ప్ర‌పంచ సినిమా ఔట్‌.. చైనా సినిమా హిట్‌

గ‌త‌ ఆరు నెల‌ల్లో చైనాను తిట్టుకోని దేశం ఉండ‌దు. ప్ర‌పంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్న క‌రోనా వైర‌స్‌కు జ‌న్మ స్థానం ఆ దేశ‌మే అన్న సంగ‌తి తెలిసిందే. ఆ వైర‌స్‌ను చైనానే అభివృద్ధి చేసి బ‌యో వార్‌లో భాగంగా ప్ర‌పంచం మీదికి వ‌దిలింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇదెంత వ‌ర‌కు నిజం అన్న‌ది ప‌క్క‌న పెడితే.. చైనా నుంచి వ‌చ్చిన ఈ వైర‌స్ వ‌ల్ల ఎన్నో దేశాలు అల్లాడిపోయాయి. ఆయా దేశాల్లో అన్ని వ్యాపారాలూ దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా సినీ రంగానికి ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌త ఆరు నెల‌లుగా చాలా చోట్ల థియేట‌ర్లు మూత‌ప‌డి ఉన్నాయి. కొన్ని చోట్ల గ‌త నెలా రెండు నెల‌ల్లో థియేట‌ర్లు తెరుచుకున్నా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడ‌ట్లేదు.

భారీ అంచ‌నాలు నెల‌కొన్న‌ క్రిస్టోఫ‌ర్ నోల‌న్ సినిమా టెనెట్‌ను ధైర్యం చేసి గ‌త నెల‌లో రిలీజ్ చేస్తే.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశాజ‌న‌క ఫ‌లితం అందుకుంది. నోల‌న్ సినిమా అంటే అల‌వోకగా 500 మిలియ‌న్ డాల‌ర్లు రావాల్సింది. కానీ 250 మిలియ‌న్ల‌తో బ్రేక్ ఈవెన్ మార్కును కూడా ఈ సినిమా అందుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది. మిగ‌తా సినిమాల గురించి చెప్పుకోవ‌డానికేమీ లేదు. ఇలా ప్ర‌పంచ సినిమాను ప‌రోక్షంగా నాశ‌నం చేసిన చైనా.. ఈ క‌రోనా టైంలో త‌న సినిమాను ప్ర‌పంచంలోనే అగ్ర స్థానంలో నిలుపుకుంది. గ‌త నెల 21న విడుద‌లైన చైనీస్ మూవీ ది ఎయిట్ హండ్రెట్.. చైనాలో భారీ విజ‌యాన్నందుకుంది. వేరే దేశాల్లో కూడా కొన్ని చోట్ల విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టిదాకా మొత్తం 427 మిలియ‌న్ డాల‌ర్లు కొల్ల‌గొట్టి 2020 సంవ‌త్స‌రానికి వ‌ర‌ల్డ్ హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఆ చిత్రం ఈ ఏడాది ఆరంభంలో వ‌చ్చిన హాలీవుడ్ మూవీ 424 మిలియ‌న్ డాల‌ర్ల‌తో నెల‌కొల్పిన రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్ అస‌లు సినిమాల రిలీజే లేకుండా చేసిన చైనా.. ఇప్పుడు హ్యాపీగా సినీ వినోదంలో మునిగితేలుతుండ‌టం ప్ర‌పంచ దేశాల‌కు మంట పుట్టిస్తోంది.