జంటగా పలు చిత్రాల్లో నటించిన ఒక హీరో, హీరోయిన్.. 14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కలిసి తెరపై కనిపించబోతున్నారంటే అది విశేషమే. అందులోనూ ఆ హీరో హీరోయిన్ కొన్నేళ్ల పాటు వెండి తెర మీదే దర్శనం ఇవ్వనంతగా గ్యాప్ తీసుకుని.. మళ్లీ రీఎంట్రీలో జంటగా నటించడం ఇంకా ప్రత్యేకం. సీనియర్ నటులు శివాజీ, లయ ఇలాగే ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు. ఒకప్పుడు మిడ్ రేంజ్ సినిమాల్లో హిట్ పెయిర్‌గా మంచి గుర్తింపే సంపాదించారు శివాజీ, లయ.
తొలిసారిగా ‘మిస్సమ్మ’ సినిమాలో జంటగా నటించి మెప్పించిన వీళ్లిద్దరూ.. ఆ తర్వాత అదిరందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం లాంటి చిత్రాల్లో నటించారు. వీళ్లిద్దరికీ ఆ చిత్రాల్లో చాలా బాగా జంట కుదిరింది. ఐతే తర్వాత లయ పెళ్లి చేసుకుని ఫిలిం కెరీర్‌కు టాటా చెప్పేయగా.. శివాజీకి కూడా క్రమంగా సినిమాలు తగ్గిపోయాయి.
లయ చాలా ఏళ్ల పాటు కెమెరా ముందుకు రాలేదు. ఈ మధ్యే ఆమె మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. శివాజీ కూడా కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని ఈ మధ్యే ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. వీళ్లిద్దరినీ జంటగా పెట్టి ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు సుధీర్ శ్రీరామ్ అనే యువ దర్శకుడు. నైంటీస్ మిడిల్ క్లాస్ తర్వాత శివాజీ ఈటీవీ విన్‌తోనే అసోసియేట్ అయి సాగుతున్నాడు. ఆ సిరీస్ రెండో సీజన్‌తో పాటు మరో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు లయతో చేయబోయే చిత్రం కూడా ఈటీవీ విన్ కోసమేనట. అది థియేటర్లలోకి రాకపోవచ్చు.
ఐతే ఎలాగైతేనేం హిట్ పెయిర్‌గా గుర్తింపు సంపాదించుకున్న శివాజీ-లయలను మళ్లీ జంటగా చూడబోతుండడం ప్రేక్షకులకు ప్రత్యేకమైన విషయమే. లయ అక్క, వదిన పాత్రలతోనూ టాలీవుడ్లో బిజీ అవ్వాలని చూస్తోంది.