గోపీచంద్ బుల్లెట్ బయటికొచ్చేస్తోంది

యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్ పెద్ద స్లంప్‌లో ఉందిప్పుడు. కొన్నేళ్లుగా అతడి సినిమాలేవీ ఆడలేదు. రిలీజైన సినిమాలు ఆడకపోవడమే కాక.. మధ్యలో ‘ఆరడుగుల బుల్లెట్’ అనే సినిమా విడుదలకు కూడా నోచుకోకుండా ఆగిపోయింది. కొన్నేళ్ల పాటు హోల్డ్‌లో ఉన్న ఈ సినిమాను రెండేళ్ల కిందట రిలీజ్ చేయడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి కానీ.. చివరి దశలో బ్రేక్ పడింది. ఆ సినిమా థియేటర్ల ముఖం చూడలేదు.

ఇక ఎప్పటికీ ఆ సినిమా రాదని అనుకుంటుంటే.. ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని దానికి మోక్షం కలగబోతున్నట్లు సమాచారం. థియేటర్లలో ఆ సినిమా విడుదలయ్యే ఛాన్సే లేకపోవడం, ఒకవేళ కష్టపడి రిలీజ్ చేసినా ప్రేక్షకుల్లో ఉన్న అనాసక్తి వల్ల ఆ సినిమాకు ఆదరణ దక్కడం సందేహంగానే ఉండటంతో ఓటీటీలో రిలీజ్ చేసి చేతులు దులుపుకోవాలని దాని నిర్మాతలు ఫిక్సయినట్లు సమాచారం.

జీ5 సంస్థ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందట. పెట్టుబడి గిట్టే అవకాశం ఎంతమాత్రం లేదు కానీ.. ఉన్నంతలో మంచి రేటే ఇచ్చి ఆ సినిమాను కొందట జీ5. దసరా కానుకగా ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్నట్లు చెబుతున్నారు. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్లు అందించి ‘పలనాటి బ్రహ్మనాయుడు’తో ఫేడవుట్ అయిపోయిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ చిత్రానికి దర్శకుడు. నిజానికి ఆయనకంటే ముందు ఓ తమిళ రచయిత ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. కానీ కొన్ని కారణాలతో అతణ్ని తప్పించి గోపాల్‌కు సినిమా తీసే బాధ్యత అప్పగించారు.

స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార ఇందులో కథానాయికగా నటించింది. మణిశర్మ సంగీతం సమకూర్చాడు. తాండ్ర రమేష్ నిర్మాత. మరి మొదలైన ఐదారేళ్ల తర్వాత వస్తున్న ఈ చిత్రం ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి.