2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి తెలుగు స్ట్రెయిట్ సినిమా కావడంతో ఇతర భాషల్లోనూ ఆసక్తి నెలకొంది. మూడేళ్ళ విలువైన కాలాన్ని ఖర్చు పెట్టేందుకు రామ్ చరణ్ వెనుకాడలేదంటే ఎంతగా స్క్రిప్ట్ ని నమ్మాడో అర్థం చేసుకోవచ్చు. క్యాలికులేటెడ్ నిర్మాతగా పేరున్న దిల్ రాజు ఈసారి బడ్జెట్ రెక్కలను పూర్తిగా విప్పేశారు. యాభైయ్యవ సినిమాగా వందల కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఇంత హైప్ తో వచ్చిన గేమ్ ఛేంజర్ మెప్పించిందా
కథ
ఐఎఎస్ చదివి వైజాగ్ కలెక్టర్ గా వస్తాడు రామ్ నందన్ (రామ్ చరణ్). రాగానే అక్రమార్కుల భరతం పట్టడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మోపిదేవి (ఎస్జె సూర్య) తో శత్రుత్వం ఏర్పడుతుంది. అనూహ్యంగా జరిగిన ఒక సంఘటన వల్ల సిఎం సత్యమూర్తి (శ్రీకాంత్) ద్వారా రామ్ అసలు తండ్రి అప్పన్న (రామ్ చరణ్) గతం బయపడుతుంది. తల్లి పార్వతి (అంజలి) బ్రతికే ఉందన్న నిజం తెలుస్తుంది. తర్వాత రామ్ ఊహించని రీతిలో కొన్ని పరిణామాలు ఎదురుకుని రాష్ట్రంలో ఒక కీలక మార్పుకు కారణమవుతాడు. అదేంటి, తండ్రి లక్ష్యం కోసం అతనేం చేశాడు, దుర్మార్గుల ఆట ఎలా కట్టించాడనేది తెరమీద చూడాలి.
విశ్లేషణ
శంకర్ సినిమాల్లో ప్రత్యేకత ఏంటంటే సామాజిక సందేశం ఉంటూనే కమర్షియల్ కొలతలు మిస్ కాకుండా భారీ గ్రాండియర్స్ తో వావ్ అనిపించడం. జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు ఇలా ఏది చూసుకున్నా ఈ విషయం స్పష్టమవుతుంది. కానీ గేమ్ ఛేంజర్ లో తన స్టయిల్ తో పాటు ఒక్కడు, పోకిరి తరహా రేసీ స్క్రీన్ ప్లే ద్వారా మాస్ కి మరింత దగ్గరవ్వాలనుకునే ప్రయత్నం చేసినట్టు ఆయన పలు ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే దానికి సరిపడా ముడిసరుకుని మాత్రం సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రమాదం జరగడం నుంచి ఆసక్తిగా మొదలుపెట్టినా హీరో ఇంట్రో నుంచే రెగ్యులర్ పంథాలో వెళ్ళిపోయి తన మార్కుని మిస్ చేసేశారు.
ఫ్లాష్ బ్యాక్ లవ్, కామెడీని హ్యాండిల్ చేయడంలో శంకర్ బలహీనత చరణ్, కియారా ఎపిసోడ్ లో మరోసారి బయటపడింది. ఆ ట్రాక్ మొత్తం నవ్వించకపోగా ఎప్పుడు అయిపోతుందాని ఎదురు చూసేలా చేసింది. ఇక్కడ ఫ్లో లేకపోవడం వల్ల అద్భుతమైన డాన్సులున్న ధోప్ సాంగ్ చప్పగా అనిపిస్తుంది. తిరిగి వర్తమానంలోకి వచ్చాక వేగం పుంజుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్ దాకా పెద్దగా ఆసక్తి కలిగించకుండానే సన్నివేశాలు వెళ్తూ ఉండటం ఫస్టాఫ్ ఇంప్రెషన్ తగ్గించేసింది. విశ్రాంతి దగ్గర ఇచ్చిన ట్విస్టు అంత సులభంగా ఊహించేది కాకపోవడం దాన్ని నిలబెట్టింది. అక్కడ రామ్ నందన్ కు ఇచ్చిన బిల్డప్, ఎలివేషన్ మాస్ కి నచ్చేలా పేలాయి.
