బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత అత్యంత వ్యతిరేకత ఎదుర్కొన్న వ్యక్తుల్లో కరణ్ జోహార్ ఒకడు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడి ఉన్నా, మరో రకంగా చనిపోయి ఉన్నా.. అందుకు కరణ్ జోహార్ పరోక్షంగా బాధ్యుడన్నట్లుగా నెటిజన్లు అతడి మీద విరుచుకుపడిపోయారు. బాలీవుడ్లో స్టార్ కిడ్స్‌ను నెత్తిన పెట్టుకునే కరణ్.. సొంత ప్రతిభతో ఎదిగిన సుశాంత్ లాంటి వాళ్లను చిన్న చూపు చూశాడని.. ఆ రకంగా సుశాంత్ మృతికి కరణ్ పరోక్షంగా కారణమే అని నెటిజన్లు ఆరోపించారు. కరణ్ సినిమాల పట్ల వ్యతిరేకత చూపించడం, అతడి సోషల్ మీడియా అకౌంట్లను అన్ ఫాలో చేయడం.. కరణ్ పేరు మీద హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రోల్ చేయడం.. ఇలా చాలా వ్యవహారమే నడిచింది గత కొన్ని నెలల్లో. దెబ్బకు కరణ్ సోషల్ మీడియా నుంచి దూరంగా వెళ్లిపోయాడు. మౌనాన్ని ఆశ్రయించాడు.
ఐతే కరణ్ మీద విమర్శలు, ఆరోపణలు ఎంతకీ ఆగట్లేదు. తాజాగా డ్రగ్స్ కేసులో అతడి పేరు తెరపైకి వచ్చింది. కరణ్ బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు ఇచ్చిన పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడని.. గత ఏఢాది జులై 28న ఇలాంటి పార్టీ ఒకటి జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. అలాగే కరణ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో భాగమైన అనుభవ్ చోప్రా, క్షితిజ్ ప్రసాద్ అనే వ్యక్తులు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేతికి చిక్కారని.. కరణ్ జోహార్ డొంక కదలబోతోందని కూడా మీడియా రిపోర్ట్ చేసింది. ఐతే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కరణ్.. ఈ ఆరోపణల విషయంలో గట్టిగా రియాక్టయ్యాడు. ఒక ప్రెస్ నోట్ ద్వారా ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించాడు.
పై ఇద్దరు వ్యక్తులకు ధర్మ ప్రొడక్షన్స్‌తో సంబంధమే లేదన్నాడు. వాళ్లిద్దరూ వేర్వేరు కాలాల్లో కొన్ని నెలలు మాత్రమే పని చేశారని.. తర్వాత సంస్థకు దూరమయ్యారని.. వాళ్లు వ్యక్తిగతంగా చేసిన తప్పులకు తన సంస్థతో ఎలా ముడిపెడతారని ప్రశ్నించాడు. తాను ఎప్పుడూ కూడా డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరినీ ఆ దిశగా ప్రోత్సహించలేదని.. అలాగే తాను ఇచ్చిన పార్టీల్లో డ్రగ్స్ సరఫరా అయ్యాయన్నది పూర్తి అవాస్తవమని కరణ్ స్పష్టం చేశాడు. మీడియా దురుద్దేశాలతో తన గురించి పదే పదే వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోందని.. ఇలాగే కొనసాగితే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కరణ్ హెచ్చరించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates