గేమ్ ఛేంజర్ జోరుకు అమీర్ ఖాన్ బ్రేకులు

మొన్న రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ విడుదల క్రిస్మస్ కు ఉంటుందని ఖరారు చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం ఏ స్థాయిలో ఉందో ఎక్స్ లాంటి సామజిక మాధ్యమాల ద్వారా అర్థమవుతోంది. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీకి మోక్షం ఎప్పుడు దక్కుతుందో తెలియడం కన్నా శుభవార్త ఏముంటుంది. పుష్ప 2 డిసెంబర్ 6 లాక్ చేసుకుంది కాబట్టి చరణ్ కు డిసెంబర్ 20 మంచి డేట్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆ తేదీ అయితే తనకేం ఇబ్బంది లేదని దర్శకుడు శంకర్ చెప్పేశారట. ఇక్కడిదాకా బాగానే ఉంది.

అయితే అదే వారంలో అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ విడుదలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ టాక్. లాల్ సింగ్ చద్దా ఎంత డిజాస్టర్ అయినా నిర్మాణంలో ఉన్న అమీర్ సినిమాల మీద దాని ప్రభావం తీవ్రంగా లేదు. పైగా తారే జమీన్ పర్ లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా ప్రచారం జరుగుతున్న సితారే జమీన్ పర్ మీద ఉత్తరాది జనాల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పుడీ టీమ్ కూడా డిసెంబర్ 20 ఆప్షన్ ని సీరియస్ గా చూస్తోందట. అదే జరిగితే నార్త్ మార్కెట్ లో గేమ్ ఛేంజర్ కు థియేటర్ల పరంగా ఇబ్బందులు తప్పవు. పైగా ఓపెనింగ్స్ కూడా ప్రభావితం చెందుతాయి.

అసలే అదే రోజు బాలీవుడ్ మూవీ ముఫాసా లయన్ కింగ్ ఓవర్సీస్ కలెక్షన్లను దెబ్బ కొడుతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న టైంలో ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా వస్తానంటే యుఎస్ రికార్డుల్లో ఖచ్చితంగా కోత పడుతుంది. పైగా ఇండియన్ 2 పుణ్యమాని శంకర్ బ్రాండ్ రిస్క్ లో పడింది.

చరణ్ పేరు మీదే ఎక్కువ మార్కెటింగ్ చేయాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్టు వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన తేరి రీమేక్ బేబీ జాన్ సైతం డిసెంబర్ 25 వస్తుంది. దీని ప్రకారం బయట మార్కెట్లలో తనకు ఎదురు కాబోతున్న సవాళ్ళను గేమ్ ఛేంజర్ ఎలా ఎదురుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.