రాజ్ తరుణ్‌పై కేసు.. ఆమెకు నోటీసులు

టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తాజాగా అనుకోని వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

13 ఏళ్లుగా తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని.. కానీ ఇటీవల రాజ్ తనకు దూరమయ్యాడని… తాము ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇంటికి రావడం మానేశాడని.. తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని.. అలాగే తనను ఉద్దేశపూర్వంగా డ్రగ్స్ కేసులో ఇరికించాడని.. తనను చంపేస్తానని బెదిరింపులు చేయిస్తున్నాడని.. ఇలా రకరకాల ఆరోపణలు చేసిందామె. ఐతే లావణ్య ఫిర్యాదు చేసినపుడు మీడియాతో కూడా ఏమీ స్పందించని పోలీసులు.. ఇప్పుడు లావణ్యకే నోటీసులు పంపడం గమనార్హం.

ఈ కేసును ప్రొసిజర్ ప్రకారం విచారించాలని నిర్ణయించుకున్న పోలీసులు.. రాజ్ తరుణ్ మీద చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. 91 సీఆర్పీసీ కింద పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఆధారాలను బట్టి తదుపరి చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.

ఐతే రాజ్ తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడనడానికి ఆధారాలు ఉన్నాయని లావణ్య చెబుతుండగా.. ఆమె మీద కూడా రాజ్ పలు ఆరోపణలు చేశాడు. ఆమె డ్రగ్స్ తీసుకుని తననే టార్చర్ చేసిందని.. ఆమెకు వేరే వ్యక్తితో కూడా సంబంధం ఉందని.. తనపై బ్లాక్‌మెయిలింగ్ కేసు ఉందని.. ఇలా ఎన్నో ఆరోపణలు చేశాడు. అతను కూడా అన్నింటికీ ఆధారాలు ఉన్నాయని అంటున్నాడు. తాను కూడా లావణ్య మీద కేసు పెడతానంటున్నాడు. మరి ఈ పోరులో చివరికి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.