కృష్ణవంశీ.. అప్పుడు గోల్డెన్ ఛాన్స్ వదిలేసి

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న లెజెండరీ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. తొలి సినిమా ‘గులాబి’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ క్రియేటివ్ డైరెక్టర్.. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, సింధూరం, ఖడ్గం, మురారి, చందమామ లాంటి క్లాసిక్స్ అందించాడు. కానీ చాలామంది దిగ్గజ దర్శకుల్లాగే ఒక దశ తర్వాత ఆయన కూడా రేసులో వెనుకబడిపోయారు. ఒకే రకం సినిమాలు తీసి విసిగించేశారు.

ఐతే కృష్ణవంశీ కెరీర్ ఏమాత్రం బాగా లేని సమయంలో రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది. అప్పుడాయన ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘గోవిందుడు అందరి వాడేలే’ అంచనాలను అందుకోలేకపోయింది. అది కృష్ణవంశీ స్థాయికి ఏమాత్రం తగని సినిమా అనడంలో సందేహం లేదు.

స్లంప్‌లో ఉన్న కృష్ణవంశీకి చరణ్ లాంటి టాప్ స్టార్ ఛాన్స్ ఇస్తే ఉపయోగించుకోలేకపోయాడని మెగా అభిమానులు ఫీలయ్యారు. ఆ సినిమా తర్వాత కృష్ణవంశీ కెరీర్ మరింత డౌన్ అయింది. తర్వాత ఆయన్నుంచి వచ్చిన నక్షత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ‘రంగ మార్తాండ’ కూడా మ్యాజిక్ చేయలేకపోయింది. ఇప్పుడు చేతిలో సినిమా లేక ఇబ్బంది పడుతున్నాడు కృష్ణవంశీ.

ఐతే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న కృష్ణవంశీకి.. ఒక మెగా అభిమాని ఓ రిక్వెస్ట్ చేశాడు. రామ్ చరణ్‌తో ఒక మెమొరబుల్ మూవీ తీయమని అడిగాడు. అందుకు కృష్ణవంశీ బదులిస్తూ తన దగ్గరో సూపర్ ఐడియా ఉందని, స్క్రిప్టు కూడా రెడీగా ఉందని.. చరణ్ టైం ఇవ్వడమే ఆలస్యం సినిమా చేస్తానని అన్నాడు. కానీ ఇంతకుముందు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ను కృష్ణవంశీ వృథా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్ వచ్చి సినిమా చేయడమంటే చాలా కష్టమనే చెప్పాలి. ఈ కాంబినేషన్ ఓకే అయితే మెగా అభిమానులే సానుకూలంగా స్పందించకపోవచ్చు.