సూప‌ర్ స్టార్ సినిమా.. బుక్ మై షో ఖాళీ

అక్ష‌య్ కుమార్ అంటే బాలీవుడ్ సూప‌ర్ స్టార్ల‌లో ఒక‌డు. ఆయ‌న సినిమాలు ఒక‌ప్పుడు వంద‌ల కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టేవి. కానీ కొన్నేళ్లుగా అక్ష‌య్ స్టార్ డ‌మ్ క‌రిగిపోతూ వ‌స్తోంది. త‌న సినిమాల‌కు ఓపెనింగ్స్ ఉండ‌ట్లేదు. అక్ష‌య్ న‌టించిన‌ కొన్ని మంచి సినిమాలు సైతం వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక డిజాస్ట‌ర్లు అయ్యాయి. గ‌త కొన్నేళ్ల‌లో ఆయ‌న చూసిన హిట్ అంటే.. అతిథి పాత్ర చేసిన ఓఎంజీ-2 మాత్ర‌మే. చివ‌ర‌గా అక్ష‌య్ నుంచి వ‌చ్చిన బ‌డేమియా చోటేమియా బాలీవుడ్ చ‌రిత్ర‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

ఇప్పుడు అక్ష‌య్ నుంచి సఫీరా అనే సినిమా ఒక‌టి రాబోతోంది. పాపం ఇంత‌కుముందు అక్ష‌య్ సినిమాలు రిలీజ‌వుతుంటే.. ఆ సంగ‌తైనా జ‌నాల‌కు తెలిసేది. కానీ స‌ఫీరా విష‌యంలో ఆ ముచ్చ‌ట కూడా లేదు. క‌నీసం ఈ సినిమా రిలీజ‌వుతున్న సంగ‌తి కూడా జ‌నాల‌కు తెలియ‌ని ప‌రిస్థితి.

ట్రాక్ రికార్డు దారుణంగా దెబ్బ తినేయ‌డం, స‌ఫీరాకు అస‌లే బ‌జ్ లేక‌పోవ‌డంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. శుక్ర‌వారం ఈ చిత్రం రిలీజ‌వుతుంటే.. ముంబ‌యి, ఢిల్లీ లాంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో కూడా మినిమం ఆక్యుపెన్సీలు లేవు. మార్నింగ్ షోల నుంచి నైట్ షోల వ‌ర‌కు అన్నీ ఖాళీనే. 10-20 శాతం టికెట్లు కూడా తెగ‌ని ప‌రిస్థితి.

స‌ఫీరా సినిమా మొద‌లైన‌పుడే ఇది అక్ష‌య్ చేయాల్సిన సినిమా కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇది సూర్య న‌టించిన ఆకాశం నీ హ‌ద్దురాకు రీమేక్. ఆ మూవీ క‌రోనా టైంలో ఓటీటీలో రిలీజైంది అద్భుత స్పంద‌న తెచ్చుకుంది. దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఈ సినిమా చూశారు. హిందీ ఆడియ‌న్స్‌కు కూడా ఆ చిత్రం చేరువైంది. అలాంటి సినిమాను రీమేక్ చేయ‌డం వ‌ల్ల ఏ ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మైనా అక్ష‌య్ ప‌ట్టించుకోలేదు. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు. ఒరిజిన‌ల్ తీసిన సుధ కొంగ‌ర‌నే ఈ చిత్రాన్ని రూపొందించింది.