ఒకప్పుడు బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయానికి దీటుగా కనిపించేవాడతను. ఒక సినిమాకు వాళ్ల స్థాయిలో పారితోషకం తీసుకోకున్నా.. వాళ్లు ఒక సినిమా చేసే టైంలో నాలుగైదు చిత్రాలు చేయడం ద్వారా వాళ్ల కన్నా ఎక్కువ సంపాదించేవాడు. పైగా తన సినిమాల్లో మంచి క్వాలిటీ ఉండేది. తరచుగా హిట్లు కొట్టేవాడు.
దీంతో ఖాన్ త్రయాన్ని మించిపోతాడనే చర్చ కూడా జరిగింది. అలాంటి హీరో కొన్నేళ్ల నుంచి సోలో హీరోగా ఓ మోస్తరు హిట్ కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు. వరుసగా తన చిత్రాలు 16 ఫ్లాప్ కావడం గమనార్హం. ప్రతి హీరోకూ ఏదో ఒక దశలో రఫ్ ప్యాచ్ ఉంటుంది కానీ.. మరీ వరుసగా ఇన్ని ఫ్లాపులంటే తట్టుకోవడం కష్టం. కానీ అక్షయ్ మాత్రం ఆపకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే తన కొత్త చిత్రం ‘సర్ఫీరా’ కూడా డిజాస్టర్‌గా నిలిచింది.
ఈ నేపథ్యంలో తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా అక్షయ్ వరుస ఫ్లాపుల పట్ల ఒక రకమైన నిర్వేదంతో మాట్లాడాడు. ‘‘ప్రతి సినిమానూ ఇష్టంతోనే చేస్తాం. దాని కోసం ప్రాణం పెడతాం. కానీ ఆ సినిమాలు పరాజయం పాలైనపుడు చూసి గుండె ముక్కలవుతుంది. కానీ ప్రతి సినిమా నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఒక సినిమా ఆడనపుడు ఇంకో సినిమాతో విజయం సాధించాలనే తపన మరింత పెరుగుతుంది. కెరీర్ ఆరంభంలోనే నేనీ విషయం తెలుసుకున్నా. సినిమా ఫ్లాప్ కావడం బాధించవచ్చు. కానీ ఆ బాధ ఆ సినిమా ఫలితాన్ని మార్చలేదు కదా. అది మన చేతుల్లో లేనిది. కష్టపడి పని చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఈ ఆలోచనతోనే నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. మరో సినిమా కోసం పని చేయడం మొదలుపెడతా. కొవిడ్ తర్వాత సినిమా పరిశ్రమ చాలా మారింది. ప్రేక్షకులు కూడా మారారు. వైవిధ్యమైన సినిమాలు చూడ్డానికే ప్రాధాన్యమిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్టులు ఎంచుకోవడం ముఖ్యం’’ అని అక్షయ్ చెప్పాడు.