ఎడిటింగ్‍ అదరగొట్టేస్తున్నారు బాస్‍

ఒక సినిమాకి ట్రెయిలర్‍ కట్‍ చేయడం ఎంత కీలకమనేది చాలాసార్లు రుజువయింది. ఒక మంచి సినిమాకి కూడా ట్రెయిలర్‍ కట్‍ బాగోకపోతే హైప్‍ రాదు. అదే ఒక చెత్త సినిమాకి కూడా ట్రెయిలర్‍ బాగా ఎడిట్‍ చేసి ఓపెనింగ్స్ రాబట్టవచ్చు. వంద రోజుల పాటు షూట్‍ చేసే సినిమాకే ప్రోమో కట్‍ చేయడం అంత కష్టమంటే… బిగ్‍బాస్‍ లాంటి డెయిలీ షోకి ప్రతి ప్రోమోతో ఆకట్టుకోవడం ఇంకెంత కష్టమో ఊహించండి.

ఐపీఎల్‍ స్టార్ట్ అయిపోయి యంగ్‍ ఆడియన్స్ అటు డైవర్ట్ అయిపోయిన టైమ్‍లో బిగ్‍బాస్‍ షోకి వున్న టీఆర్పీలు కాపాడుకోవడానికి ఎడిటర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. షోలో ఏమి జరిగినా జరగకపోయినా కానీ ఏమి జరిగిందో చూడాలనే కుతూహలాన్ని వాళ్లు కలిగిస్తున్నారు. సరిగ్గా ఐపీఎల్‍ మొదలయ్యే టైమ్‍కి బిగ్‍బాస్‍ హౌస్‍లో వాతావరణం వేడెక్కేలా చూసుకున్నారు. లోపల వున్న వాళ్లు గేమ్‍ సీరియస్‍గా తీసుకునేలా నాగార్జునతో బ్రెయిన్‍ వాష్‍ చేయించారు. దీంతో ఎలిమినేట్‍ కాకూడదనే లక్ష్యంతో అందరూ గట్టిగా గేమ్‍ ఆడుతున్నారు.

కొందరు స్మార్ట్ గేమ్‍ ఆడుతోంటే, ఇంకొందరు కెమెరాల కోసం (అంటే ఎలాగయినా ఆడియన్స్ దృష్టిలో పడడం కోసం) ఆడుతున్నారు. ఏదయితేనేమి ప్రోమో కట్‍కి కావాల్సిన కంటెంట్‍ అయితే దొరుకుతోంది. దీంతో ఎడిటర్స్, సౌండ్‍ ఎఫెక్ట్స్ టీమ్‍ కలిసి షో టీఆర్పీలు డ్రాప్‍ అవకుండా చూసుకునే వీలు చిక్కుతోంది. అయితే ఇంకా ఇరవై రోజులు కూడా గడవలేదు కనుక మరో ఎనభై రోజుల పాటు ఇదే టెంపో మెయింటైన్‍ చేయడం మాత్రం అంత తేలికేం కాదు సుమీ.