఎక్కువ
-సూర్య
Gulte Telugu Telugu Political and Movie News Updates