ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఉంటే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పరిస్థితి ఘోరంగా ఉండేదేమో. ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన అశ్వినీదత్.. జగన్‌కు బద్ధ వ్యతిరేకి అన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముంగిట కూటమికి ఆయన పూర్తి మద్దతు తెలిపారు. జగన్ మీద విమర్శలు చేయడానికి కూడా వెనుకాడలేదు. కాబట్టి జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ‘కల్కి’ టార్గెట్ అయ్యేదే. ఆ చిత్రానికి అదనపు రేట్లు కూడా దక్కేవి కావు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కోరుకున్న స్థాయిలో కొంచెం హెచ్చు స్థాయిలోనే అదనపు రేట్లిచ్చారు. గరిష్టంగా రూ.125 మేర రేట్లు పెంచుకున్నారు. కానీ ఆల్రెడీ ఏపీలో టికెట్ల ధరలు పెంచగా.. అదనంగా ఈ స్థాయిలో రేట్లు పెంచడం ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. దీనిపై ఎవరో కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
దీంతో ఆ వ్యవహారం తేలే వరకు కొత్త చిత్రాలకు ఎక్స్‌ట్రా రేట్లు ఇవ్వడం కష్టంగా మారింది. తెలుగులో ఇప్పుడిప్పుడే రేట్లు పెంచుకోవాల్సిన స్థాయి ఉన్న పెద్ద సినిమాలేవీ వచ్చేలా లేవు. ‘దేవర’ వచ్చే వరకు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఐతే ఈ వారం విడుదల కాబోతున్న అనువాద చిత్రం ‘ఇండియన్-2’కు మాత్రం ఇది సమస్యగా మారింది.
ఈ చిత్రానికి తెలంగాణలో రేట్లు పెంచుకునే అవకాశం లభించింది. తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు ఏపీలో కూడా అదనపు రేట్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. సురేష్ బాబుకు ఒకప్పుడు టీడీపీతో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ మధ్యలో జగన్ నుంచి స్టూడియో విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాక తటస్థంగా మారిపోయారు. అది పెద్ద ఇబ్బందేమీ కాదు కానీ.. కోర్టు వ్యవహారం వల్ల ఏపీ ప్రభుత్వం ఈ కేసు తేలే వరకు ఏ సినిమాకూ అదనపు రేట్లు ఇవ్వొద్దనుకుంది. దీంతో ఏపీలో నార్మల్ రేట్లతోనే ‘ఇండియన్-2’ రిలీజవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates