సుషాంతే నన్ను వాడుకున్నాడు: రియా

సుషాంత్‍ సింగ్‍ రాజ్‍పుట్‍ మరణం తర్వాత అతడి కుటుంబం గురించి రియా చక్రవర్తి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కానీ ఎప్పుడూ చనిపోయిన తన ప్రియుడిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే డ్రగ్స్ క్రయించిన కేసులో తనతో పాటు తన సోదరుడు కూడా అరెస్ట్ అయి బెయిల్‍ కూడా దొరకకుండా ఇబ్బందులు పడుతోన్న దశలో రియా దివంగత నటుడు సుషాంత్‍ సింగ్‍ రాజ్‍పుట్‍పై సంచలన వ్యాఖ్యలు తన బెయిల్‍ పిటీషన్‍లో చేసింది.

సుషాంత్‍ డ్రగ్స్ కి బానిసగా మారి తరచుగా వాటిని వినియోగించేవాడని, అయితే ఎప్పుడూ తన పేరు బయటకు రాకుండా వేరే వాళ్లతో కొనిపించేవాడని, తనయినా, తన సోదరుడయినా అతడి కోసమే డ్రగ్స్ కొన్నాం తప్ప తామెప్పుడూ వాటిని వాడలేదని, అతను ‘కేదార్‍నాధ్‍’ షూటింగ్‍ చేసిన సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడని, కాకపోతే తనంతట తానుగా కొనకుండా, ఒకవేళ పోలీసులు కనుగొనాలని చూసినా కనీసం తన పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడని ఆమె ఆరోపించింది. తన అలవాటు కోసం సుషాంతే తనను, తన తమ్ముడిని వాడుకున్నాడని ఆమె బెయిల్‍ పిటీషన్‍లో పేర్కొంది.

అలాగే డ్రగ్స్ వాడిన వ్యక్తికి కేవలం ఒక ఏడాది మాత్రమే జైలు శిక్ష పడుతుంది కానీ కొన్న వాళ్లకు ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం వుండడం చట్టంలో వున్న లొసుగులను తెలియజేస్తోందని ఆమె పిటీషన్‍లో పేర్కొనడం గమనార్హం. తనను తాను డిఫెండ్‍ చేసుకోవడానికి చనిపోయి, కనీసం ఇది అవాస్తవమని వాదించుకునే అవకాశం లేని వ్యక్తిని దోషిగా చూపించడంలోనే తన క్యారెక్టర్‍ తెలుస్తోందని సుషాంత్‍ అభిమానులు రియాపై దుమ్మెత్తి పోస్తున్నారు.