రజనీకాంత్ పంచులు గుర్తుకొచ్చాయా రాజా

గత ఏడాది విడుదలైన జైలర్ సినిమాలో రజినీకాంత్ డైలాగు ఒకటి బాగా పాపులర్. బెంగళూరు జైల్లో ఒక ఖైదీని ఉద్దేశించి తప్పు చేస్తే ఉపేక్షించనంటూ క్లాసు పీకి చివర్లో అర్థమయ్యిందా రాజా అంటూ కొసమెరుపు ఇస్తారు. ఇది ఫ్యాన్స్ కే కాదు సగటు ప్రేక్షకులకూ బాగా రీచ్ అయ్యింది. ఇప్పుడు దీని ప్రస్తావనకు కారణముంది. నిన్న సంవత్సరం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జరిగిన వేడుకలో రజని మాట్లాడుతూ చంద్రబాబునాయుడు దార్శనికతను, విజన్ 2020, హైటెక్ సిటీని ప్రస్తావించి పొగడ్తల వర్షం కురిపించారు.

ఇది సహజంగానే అప్పుడు అధికారంలో ఉన్న వైసిపి నేతలకు నచ్చలేదు. పక్క రాష్ట్రం హీరో అనే కనీస విచక్షణ లేకుండా మాటల దాడి చేశారు. కొడాలి నాని కాస్త గట్టిగానే నోరు పారేసుకున్నారు. వీరా లాంటి బ్లాక్ బస్టర్స్ లో భాగమైన విషయమే మర్చిపోయి రోజా ఏకంగా తమిళంలోనే విమర్శలు చేయడం అభిమానులకు ఆగ్రహం కలిగించింది. వీళ్ళతో మరికొందరు కూడా శృతి కలిపారు. ఈ రచ్చ రజని దృష్టికి పోకుండా లేదు . సందర్భం కోసం ఎదురు చూసిన ఆయన జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గట్టి చురకలు వేశారు. దారిలో వెళ్తుంటే అరిచేవాళ్ళను ఉద్దేశించి పంచులు వేసి చివర్లో అర్థమయ్యిందా రాజా అన్నారు.

ఇప్పుడు చంద్రబాబునాయుడు అమోఘ విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. సరికొత్త రికార్డు సృష్టించారు. ఎవరైతే బాబుని పొగిడినందుకే రజని మీద విరుచుకుపడ్డారో సదరు మంత్రులు, ఎమ్మెల్యేలు దారుణంగా ఓటమి పాలయ్యారు. కొన్ని రౌండ్లు పూర్తి కావడం ఆలస్యం కౌంటింగ్ సెంటర్ నుంచి పలాయనం సాగించారు. మౌనంగా ఉంటే పోయేదానికి అనవసరంగా తమిళ ఫ్యాన్స్ తో మాటలు పడటం ఇప్పుడు మరోసారి ఆ వ్యవహారాన్ని గుర్తుకు వచ్చేలా చేసింది. అందుకే పొలిటిక్స్ లో దూకుడుతనం బూమరాంగ్ లాంటిది. అవసరం లేకుండా వాడితే రివర్స్ లో తగులుతుంది.