శర్వా కాజల్ సిక్సులు కొట్టాల్సిందే

ఫలితాల రూపంలో ఎన్నికల హడావిడి పూర్తిగా తగ్గిన తర్వాత వస్తున్న మొదటి శుక్రవారం ఈ రోజు. నిన్నటిదాకా ఐపీఎల్, ఎలక్షన్లు, ఎండలు అంటూ రకరకాల కారణాలు బాక్సాఫీస్ దగ్గర సందడి లేకుండా చేశాయి. యావరేజ్ టాక్ వచ్చినవి సైతం రెండు మూడు రోజులు హంగామా చేయడం తప్పించి పట్టుమని వారం రోజులు బలంగా వసూళ్లు రాబట్టినవి లేవు. అంచనాలు భారీగా మోసుకొచ్చిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి సైతం ఇదే దారి పట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తం పదకొండు సినిమాలు రిలీజ్ కావడం ఆసక్తి రేపుతున్నా వాటిలో అధిక దృష్టి మనమే, ఆపై సత్యభామ మీదే మాత్రమే ఉంది.

ముందుగా మనమే సంగతి చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పట్టున్న శర్వానంద్ ఒకే ఒక జీవితం తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చినా సరే ఈసారి ఫలితం మీద రెట్టింపు నమ్మకంతో ఉన్నాడు. హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు ఖచ్చితంగా హిట్టు దక్కాల్సిన టైంలో వాళ్ళ కెరీర్ కి ఇది కీలక పరీక్ష కానుంది. ఇంకో వైపు రిలీజయ్యాక అందరూ హేశం అబ్దుల్ వహాబ్ పాటల గురించే మాట్లాడుకుంటారని టీమ్ పదే పదే చెప్పడం అంచనాలు పెంచుతోంది. పిల్లల సెలవులు పూర్తి కావొస్తున్న వేళ కుటుంబ ప్రేక్షకులు థియేటర్ ఆప్షన్ గా ముందు చూసేది మనమే.

ఇక కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సత్యభామ పేరుకి క్రైమ్ థ్రిల్లరే అయినా అన్ని వర్గాలు చూసే అంశాలు, సందేశాలు చాలా ఉన్నాయని టీమ్ చెబుతోంది. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూర్చడం ఆసక్తిని పెంచుతోంది. సోలోగా కాజల్ ఎప్పుడూ చేయని ప్రయత్నమిది. అందుకే ప్రీమియర్లకు దగ్గరుండి వెళ్లి మరీ జనాల రియాక్షన్లు చూస్తోంది. ఈ రెండు కాకుండా రక్షణ, లవ్ మౌళి, ప్రేమించొద్దు, నమో అంటూ ఇంకొన్ని చిన్న సినిమాలున్నాయి కానీ అనూహ్యమైన టాక్ వస్తేనే వీటి వైపు పబ్లిక్ ఫోకస్ వెళ్తుంది. చూడాలి మరి టికెట్ కాంటర్లకు ఊపు ఎవరు తెస్తారో.