కృష్ణుడికి గొంతిచ్చిన దాసుడి ఉద్వేగం

కల్కి 2898 ఏడిలో మొహం కనిపించకపోయినా ఆడియన్స్ ని విపరీతమైన ఉద్వేగానికి గురి చేసిన పాత్రల్లో శ్రీకృష్ణుడు ప్రధానమైంది. శరీరం చూపించినప్పటికీ వదనం లేకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ దాన్ని ఒకరకమైన ట్రాన్స్ లో తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎంతగా అంటే ఎవరికి వారు నాని, మహేష్ బాబు అయితే బాగుంటుందనే ఊహతో తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకునేంతగా. కృష్ణుడుకి డబ్బింగ్ చెప్పింది నటుడు అర్జున్ దాస్. ఇవాళ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన ఉద్వేగాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

అర్జున్ దాస్ టాలీవుడ్ కు సుపరిచితుడే. బుట్టబొమ్మలో సెకండ్ హీరోగా నటించడంతో పాటు డబ్బింగ్ సినిమాల ద్వారా మనకూ పరిచయమే. ముఖ్యంగా ఇతని గొంతుకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఓజి టీజర్ కు వాయిస్ ఓవర్ చెప్పడంతోనే భారీ గుర్తింపు వచ్చింది. అందులో క్యారెక్టర్ కూడా చేశాడు. కల్కి అనుభవం గురించి చెబుతూ అమితాబ్ బచ్చన్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుడికి డబ్బింగ్ చెప్పాలని స్వప్న దత్ ఫోన్ చేసినప్పుడు టెన్షన్ పడ్డానని, హైదరాబాద్ వచ్చాక నాగ్ అశ్విన్ దగ్గరుండి తన భయాన్ని పోగొట్టి చెప్పించిన తీరు జీవితంలో మర్చిపోనని పేర్కొన్నాడు.

చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమితాబ్ బచ్చన్ ని చూస్తూ ఆయనను ఉద్దేశించి డైలాగులు చెప్పడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సుదీర్ఘమైన మెసేజ్ లో పేర్కొన్నాడు. ఎవరైనా జీవితంలో నువ్వేం సాధించావని అడిగితే బిగ్ బితో కల్కిలో మాట్లాడానని చెబుతానని అన్నాడు. సమయం తక్కువగా ఉండటం వల్ల తెలుగు, హిందీ వెర్షన్లకు మాత్రమే గాత్రం ఇవ్వగలిగానని పేర్కొన్నాడు. తన స్పెషలిటీనే అర్జున్ దాస్ కు ఇలాంటి ఆఫర్లు తెచ్చి పెడుతోంది. ఒకప్పుడు సాయికుమార్, జగ్గయ్య లాంటి అతి కొందరు ఆర్టిస్టులకే డబ్బింగ్ పరంగా అభిమానులు ఉండేవారు. అర్జున్ దాస్ కూడా వాళ్ళ దారిలోనే వెళ్తున్నాడు.