బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఒక నటుడిని తెరవేల్పుగా కొలిచే స్థాయికి ఎదిగిన నందమూరి తారకరామారావు వారసత్వం మోయడమంటే ఒక సినిమాకు అంగీకారం చెప్పి అడ్వాన్స్ తీసుకున్నంత తేలిక కాదు. దానికెంతో కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష కావాలి. అవి ఉంటేనే ప్రేక్షకులు హారతులు పడతారు, గుండెల్లో పెట్టుకుంటారు. ఆ పేరే బాలకృష్ణ. సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం 1974లో ఇదే ఆగస్ట్ 30న బాలనటుడిగా తండ్రి చిత్రం ‘తాతమ్మ కల’తో రంగప్రవేశం చేసిన బాలయ్య అప్రతిహతంగా అర్ధశతాబ్దపు నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోడమే కాదు ఇప్పటికీ అదే ఎనర్జీతో, కష్టపడే తత్వంతో వెండితెరపై తన సంతకం చేస్తూనే ఉన్నారు.
నాన్న అడుగుజాడల్లో ఆయనతోనే కలిసి అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, దానవీరశూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మద్విరాటపర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, అనురాగ దేవత, సింహం నవ్వింది వరకు ప్రయాణం చేయడం ఎన్నో గొప్ప పాఠాలు నేర్పింది. సోలో హీరోగా ఒకే సంవత్సరంలో తొలి మూడు చిత్రాలు సాహసమే జీవితం (1984), డిస్కో కింగ్, జననీ జన్మభూమి నిరాశపరిచాయి. అదే ఏడాది ఎన్టీఆర్ వారసుడిని మాస్ ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో తెలిసిన దర్శకుడు కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ నిర్మాత గోపాల్ రెడ్డి పరిచయమయ్యారు.
అలా మంగమ్మ గారి మనవడు రూపంలో బాలయ్యకు అయిదు వందల రోజులాడిన తొలి ఇండస్ట్రీ హిట్ దక్కింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. అచ్చె తెలుగు పంచెకట్టులో తమవాడిగా ఫీలైన జనం బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు. మువ్వగోపాలుడు కొన్ని ఉదాహరణలు మాత్రమే. చెల్లెలి సెంటిమెంట్ సినిమాతో రికార్డులు బద్దలయ్యే కనక వర్షం కురిపించవచ్చని ముద్దుల మావయ్య (1989) నిరూపిస్తే మాస్ మసాలా ట్రెండ్ లో దానికి ఎదురీది నారి నారి నడుమ మురారి (1990) తో ఘనవిజయం సాధించడం బాలయ్యకే సాధ్యమయ్యింది.
తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఆదిత్య 369 (1991) మిగిలిన జ్ఞాపకాలు ప్రత్యేకం. జానపదాలకు కాలం చెల్లిన రోజుల్లో భైరవ ద్వీపం (1994) తో ఆబాలగోపాలాన్ని అలరించడం చూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. రౌడీ ఇన్స్ పెక్టర్ (1992) తో ఖాకీ దుస్తుల్లో ఊర మాస్ ని బి గోపాల్ పరిచయం చేసి వసూళ్ల భరతం పట్టారు. బాలయ్య ఒకే రోజు రెండు రిలీజులు చేసి బంగారు బుల్లోడు – నిప్పురవ్వ (1993) తో అభిమానులను సంభ్ర మాశ్చర్యానికి గురి చేశారు. మధ్యలో కొన్ని అపజయాలు దిష్టిచుక్కల్లా పలకరించినా బొబ్బిలి సింహం, వంశానికొక్కడు, పెద్దన్నయ్య ఇలా ఎన్నో మైలురాళ్ళు తెలుగువారిని బాలయ్యకు మరింత దగ్గర చేశాయి.
ఫ్యాక్షన్ జానర్ కు గ్రామర్ రాసిన సమరసింహారెడ్డి (1999) ది ఎంత రాసినా తరిగిపోని చరిత్ర. ఇది వచ్చాక టాలీవుడ్ లో ఎన్ని రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చాయో లెక్క చెప్పడం కష్టం. నరసింహనాయుడు (2001) దానికి మరింత బలాన్ని అందిస్తే ఈ ఫార్ములా ఫాలో కానీ స్టార్ హీరోలు లేరంటే అతిశయోక్తి కాదు. వరస ఫ్లాపులు కొన్నేళ్లు సహనశీలిగా మారిస్తే తనలో బాక్సాఫీస్ సత్తా ఏ మాత్రం తగ్గలేదని సింహా (2010) తో మళ్ళీ నిరూపించారు తర్వాతి క్రమంలో లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి వరకు అలుపెరుగని నట ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంది.
బుల్లితెరపై అన్ స్టాపబుల్ టాక్ షోతో మరో కొత్త శకానికి నాంది పలికిన బాలయ్య అందులోనూ జయకేతనం ఎగరేయడం ఆయన కిరీటంలో మరో కలికితురాయి. రాజకీయంలో తనదైన ముద్ర కొనసాగిస్తూ వరసగా మూడు సార్లు హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది సీనియర్ హీరోల్లో ఎవరూ అందుకోలేని ఘనతను దక్కించుకున్నారు. ఈ పరుగుకు అలుపు రాదు. నిర్మాణంలో ఉన్న ఎన్బికె 109 రిలీజైనా, రేపు కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రంలో ఒక తండ్రిగా భాగం పంచుకున్నా ఆగేది కాదు. అందుకే స్వర్ణోత్సవ వేళ ఆయన అందుకున్న మైలురాళ్ళు, జై బాలయ్య నినాదాలు ఎందరికో స్ఫూర్తి దీపికలు.