ఆ హీరో చుట్టూ ఎన్ని వివాదాలో..

ఒక స్టార్ హీరో త‌న అభిమానిని హ‌త్య చేసిన కేసులో చిక్కుకున్న విచిత్ర ఉదంతం ఇప్పుడు క‌న్న‌డ నాట సంచ‌ల‌నం రేపుతోంది. క‌న్న‌డ టాప్ స్టార్ల‌లో ఒక‌డైన ద‌ర్శ‌న్.. త‌న అభిమానే అయిన రేణుక స్వామి హ‌త్య కేసులో ఎ-2గా అభియోగాలు ఎదుర్కొంటూ పోలీస్ క‌స్ట‌డీలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ద‌ర్శ‌న్ త‌న భార్య విజ‌య‌లక్ష్మికి దూరంగా ఉంటూ.. ప‌విత్ర గౌడ అనే న‌టితో చాలా ఏళ్ల నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌డం న‌చ్చ‌ని రేణుక స్వామి అనే ద‌ర్శ‌న్ అభిమాని.. ప‌విత్ర‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా దూషించ‌డం, ఆమెకు అస‌భ్య సందేశాలు పంప‌డంతో అత‌ణ్ని ల‌క్ష్యంగా చేసుకున్న ద‌ర్శ‌న్ అండ్ కో త‌న‌ను చిత్ర హింస‌లు పెట్టి ఏకంగా హ‌త్యే చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. రేణుక‌స్వామికి క‌రెంట్ షాక్ ఇవ్వ‌డంతో పాటు శాకాహారి అయిన అత‌డికి నాన్ వెజ్ తినిపించి మ‌రీ హింసించిన‌ట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో వెల్ల‌డైంది.

ఈ హ‌త్యోదంతంతో ద‌ర్శ‌న్‌లోని నెగెటివ్ కోణం బాగా హైలైట్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌న్‌కు సంబంధించిన పాత వివాదాల‌న్నీ వెలుగులోకి వ‌స్తున్నాయి. గ‌తంలో అత‌ను భార్య మీద దాడి చేసి గృహ హింస కేసు ఎదుర్కొన్నాడు. ఈ కేసులో రెండు వారాల పాటు జైల్లో కూడా ఉన్నాడు. అలాగే ఒక హోట‌ల్లో వెయిటర్ మీద దాడి చేశాడు. అలాగే మ‌ద్యం తాగి ఒక యాక్సిడెంట్ కూడా చేశాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు. అలాగే అరుదైన ప‌క్షుల‌ను అక్ర‌మంగా బంధించి ఉంచాడ‌నే కేసు.. ఓ మ‌హిళ‌పై దాడి కేసు.. ఇలా ద‌ర్శ‌న్ వివాదాస్ప‌ద వ్య‌వ‌హారాల జాబితా చాలా పెద్ద‌దే.

ఐతే వాట‌న్నింటి నుంచి సులువుగానే బ‌య‌ట‌ప‌డ్డ ద‌ర్శ‌న్.. ఇప్పుడు ఏకంగా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడిగా పోలీసుల‌కు చిక్కాడు. మ‌రి ఈ కేసు నుంచి కూడా ఇంత‌కుముందులాగే బ‌య‌టికి వ‌చ్చేస్తాడా.. లేక శిక్ష అనుభ‌విస్తాడా అన్నది చూడాలి.