ఇక అప్పన్న ఎంట్రీ జరిగాక అద్భుతాలు ఆశించడం సహజం. పంచెకట్టు, పల్లెటూరి నేపథ్యం, క్యారెక్టరైజేషన్ రెండూ బాగున్నాయి. అయితే వాటి చుట్టూ అల్లుకున్న సెటప్, ఇతర పాత్రలు రొటీన్ గా ఉండటంతో పాటు తర్వాత ఏం జరుగుతుందో సులభంగా ఊహించేలా వెళ్లడం ప్రభావాన్ని తగ్గించింది. చరణ్ పెర్ఫార్మన్స్ నిలబెట్టింది కానీ లేదంటే చెప్పడానికి బలమైన పాయింట్ లేకపోయేది. రామ్ నందన్ ఎలక్షన్ కమీషనర్ గా ఛార్జ్ తీసుకున్నాక మొదలయ్యే ప్రహసనం సహనానికి పరీక్ష పెడుతుంది. ప్రేక్షకులను కుర్చీ అంచులకు తేవాల్సిన క్యాట్ అండ్ మౌస్ గేమ్ పదే పదే ఒకే చోట తిరుగుతూ అసలేం జరుగుతోందో అర్థం కానీ అయోమయానికి దారి తీస్తుంది.
అసలు శంకర్ లాంటి క్రియేటివ్ జీనియస్ ఇంతగా లాజిక్స్ వదిలేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐఏఎస్, మంత్రులు, సిఎంలకు సంబంధించిన హక్కులు, బాధ్యతల గురించి రీసెర్చ్ చేసి దాన్ని వాడుకోవడం వరకు బాగానే ఉంది కానీ సినిమాటిక్ టచ్ లేని జ్ఞానం ఎంత పెద్ద స్టార్ ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే. ఒకే ఒక్కడులో జర్నలిస్ట్ ఒక్క రోజు ముఖ్యమంత్రి అయితే నమ్మశక్యంగా అనిపించింది కానీ ఇందులో పార్టీ ఒక వ్యక్తిని సిఎం క్యాండిడేట్ గా ప్రకటించగానే పోలీసులు అతని ముందు మోకరిల్లడం సిల్లీగా తోస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కొన్ని వర్తమాన సంఘటనలు పొందుపరిచారు కానీ వాటిలోనూ డ్రామా కొరవడింది.
ఎంత సీనియర్ దర్శకులైనా అప్డేట్ అవ్వడం చాలా ముఖ్యం. కానీ శంకర్ తన గత సినిమాల రెఫెరెన్సులు, గ్రాండియర్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం అసలైన మ్యాటర్ ని వీక్ గా మార్చింది. అంత గొప్పగా చెప్పుకున్న జరగండి జరగండి పాటకు థియేటర్లో చప్పుడు లేకపోవడమే దానికి నిదర్శనం. కలెక్టర్, సిఎం మధ్య దోబూచులాటను రసవత్తరంగా చూపించే అవకాశమున్నా స్టోరీ డెవలప్మెంట్ లో దానికి చోటివ్వలేదేమో. పొలిటికల్ థ్రిల్లర్స్ కు కావాల్సిన పట్టుని శంకర్ ఒడిసిపట్టుకోలేకపోయారు. శేఖర్ కమ్ముల లీడర్ లో కొన్ని మాములు సీన్లు షాక్ ఇస్తూనే ఆలోచింపజేసేలా ఉంటాయి. అలాంటివి గేమ్ ఛేంజర్ లో ఓ నాలుగైదున్నా స్థాయి మారిపోయేది.
పెద్దగా అంచనాలు, ఆశలు పెట్టుకోకుండా గేమ్ ఛేంజర్ చూస్తే మరీ దారుణంగా అనిపించడు. కానీ శంకర్ బ్రాండ్ అలా చేయనివ్వదు. కొండంత ఆశలతో థియేటర్లో అడుగు పెట్టే ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. కమర్షియల్ స్కేల్ ఉన్నంత మాత్రాన స్టార్ హీరోల సినిమాలన్నీ సక్సెసైపోవు. డ్రామా, కట్టిపడేసే కథనం సరైన మోతాదులో లేకపోతే దెబ్బ పడతాయి. డెబ్భై అయిదు కోట్లు కేవలం పాటలకే ఖర్చు పెట్టామనే మాట వినడానికి బాగుంటుంది కానీ తెరపై కూడా అదే భావన కలిగినప్పుడు జనం సూపర్ అంటారు. భారతీయుడు 2 కంటే బాగుందా అంటే ఎస్ అని చెప్పొచ్చు కానీ ఒకే ఒక్కడు స్థాయిలో ఉందా అంటే మౌనమే సమాధానం.
