తమిళంలో వంద కోట్లు తెలుగులో సిగపట్లు

Raayan

గత వారం విడుదలైన రాయన్ తమిళ వెర్షన్ ఏడు రోజులు పూర్తి కాకుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి టయర్ 2 హీరోల్లో ధనుష్ కి కొత్త రికార్డు అందించింది. శివ కార్తికేయన్ లాంటి స్టార్ల లైఫ్ టైం కలెక్షన్స్ ని ఈజీగా దాటేసింది. గత కొన్ని వారాలుగా సరైన థియేటర్ సినిమా లేక అరవ ప్రేక్షకులు అల్లాడిపోతున్నారు. ఎగ్జిబిటర్లు కనీస వసూళ్లు లేక అలో లక్ష్మణా అనే పరిస్థితి. అందుకే రాయన్ ఎడారిలో ఒయాసిస్సులా వాళ్ళ పాలిట కల్పతరువుగా మారాడు. కథ ఎంత రొటీన్ గా ఉన్నా సరే ఎమోషన్లు, డ్రామా వాళ్లకు కనెక్ట్ అయ్యే రీతిలో ఉండటంతో జనాలు ఆదరించారు. ఇక్కడే ఓ ట్విస్టు ఉంది.

రాయన్ అక్కడ ఎంత బాగా ఆడినా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ఏమంత ప్రభావం చూపించలేకపోయింది. కేరళలో కలెక్షన్లు బాగున్నాయి. ధనుష్ చూపించిన గ్యాంగ్ స్టర్ డ్రామాని మన పబ్లిక్ కొత్తగా ఫీలవ్వలేదు. రివ్యూలు కూడా యావరేజ్ గా వచ్చాయి. మొదటి వీకెండ్ పోటీ లేకపోవడం వల్ల డీసెంట్ కలెక్షన్లు దక్కినా తర్వాత విపరీతంగా నెమ్మదించేసింది. ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో షేర్లు రావడం ఆగిపోయింది. బ్రేక్ ఈవెన్ లక్ష్యం తక్కువ కావడం వల్ల బయ్యర్లకు ఎక్కువ నష్టాలు రాకపోవచ్చు కానీ ధనుష్ ఆశించిన ఫలితం మాత్రం ఇది కాదు.

వెంకీ అట్లూరి తీసిన సార్ తరహాలో యునానిమస్ గా అన్ని చోట్లా ఆడాలని కోరుకున్నాడు. కానీ జరిగింది వేరు. అయితే సందీప్ కిషన్ మాత్రం బాగా లాభపడ్డాడు. తన పాత్ర, నటనకు మంచి ప్రశంసలు దక్కడమే కాక కోలీవుడ్ నుంచి ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయని లేటెస్ట్ టాక్. గతంలో మాయవన్, మానగరంతో మెప్పించినప్పటికీ అవి తేలేని పేరు రాయన్ మోసుకొచ్చింది. స్వంత రాష్ట్రంలో సోసోగా ఆడినా తమిళంలో బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకోవడంతో సంతోషంగానే ఉన్నాడు. రఘువరన్ బిటెక్, సార్ స్థాయిలో ఆడేంత బలమైన కంటెంట్ లేకపోవడం వల్ల రాయన్ ని మనోళ్లు నో అనేశారు.