తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం.. కంగువ. ఇప్పటిదాకా రొటీన్ మాస్ మసాలా సినిమాలే తీసిన శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ప్రతి ప్రోమోతోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఒక కొత్త, అద్భుత ప్రపంచాన్ని సృష్టించి.. ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచడానికి టీం ప్రయత్నిస్తున్న విషయం ప్రోమోల్లో అర్థమైంది. సినిమా క్లిక్ అయితే బాక్సాఫీస్ దగ్గర బాహుబలి తరహా అద్భుతాలు చూడొచ్చనే అంచనాలున్నాయి.
ఐతే ఈ సినిమా కోసం సుదీర్ఘ కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 10న రిలీజ్ అంటూ ఊరించారు కానీ.. ఉన్నట్లుండి ఆ డేట్ విషయంలో టీం వెనుకంజ వేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘వేట్టయాన్’ కోసం తమ చిత్రాన్ని వాయిదా వేసుకుంటున్న విషయాన్ని సూర్యనే స్వయంగా చెప్పేశాడు.
ఇక అప్పట్నుంచి కొత్త డేట్ కోసం అన్వేషణ మొదలైంది. అనేక తర్జన భర్జనల మధ్య ఈ చిత్రాన్ని నవంబరు 14కు ఫిక్స్ చేశారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం ఆ రోజు రిలీజ్ కానుంది. పాన్ వరల్డ్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. కొన్ని విదేశీ భాషలతో కలిపి మొత్తం 10 భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
అక్టోబరు 10న సోలోగా రిలీజ్ అయితే ‘కంగువ’ విధ్వంసానికి హద్దులు ఉండేవి కావు. కానీ ‘వేట్టయాన్’ టీం కూడా అదే డేట్ మీద పట్టుబడడంతో సూర్య మూవీ సైడ్ అయింది. దీపావళికి వివిధ భాషల్లో పేరున్న సినిమాలు రిలీజవుతున్నాయి. డిసెంబరు అంతా ప్యాక్ అయిపోయింది. సంక్రాంతి పరిస్థితీ అంతే. ఇవి మిస్ అయితే వేసవి తప్ప మరో మార్గం లేదు. అందుకే నవంబరు పెద్ద సినిమాలకు అంత కలిసొచ్చే సీజన్ కాదని తెలిసినా.. సోలో డేట్ కోసం ఆ నెలలో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఆ నెల మొత్తం వేరే పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో ‘కంగువ’ ప్రభంజనం సాగిస్తుందని అంచనా వేస్తున్నారు.