దసరాను మిస్ చేసుకుంటున్న టాలీవుడ్

సినిమాల పరంగా బాక్సాఫీసుకు సంక్రాంతి తర్వాత అతి కీలకమైన సీజన్ దసరానే. సెలవులు ఎక్కువ ఉండేది అప్పుడే. దీపావళికి కూడా ప్రాధాన్యం ఉంటుంది కానీ ఒక్క రోజు హాలిడే వల్ల ప్యాన్ ఇండియా మూవీస్ అంతగా ఆసక్తి చూపించవు. ఈసారి విజయదశమి టాలీవుడ్ చెయ్యి జారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అక్టోబర్ 10 చాలా మంచి డేట్. సుదీర్ఘమైన వీకెండ్ తో బాగా కలిసి వస్తుంది. పైగా పిల్లా పీచు అందరూ ఇళ్లలో ఉంటారు కాబట్టి థియేటర్ వినోదానికి భారీ డిమాండ్ ఉంటుంది. గత ఏడాది భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు ఈ కారణంగానే లాభ పడ్డాయి.

కానీ ఈసారి చూస్తుంటే మొత్తం డబ్బింగ్ చిత్రాలు ఆక్రమించుకునేలా ఉన్నాయి. సూర్య కంగువ ఆల్రెడీ అధికారిక ప్రకటన ఇచ్చేసింది. ఎలాంటి మార్పు ఉండదని నిర్మాత నొక్కి చెబుతున్నారు. ప్రమోషన్ల కోసం ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారు. మనకు కల్కి 2898 ఏడి ఎలాగో వాళ్లకూ అది వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందనే నమ్మకాన్ని చెన్నై మీడియా వ్యక్తం చేస్తోంది. అదే రోజు రజనీకాంత్ వెట్టయాన్ రావడం దాదాపు ఖరారే. క్లాష్ అయిన పర్వాలేదు ఫెస్టివల్ ని వదులుకునే సమస్యే లేదని లైకా సంస్థ ఫిక్స్ అయిపోయిందట. దీపావళికి అజిత్ విదయమయార్చిని వదిలే ఆలోచనలో ఉన్నారు.

తెలుగు వైపు నుంచి మాత్రం ఇప్పటిదాకా ఏ పెద్ద సినిమా అక్టోబర్ 10 లాక్ చేసుకోలేదు. ముందు దేవర ఉండేది కానీ అది సెప్టెంబర్ 27కి వెళ్లిపోవడంతో ఈ స్లాట్ ని తమిళ అనువాదాలకు వదిలేయక తప్పేలా లేదు. కంగువకు యువి బ్యాక్ అప్ ఉండగా, వెట్టయాన్ కు సురేష్ ఆసియన్ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ కు తోడ్పడవచ్చు. రెండు సినిమాలకు థియేటర్ కౌంట్ బాగుంటుంది. అప్పటికే దేవర రెండు వారాల రన్ పూర్తయిపోయి ఉంటుంది కాబట్టి వీటికి అదనంగా స్క్రీన్లు రాబట్టుకోవచ్చు. ఆగస్ట్, సెప్టెంబర్ మీదే ఎక్కువ శాతం ఫోకస్ పెట్టిన తెలుగు నిర్మాతలు కీలకమైన దసరా మీద సీరియస్ దృష్టి పెట్టడం అవసరం.