మాములుగా సినిమాల్లో మల్టీస్టారర్లు చూడటమే తక్కువ. అలాంటిది వందల కోట్ల మార్కెట్ ఉన్న పెద్ద హీరోలు ఒక ప్రాజెక్టు కోసం చేతులు కలపడం అరుదు. మనోరథంగల్ ఆ కోవలోకే వస్తుంది.
తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని ప్రధాన భాషల్లో రెండు వారాల క్రితం స్ట్రీమింగ్ మొదలైన ఈ వెబ్ సిరీస్ గురించి ఎక్కడా సౌండ్ వినిపించడం లేదు. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫాసిల్, నదియా, బిజూ మీనన్, నదియా, మధుబాల ఇలా అందరూ తెలుగు ఆడియన్స్ కి పరిచయమున్న వారే కావడం గమనార్హం. సుప్రసిద్ధ రచయిత వాసుదేవ్ నాయర్ రాసిన తొమ్మిది కథల ఆధారంగా తొమ్మిది దర్శకులు తీశారు.
తప్పిపోయిన చెల్లెలి కోసం జర్నలిస్టు చేసే ప్రయాణం, ప్రేమించిన అమ్మాయి వేరే ధనవంతుడిని ఇష్టపడితే ఓ వ్యక్తి ఎదుర్కునే స్థితి, భర్తని వదిలేసిన మహిళకు సమాజంలో ఎదురయ్యే సమస్యలు, వలస వెళ్లిన వాళ్లకు ఎదురయ్యే చిక్కులు, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు ప్రభావాలు, ప్రకృతి గొప్పదనం, వృద్ధాప్యం వచ్చాక పెద్దలు పడే యాతన ఇలా రకరకాల నేపధ్యాలను తీసుకుని తొమ్మిది ఎపిసోడ్లు అందించారు. కమల్ హాసన్ నిర్మాతల్లో ఒకరిగా ఉండటమే కాదు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. అయితే అంచనాలు అందుకోవడంలో ఈ మల్టీస్టారర్ వెబ్ సిరీస్ తడబడింది.
కారణం అధిక శాతం నెరేషన్ విపరీతమైన నెమ్మదితనంతో సాగడమే. ఫార్వార్డ్ బటన్ కు పని చెప్పేలా దర్శకులు సాగతీత చేశారు. ఒకటి రెండు బాగున్నప్పటికీ ఓవరాల్ గా పాస్ కాలేకపోయాయి, ప్రియదర్శన్, సంతోష్ శివన్ లాంటి దిగ్గజాలు పని చేసినా ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు. విపరీతమైన మెలో డ్రామా నచ్చేవాళ్లకు మాత్రం మనోరథంగల్ ఓ అతి కష్టం మీద ఓకే అనిపిస్తుంది కానీ ఎంగేజ్ చేసే కంటెంట్ కావాలంటే మాత్రం కష్టం. ఓపికను డిమాండ్ చేస్తుంది. ఎంత వెబ్ సిరీస్ అయినా, ఆర్టిస్టులు అద్భుతంగా నటించినా సరే ఎంగేజ్ చేయకపోగా నీరసంతో ఉసూరుమనిపిస్తుంది.