జానీ మాస్టర్‌కు పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం ఎలాంటిదో తెలిసిందే. సినిమాల పరంగానే కాక రాజకీయంగానూ పవన్ మీద అమితాభిమానంతో జనసేన కోసం ఎన్నికల ప్రచారంలోనూ పని చేశాడు జానీ. తాజాగా అతను పవన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జానీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐతే పవన్ ఇంతటితో ఆగడని.. 2029లో ముఖ్యమంత్రి అవుతాడని.. అలాగే 2034 నాటికి ఏకంగా ప్రధాన మంత్రే అవుతాడని జానీ మాస్టర్ తన ప్రసంగంలో ఆవేశపూరితంగా చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
జనసైనికులకు ఇది ఉత్సాహాన్నిచ్చే వీడియోనే అయినా.. వేరే వాళ్లకు రుచించడం లేదు. ప్రస్తుతం జనసేన వాళ్లతో సుహృద్భావంతో సాగుతున్న టీడీపీ వాళ్లు జానీ మాస్టర్ మాటలను తప్పుబడుతున్నారు. ఓవైపు చంద్రబాబును ముఖ్యమంత్రిగా పవన్ పూర్తిగా ఆమోదిస్తూ ఆయనకు జై కొడుతుంటే.. వచ్చే పర్యాయం ఆయన్ని కాదని పవన్ ముఖ్యమంత్రి అయిపోతాడా అని ప్రశ్నిస్తున్నారు.
కానీ బాబు మీద వయసు ప్రభావం, అలాగే ఇంకో ఐదేళ్లకు పెరిగే జనసేన గ్రాఫ్ ఆధారంగా పవన్ సీఎం అవుతాడంటే తప్పేంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. కానీ 2034 నాటికి పవన్ ప్రధాని అవుతాడన్న మాట మాత్రం అందరికీ అతిశయోక్తిగానే కనిపిస్తోంది. ఈ కామెంట్ మరీ ఓవర్ అని వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ సీఎం, పీఎం అనే మాటలు మాట్లాడకుంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates