యాస్కిన్ మీద సోలో మూవీ సాధ్యమేనా

కల్కి 2898 ఒక భాగం కాదనే సంగతి అటు సినిమాలో, ఇటు నిర్మాత అశ్వినిదత్ ఇంటర్వ్యూలో స్పష్టంగా అర్థమైపోయింది. అయితే సెకండ్ పార్ట్ తర్వాత కమల్ హాసన్ పోషించిన యాస్కిన్ పాత్ర మీద విడిగా ఒక మూవీ ఉంటుందని, దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు చర్చిస్తున్నామని ఆయన చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. నిజానికి ఫస్ట్ పార్ట్ లో కమల్ కనిపించింది కేవలం తొమ్మిది నిమిషాలే. డైలాగులు కూడా చాలా తక్కువ. భారతీయుడు 2 ప్రమోషన్లలో మాట్లాడుతూ తన అసలైన క్యారెక్టర్, విశ్వరూపం తర్వాత చూస్తారని చెప్పడం ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

ఇది పక్కనపెడితే కేవలం యాస్కిన్ మీద ఒక సోలో మూవీ ఎంతమేరకు వర్కౌట్ అవుతుందనేది చెప్పడం కష్టమే. ఎందుకంటే అది పూర్తిగా నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. ఆయనే హీరోగా, విలన్ గా గతంలో ఇలాంటి టైపులో అభయ్ చేశారు కానీ అది దారుణంగా ఫ్లాప్ అయ్యింది. కానీ కల్కి కేసు వేరు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ల పవర్ కు కమల్ స్టామినా తోడై ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చింది. ఇదే ఎగ్జైట్ మెంట్ తెరమీద కేవలం లోక నాయకుడు మాత్రమే ఉంటే వస్తుందని చెప్పలేం. తమిళనాడులో ఏమో కానీ తెలుగులో ప్రభాస్ లేకుండా కమల్ ని మాత్రమే రిసీవ్ చేసుకోవడం అనుమానమే.

ఇదంతా ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది కాబట్టి తేలడానికి టైం పడుతుంది. ఇప్పటికైతే మొత్తం స్టార్ క్యాస్టింగ్ కనిపించేది కల్కి రెండు భాగాల్లో మాత్రమే. యాస్కిన్ తో మూడో భాగం తీసేది లేనిది దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సినిమాటిక్ యునివర్స్ అన్నాడు కాబట్టి ఇదంతా ఒకటి రెండు సంవత్సరాల్లో ముగిసే సిరీస్ లా కనిపించడం లేదు. వెయ్యి కోట్ల స్టామినా ఉన్న ప్రాజెక్టుగా ఋజువయ్యింది కనక ఎన్ని భాగాలుగా తీస్తారనేది వేచి చూడాలి. లెన్త్ పరంగా కమల్ అభిమానులు కల్కి 2898 ఏడిలో పూర్తి సంతృప్తి చెందలేదు. వాళ్ళ ఆకలి తీరేది సీక్వెల్ లోనే.