నటీనటులు
ఒకే కథలో మూడు విభిన్న గెటప్స్, షేడ్స్ ఉన్న పాత్ర దొరకడం రామ్ చరణ్ లక్. దానికి అనుగుణంగానే లుక్స్, పెర్ఫార్మన్స్ పరంగా వైవిధ్యం చూపించి భేష్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా అప్పన్నగా మనసులు గెలుచుకుంటాడు. ఇది కొంత భాగమే ఉన్నప్పటికీ గుర్తుండిపోయేలా నటించాడు. నత్తితో బాధపడుతూనే అయినవాళ్లకు మంచి జరగాలని తపించే నాయకుడిగా బెస్ట్ ఇచ్చాడు. కుర్రాడిగా పెద్దగా స్కోప్ దక్కలేదు కానీ ఐఎఎస్ గా స్వాగ్, స్టైల్ రెండూ కుదిరాయి. హీరోయిన్ కియారా అద్వానీ అందంగా బుట్టబొమ్మలా ఉంది. చెప్పుకోవడానికి ఎక్కువ స్కోప్ లేదు కానీ చరణ్ జోడిగా బాగుంది. సెకండాఫ్ లో మొక్కుబడిగా మారిపోయి పెద్దగా కనిపించదు.
అంజలి ఉన్నంతలో కాస్త గుర్తుండిపోతుంది. అప్పన్నతో బాండింగ్ తెరపై ఆకట్టుకునేలా సాగింది. వయసు మళ్ళిన లుక్ అంతగా నప్పలేదనిపించింది. శ్రీకాంత్ క్యారెక్టర్ కు ఆర్క్ బాగుంది. అయినా ఆయన పూర్తి పొటెన్షియాలిటీని వాడుకోలేదు. ఎస్జె సూర్య విలనిజం పేలింది కానీ క్రమంగా లౌడ్ డైలాగ్ డెలివరీని తగ్గించుకుంటే బెటర్. లేదంటే ఇదే రొటీనైపోయే ప్రమాదముంది. నవీన్ చంద్ర హడావిడిలో కలిసిపోయాడు. సునీల్ తో కీచుమంటూ అరుపులు లేకుండా స్మూత్ కామెడీ చేయించారు. సీనియర్ ఆర్టిస్ట్ జయరామ్ కాస్త ఓవర్ చేశారనిపించింది. మనో డబ్బింగ్ అతకలేదు. ప్రియదర్శి, సత్య, వైవా హర్ష తదితరులు కొన్ని నిముషాలు కనిపించారంతే.
సాంకేతిక వర్గం
తమన్ నేపధ్య సంగీతం వీలైనంత గేమ్ ఛేంజర్ ని నిలబెట్టే ప్రయత్నం చేసింది. మరీ అదిరిపోయే స్కోరని చెప్పలేం కానీ తనవరకు ఏమేం ఇవ్వగలడో బీజీఎమ్ పరంగా పూర్తి న్యాయం చేశాడు. శంకర్ స్కూల్ లో పాటలు ఉండాలని చేసిన ప్రయత్నం మిశ్రమ ఫలితం ఇచ్చింది. విజువల్ గా ఓకే కానీ ఆడియో కొంచెం వీకవ్వడానికి కారణం ఇదే. తిరు ఛాయాగ్రహణం నిర్మాత పెట్టిన ఖర్చునంతా తెరమీద చూపించింది. స్టాండర్డ్ కొనసాగించారు. శామీర్ – రూబెన్ ఎడిటింగ్ కాస్త రెండో సగం మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు కొన్ని అర్థవంతంగా, కొన్ని అర్థం కానట్టుగా సాగాయి. దిల్ రాజు రాజీపడని నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
రామ్ చరణ్
అప్పన్న ఎపిసోడ్
తమన్ మ్యూజిక్
ఇంటర్వెల్ బ్లాక్
మైనస్ పాయింట్స్
లవ్ స్టోరీ
నిడివి
కొత్తదనం లేని ట్రీట్మెంట్
మాములు కథా కథనాలు
హై ఇచ్చే మూమెంట్స్ లేకపోవడం
ఫినిషింగ్ టచ్ : ఖరీదైన గ్రౌండులో మాములు ఆట
రేటింగ్ : 2.5 / 5
This post was last modified on January 10, 2025 11:18 am
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…