సెంచరీ మిస్సయిన రామోజీరావు !

ఈనాడు సంస్థల అధిపతిగా, మీడియా మొఘల్ గా ప్రసిద్దికెక్కిన రామోజీరావు ఒక మంచి నిర్మాత కూడా. ప్రపంచంలోనే పెద్దదయిన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించడమే కాదు ఆయన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద 85 సినిమాలను ఆయన నిర్మించారు. ఎందరో ప్రతిభ ఉన్న దర్శకులు, నటీనటులను ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించారు.

మయూరి, మౌనపోరాటం, ప్రతిఘటన, మనసు మమత, అశ్వని, పీపుల్స్ ఎన్ కౌంటర్, ఆనందం, నువ్వేకావాలి వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే సినిమాలను ఆయన నిర్మించారు. ఈ సంస్థ చివరగా 2015లో తీసిన సినిమా రాజేంద్రప్రసాద్ హీరోగా దాగుడు మూతా దండాకోర్. దర్శకుడు క్రిష్ సమర్పణలో ఆర్.కె. మలినేని దీనికి దర్శకత్వం వహించాడు

ఆయితే ఆ తర్వాత మరో 15 సినిమాలు తీసి సెంచరీ కొట్టాలని రామోజీరావు ప్రయత్నించారు. కొందరు హిట్ దర్శకులను పిలిపించుకుని ఉషాకిరణ్ మూవీస్ కథలు కూడా సిద్దం చేసింది. 2019 సమయంలో మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ ను యాక్టివ్ చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. కొంత మందికి సంస్థ అడ్వాన్సులు కూడా ఇచ్చింది. అయితే ఈ ప్రయత్నాలలో ఉండగానే కరోనా విపత్తు రావడం, ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిరుచులు మారడంతో రామోజీరావు ఆ ప్రయత్నాలను పక్కన పెట్టేశారు. ఆ విధంగా సెంచరీ కొట్టాలన్న కోరిక తీరకుండానే ఆయన మరణించారు.