తలా అని అభిమానులు పిలుచుకునే అజిత్ కు తెలుగులోనూ ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉండేది. వాలి, ప్రేమలేఖ లాంటివి కమర్షియల్ గా టాలీవుడ్ లో మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. కానీ ఆ తర్వాత అజిత్ నిర్మాతలు ఇక్కడ ఫోకస్ పెట్టకపోవడంతో ఆయన డబ్బింగ్ సినిమాలు క్రమంగా తగ్గిపోవడం మొదలైంది. విశ్వాసం, వివేకం లాంటివి తమిళంలో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా ఇక్కడ మాత్రం యావరేజ్ అయ్యాయి. వలిమై, తెగింపు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. విజయ్ లాగా అజిత్ సరైన సమయంలో మన ఆడియన్స్ పల్స్ పట్టుకోలేదు.
ఇప్పుడిది అజిత్ కొత్త సినిమా విదాముయార్చి మీద ప్రభావం చూపిస్తోందని ట్రేడ్ న్యూస్. దసరా లేదా దీపావళికి విడుదల చేసే ఉద్దేశంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తోంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో అజిత్ కారు స్టంట్స్ చేస్తూ నిజంగానే ప్రమాదానికి గురి కావడం కొన్ని నెలల క్రితం సంచలనం రేపింది. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న విదాముయార్చికి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల నుంచి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదట. అందుకే బిజినెస్ క్లోజ్ చేయలేకపోతున్నారని అంతర్గత సమాచారం.
ఇదే లైకా నిర్మిస్తున్న భారతీయుడు 2 ఫలితం చూశాక అప్పుడు విదాముయార్చి ధరను నిర్ణయించాలని ఇక్కడి పంపిణీదారులు భావిస్తున్నారు. లాల్ సలామ్ కు సంబంధించిన సెటిల్మెంట్స్ కూడా ఇంకా పూర్తవ్వలేదట. ఇదిలా ఉంచితే అక్టోబర్ 10న సూర్య కంగువాతో తలపడాలని అజిత్ నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు వచ్చిన వార్త కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ఎందుకంటే అజిత్ ఇమేజ్ ఎంత ఉన్నా కంగువతో పోటీ పడేంత ప్యాన్ ఇండియా కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్ విదాముయార్చిలో లేవు. అలాంటప్పుడు రిస్క్ చేస్తే ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు.