పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందాక అభిమానులకు రోజుకో హై ఇస్తున్న పవన్ కళ్యాణ్ వాళ్లకు అసలు సినిమాల సంగతే గుర్తు రానంత రేంజ్ లో వివిధ రూపాల్లో కిక్ అందిస్తున్నాడు. చిరంజీవి ఇంటికి వెళ్లడం, ప్రధాని మోడీతో తుఫానని పిలిపించుకోవడం, ఢిల్లీలో ముఖేష్ అంబానీ దగ్గరికొచ్చి మరీ కౌగిలించుకోవడం, నార్త్ ఛానల్స్ లో ఎలివేషన్లు దక్కడం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో ఈ హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే పవన్ నిర్మాతలు పడుతున్న టెన్షన్ వేరే ఉంది. హరిహరవీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లు అత్యవసరంగా పూర్తి చేయాల్సిన ఒత్తిడి మీదున్నాయి .
మరి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఇప్పటికిప్పుడు షూటింగులకు ఉంటుందానేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. దానికి పవర్ స్టార్ మనసులో పక్కా ప్రణాళిక ఉందని సన్నిహితుల మాట. ముందు హరిహర వీరమల్లు పూర్తి చేయాలి కాబట్టి దానికి అనుగుణంగానే జుత్తు పెంచుతున్నాడని, కీలకమైన సమావేశాలకు, వేడుకలకు సైతం హెయిర్ కట్ చేయకపోవడానికి కారణం గెటప్ లోని ఒరిజినాలిటీ కోసమేనని అంటున్నారు. అది పూర్తి చేయడం ఆలస్యం ఓజి కోసం తిరిగి రెగ్యులర్ స్టయిల్ లోకి వచ్చేస్తారని చెబుతున్నారు. అయితే నెలలో కనీసం రెండు వారాలు జనసేన కోసం కేటాయించే అవసరం పవన్ మనసులో ఉందట.
పిఠాపురం బాధ్యతలు, జనసేన వ్యవహారాలు, ఒకవేళ ఏదైనా మినిస్ట్రీ తీసుకుంటే దానికి సంబంధించిన పనులు ఇవన్నీ చూసుకుంటూనే డేట్లు మేనేజ్ చేసుకోవాలి. బాలకృష్ణ సమర్ధవంతంగా రెండు పడవల ప్రయాణం చేస్తూ వచ్చారు కానీ ఆయనకు పార్టీ అధ్యక్షుడినే ప్రెజర్ లేదు. కాబట్టి ఇబంది కలగలేదు. కానీ పవన్ అలా కాదు. గెలిచిన ఇరవై ఒక్క సీట్ల బాగోగులు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. జీతం తీసుకుని జవాబుదారిగా ఉంటానని చెప్పాడు కాబట్టి దానికి అనుగుణంగానే ప్లాన్ ఉండాలి. ఎలా చూసుకున్నా విడుదల తేదీలు మాత్రం అటుఇటు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates