నటిగా ఇంకా ఎదుగుతోన్న దశలోనే ‘మహానటి’ లాంటి సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం రావడమంటే అదృష్టమనే చెప్పాలి. కీర్తి సురేష్‌లో సావిత్రి ఏ యాంగిల్లో కనిపించిందో తెలియదు కానీ నాగ్ అశ్విన్ తన సినిమాకి ‘సావిత్రి’ తనేనని ఫిక్స్ అయిపోయాడు. నిజంగానే మహానటి సావిత్రిని తలపించే నటనతో ఆబాలగోపాలన్నీ అలరించడమే కాకుండా జాతీయ అవార్డును కూడా గెలిచేసుకుంది.
అంతటి సినిమా చేసిన తర్వాత అల్లాటప్పా సినిమాలు చేయడం సబబు కాదని ఆమె గుర్తించింది. అందుకే ఆ తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకుంది. అవసరమయితే ఇతర భాషలలో మాత్రమే చేసింది కానీ తెలుగు వరకు మంచి కథ దొరికే వరకు వేచి చూసింది. అలా ఆమె ఎన్నో నాళ్లు ఎదురు చూసిన తర్వాత మిస్ ఇండియా, గుడ్‌లక్ సఖి చిత్రాలు చేసింది. థియేటర్లలో విడుదలయితే ఈ చిత్రాలతో కీర్తి సురేష్ బాక్సాఫీస్ పుల్ ఏమిటో తెలిసి వుండేది. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమాలు ఓటిటిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కాకుండా ఆమె చేసిన ఏకైక కమర్షియల్ సినిమా ‘రంగ్ దే’.
అదయినా థియేటర్లలో విడుదలయితే మహానటి తర్వాత ఇంత కాలానికి అభిమానులకు ఆమెను వెండితెరపై చూసే వీలు చిక్కుతుంది. కానీ ఆ సినిమాను కూడా ఓటిటిలో విడుదల చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహానటి తర్వాత నటిగా ఒక స్థాయి మెయింటైన్ చేయాలని చూసిన కీర్తి సురేష్ ఇలా తన సినిమాలన్నీ ఓటిటి బాట పట్టడం చూసి కాస్త డిజప్పాయింట్ అవడం సహజమే మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates