ప్రపంచవ్యాప్తంగా కరోనా టైంలో అందరు ఫిలిం మేకర్స్ పని మానేసి, తగ్గించేసి కూర్చుంటే.. రామగోపాల్ వర్మ మాత్రం జెట్ స్పీడుతో పని చేస్తున్నారు. లాక్ డౌన్ టైంలో ఆయన అరడజను సినిమాలు చేయడం విశేషం. వాటి కంటెంట్ ఎంత మాత్రం.. వాటి స్థాయి ఏంటి అన్నది పక్కన పెడితే.. ఇప్పటికే నాలుగు సినిమాలు రిలీజ్ చేసి ఇంకో రెండు విడుదలకు సిద్ధం చేశాడు వర్మ.
అందులో ఒకదాని ట్రైలర్ తాజా రిలీజైంది. ఈ ఏడాది ఆరంభంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ‘దిశ ఎన్‌కౌంటర్’ అని పేరు పెట్టి ఆ దారుణ ఘటన, తదనంతర పరిణామాల మీద సినిమా తీయించాడు వర్మ. ఆయన సమర్పణలో నట్టి క్రాంతి, నట్టి కరుణ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించాడు.
ఐతే రెండున్నర నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే వర్మ అండ్ టీం కొత్తగా ఏం చూపించిందన్నది అర్థం కావడం లేదు. ఈ ఉదంతం జరిగినపుడు పేపర్లలో, వెబ్ సైట్లలో ఏమైతే చదివామో.. ఎలా అయితే విజువలైజ్ చేసుకున్నామో యాజిటీజ్ అదే చూపించినట్లుంది. సామాన్య జనాలకు తెలియని, మీడియా వెల్లడించని తెరవెనుక, కొత్త విషయాలైతే ఏమీ ఈ సినిమాలో కనిపిస్తాయన్న సంకేతాలేమీ ట్రైలర్ ఇవ్వలేదు.
ఈ ఉదంతాన్ని తెరమీద చూపించి జనాల్లో వర్మ అండ్ టీం చైతన్యం తెస్తుందని ఆశించే అవకాశాలు ఎలాగూ లేవు. మరి ఆ సంఘటనల వరుస క్రమాన్ని చూపిస్తూ సినిమా తీయడం వల్ల ఏం ప్రయోజనమో ఏమో? పే పర్ వ్యూ పద్ధతిలో వర్మ మొదట్లో రిలీజ్ చేసిన సినిమాలకు కొంచెం స్పందన వచ్చింది కానీ.. ఆ తర్వాత వాటిని పట్టించుకోవట్లేదు. ఈ వరుసగా మిర్యాలగూడ ప్రణయ్-అమృతల ఉదంతం మీద తీసిన సినిమా పట్ల కూడా ఏమంత ఆసక్తి కనిపించలేదు. లీగల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా విడుదలకు కూడా నోచుకోలేదు. మరి ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమా సంగతి ఏమవుతుందో చూడాలి.