ఆ నటి పెళ్లి రెండు వారాలకే పెటాకులు

చేసిన సినిమాలు చాలా తక్కువే కానీ.. పూనమ్ పాండే పాపులారిటీ మాత్రం తక్కువేమీ కాదు. నిజానికి చెప్పాలంటే ఆమె సినిమాలు చాలా నామమాత్రంగానే చేసింది. అంతకంటే ముందే ఆమె సోషల్ మీడియా ఊపు పెరుగుతున్న సమయంలో తన సెక్సీ ఫొటోలు, వీడియోలతో కుర్రకారును ఆకర్షించడం మొదలుపెట్టింది. మంచి పాపులారిటీ తెచ్చుకున్నాక తన గ్లామర్‌ను ఎలివేట్ చేసే సినిమాలు కొన్ని చేసింది. వాటి కథ ముగిశాక ఒక వెబ్ సైట్ పెట్టుకుని అందులో కుర్రాళ్లను రెచ్చగొట్టే ఫొటోలు, వీడియోలు పెట్టి డబ్బు సంపాదించే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆమెకు సామ్ బాంబే అనే వ్యక్తితో పరిచయం కావడం, అతడితో కలిసి కొన్ని వీడియోలు చేయడం జరిగింది. కొంత కాలానికి అతణ్ని తన బాయ్ ఫ్రెండ్‌గా పరిచయం చేసిన పూనమ్.. రెండు వారాల కిందట అతణ్ని పెళ్లి కూడా చేసుకుంది.

ఇద్దరూ కలిసి గోవాకు హనీమూన్‌కు కూడా వెళ్లారు. కట్ చేస్తే పెళ్లయిన 12వ రోజుకే తన భర్త తనను చంపేయబోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇద్దరి మధ్య ఒక విషయంలో వాదన జరిగి.. అది కొంచెం పెద్దదై తనను సామ్ హింసించాడని.. తనను చంపేస్తాడేమో అని భయం కలిగిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గోవా పోలీసులు సామ్‌ను అరెస్ట్ చేశారు. అతను వెంటనే బెయిల్ మీద బయటికి వచ్చాడు కూడా. ఐతే ఇద్దరూ సెటిల్ చేసుకుని మళ్లీ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తారేమో అనుకుంటే.. ఇక మళ్లీ అతడితో కలిసి బతికేదే లేదని అంటోంది పూనమ్. తనను అంతగా హింసించిన వ్యక్తిని మళ్లీ తాను నమ్మలేనని అంటోంది. ప్రేమ గుడ్డిది అన్న మాట తన విషయంలోనూ నిజమని రుజువైందని.. తాను సామ్ చేతుల్లో చనిపోవాలనుకోవట్లేదని.. అతడితో వైవాహిక బంధాన్ని రద్దు చేసుకుంటున్నానని.. తమ రిలేషన్ ముగిసిందని ఓ మీడియా సంస్తతో స్పష్టం చేసింది పూనమ్. ఆమె వ్యవహారం తెలిసిన వాళ్లు ఈ పెళ్లి ఎంతో కాలం నిలబడదని ముందే కామెంట్ చేశారు. కానీ రెండు వారాలకే ఇలా పూనమ్ పెళ్లి పెటాకులు అవుతుందని ఎవరూ ఊహించలేదు.