ఆమిర్ ఖాన్ కొన్నేళ్ల ముందు వరకు ఇండియన్ సినిమాను ఏలిన హీరో. ‘లగాన్’ దగ్గర్నుంచి తన రేంజే మారిపోయింది. ఆ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. ఆ తర్వాత రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి భారీ బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు.
ఆమిర్ సినిమా వస్తోందంటే భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రేక్షకులూ థియేటర్లకు వెళ్లిపోయేవారు. ఐతే ఆమిర్ కెరీర్లో ఫ్లాపులు లేవని కాదు కానీ.. ‘లాల్ సింగ్ చడ్డా’ మాత్రం ఆయనకు దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది.
హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. విడుదలకు ముందే డిజాస్టర్ ఫీల్స్ ఇచ్చింది ఆడియన్స్‌కు. ఆ సమయంలో వేరే వివాదాలు కూడా తోడై ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఆమిర్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆమిర్ ఖాన్ కొంత కాలం సినిమాలే ఆపేసిన పరిస్థితి.
ఐతే ప్రస్తుతం తన ప్రొడక్షన్లో ఓ సినిమ ాను ప్రొడ్యూస్ చేస్తున్న ఆమిర్.. నటుడిగానూ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమిర్ ఓ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాలకు విడుదలకు ముందే డిజిటల్ డీల్స్ చేసుకోకూడదన్నదే ఆ నిర్ణయం.
అంతే కాదు.. రిలీజ్ తర్వాత కూడా వెంటనే ఒప్పందం కుదుర్చుకోరట. థియేటర్లలో ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు ఆడనిచ్చి ఆ తర్వాతే డిజిటల్ హక్కుల అమ్మకం సంగతి చూడాలని ఆమిర్ డిసైడయ్యాడట. కరోనా దగ్గర్నుంచి ఓటీటీల విప్లవం మొదలై.. ఆ ప్రభావం థియేటర్ల మీద గట్టిగానే పడింది.
విడుడలైన కొన్ని వారాలకే ఓటీటీలో సినిమాలు రిలీజైపోతుండడంతో జనం థియేటర్లకు రావడం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన ఏ మల్టీప్లెక్స్ కూడా ఎనిమిది వారాల్లోపు ఓటీటీలోకి వచ్చే సినిమాలను తమ స్క్రీన్లలో ప్రదర్శించడం లేదు. ఇందుకు అనుగుణంగానే హిందీ సినిమాల డిజిటల్ డీల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆమిర్ ఓ అడుగు ముందుకు వేసి థియేట్రికల్ రన్ అంతా అయ్యాకే డిజిటల్ డీల్స్ చేసుకోవాలని ఫిక్సయ్యాడు.