అదేంటి బాలకృష్ణ ఎమ్మెల్యేగా మూడో సారి గెలిస్తే ఒక హ్యాట్రిక్ కదా మరి రెండోది ఏంటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. హిందూపూర్ ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న బాలయ్య అటు సినిమాల్లోనూ ఇదే తరహా జోరుని చూపించడం వల్ల డబుల్ అనే పదం వాడాల్సి వచ్చింది.
రూలర్, ఎన్టీఆర్ బయోపిక్ ఇలా వరస ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు, అఖండతో తిరిగి తన బాక్సాఫీస్ స్టామినా చాటాక కరోనా సమయంలోనూ థియేటర్లు వసూళ్లతో కళకళలాడాయి. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలు అమోఘమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఇలా వరసగా సినిమాల్లో మూడు బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య ఇప్పుడు పాలిటిక్స్ లోనూ ఇలాంటి ఫీట్ సాధించడం పట్ల అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. ముప్పై వేలకు పైగా మెజారిటితో గత రెండు దఫాల కన్నా ఎక్కువ ఆధిక్యం సంపాదించడం చూస్తుంటే అక్కడి ప్రజల ప్రేమ, మద్దతు బలంగా దక్కించుకున్నట్టు అర్థమవుతోంది.
బాలకృష్ణ ఆనందం దీంతో సరిపోవడం లేదు. ఒకపక్క చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం, ఇంకోవైపు అల్లుడు లోకేష్ మంగళగిరి నుంచి భారీగా గెలిచి శాసనసభలో కాలు మోపడం దాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
కొన్ని అరుదైన దృశ్యాల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లతో కలిసి బాలకృష్ణ అసెంబ్లీకి వెళ్లడం, పరస్పర మంతనాలు, అభివృద్ధి ప్రణాళికలో భాగం కావడం లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రచారం సమయంలో అలుపెరగకుండా ఎండల్లో తిరిగిన బాలయ్య దానికి తగ్గ గొప్ప ఫలితాన్ని అందుకున్నారు. హిందూపురం మీద తన పట్టుని మరోసారి నిలుపుకున్నారు. ఎమ్మెల్యే హోదాని కాపాడుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న ఎన్బికె 109 టైటిల్ ని జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసే ప్లానింగ్ జరుగుతోంది.